Festival Travel: సంక్రాంతి జర్నీపై ‘ఓమిక్రాన్’ ఎఫెక్ట్.. పండుగ జరుపుకునేదేలా?

సంక్రాంతికి ప‌ట్ట‌ణం లో ఉన్న వారంతా సొంతూళ్ల‌కు ప‌య‌ణ‌మ‌వుతారు. ఏడాదిలో ఎన్ని పండ‌గ‌లు వ‌చ్చినా సంక్రాంతికి మాత్రం సొంతూళ్ల‌కు వెళ్లాల్సిందే.

  • Written By:
  • Updated On - January 11, 2022 / 09:01 PM IST

సంక్రాంతికి ప‌ట్ట‌ణం లో ఉన్న వారంతా సొంతూళ్ల‌కు ప‌య‌ణ‌మ‌వుతారు. ఏడాదిలో ఎన్ని పండ‌గ‌లు వ‌చ్చినా సంక్రాంతికి మాత్రం సొంతూళ్ల‌కు వెళ్లాల్సిందే. ప‌ట్ట‌ణం నుంచి ప‌ల్లెకి వ‌చ్చి అక్క‌డి ప‌చ్చ‌ని పంట పొలాలు, చ‌ల్ల‌టి వాతావ‌ర‌ణంతో ఎంతోగానో ఎంజాయి చేస్తారు. అయితే గ‌త రెండు ఏళ్లుగా సంక్రాంతిపై క‌రోనా పంజా విసురుతుంది. స‌రిగ్గా సంక్రాంతి స‌మ‌యంలోనే ఈ క‌రోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఈ సారి ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో సంక్రాంతికి సొంతూళ్ల‌కు వ‌చ్చే వారి ప్ర‌యాణాల‌పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. క‌రోనా కేసులు పెరిగే కొద్దీ ప్ర‌జ‌ల క‌ద‌లిక‌ల‌పై ఆంక్ష‌లు విధించ‌బ‌డుతున్నాయి. గ‌తంలో లాక్ డౌన్ స‌మ‌యంలో ఇత‌ర రాష్ట్రాల నుంచి ప్ర‌యాణికులను అనుమ‌తించ‌లేదు. అయితే ఆ తరువాత కేసులు త‌గ్గ‌డంతో ప‌బ్లిక్ ట్రాన్స్ పోర్ట్‌, ప్ర‌వేట్ ట్రాన్స్ పోర్ట్ ని అనుమ‌తి ఇచ్చారు.

తాజాగా మ‌ళ్లీ కేసులు పెరుగుతుండ‌టంతో ప్రజా ర‌వాణా వ్య‌వ‌స్థ‌పై కొంత ఆంక్ష‌లు కొన‌సాగే అవ‌కాశం ఉంది. అయితే పండుగ స‌మ‌యం కావ‌డంతో ఏపీలో మాత్రం జ‌న‌వ‌రి 18 నుంచి 31 వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూని విధించారు. దీంతో ప్ర‌యాణికుల‌కు కొంత వెసులుబాటు క‌లిగింది. ఎందుకుంటూ హైద‌రాబాద్‌, బెంగుళూరు, చెన్నై లో చాలా మంది ఏపీ ప్ర‌జ‌లు నివసిస్తుంటారు. వీరంతా సంక్రాంతికి సొంతూళ్ల‌కు వ‌చ్చి వెళ్తుంటారు కాబ‌ట్టి వీరికి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఆంక్ష‌ల‌ను పండుగ త‌రువాత ఏపీ ప్ర‌భుత్వం విధించింది. ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చడానికి ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. జనవరి 14, 15, 16 తేదీల‌కు ముందు, తర్వాత వ‌రుస‌గా 6,000 బస్సులు న‌డుపుతుంది.

క‌రోనా నేప‌థ్యంలో బ‌స్సుల్లో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమ‌ల‌రావు తెలిపారు. బస్ స్టేషన్లు, బ‌స్సుల్లో శానిటైజేషన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని.. అలాగే ప్రయాణీకులు భౌతిక దూరాన్ని పాటించ‌డం, హ్యాండ్ శానిటైజర్‌లను ఉపయోగించడం, ఫేస్ మాస్క్ లు ధరించడం త‌ప్ప‌కుండా చేయాల‌ని ఆయ‌న ప్ర‌యాణికుల‌ను కోరారు. వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయంతో కొంతమంది తమ ప్రయాణ ప్రణాళికలను నిలిపివేసుకోవ‌చ్చ‌ని.. అయితే ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా ఎక్కువ సంఖ్య‌లో ప్రత్యేక బస్సులు నడపబడుతున్నాయని తెలిపారు.50 శాతం టికెట్లు ముందుగానే బుక్ చేసుకోవ‌డం జ‌రిగింద‌ని వివ‌రించారు.
ప్రజలకు తన సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి, ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవలను సజావుగా నిర్వహించడం కోసం హైదరాబాద్, చెన్నై మరియు బెంగళూరులోని ప్రధాన నగరాల్లో 350 మంది అధికారులు, సూపర్‌వైజర్లు, సిబ్బందిని నియమించింది. ప్రజలు తమకు అవసరమైన సమాచారాన్ని పొందేందుకు వీలుగా ప్రత్యేక ఫోన్ లైన్ (0866 2570005)తో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.