Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు కేంద్రమంత్రిత్వ శాఖ సహకారం అవసరమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన నేడు న్యూఢిల్లీలో కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్‌ను కలిశారు. లోకేశ్ మాట్లాడుతూ, విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డాటా సిటీ ఏర్పాటు అత్యవసరం అని తెలిపారు. దీనివల్ల రాష్ట్రం టెక్నాలజీ హబ్‌గా ఎదగగలదని, ఏపీ యువతకు అవసరమైన సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ అందించవచ్చని చెప్పారు. వలస వెళ్తున్న కార్మికుల సంక్షేమం, భద్రత కోసం ప్రవాస భారతీయ బీమా యోజన విస్తరణ అవసరమని, ఈ తరహా ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటుపై కేంద్రం దృష్టి సారించాలని కోరారు.
అలాగే, ఓవర్సీస్ ట్రైనింగ్, మైగ్రేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు ఫాస్ట్ ట్రాక్ అనుమతులు, నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వ బృందం సింగపూర్ పర్యటనలో జరిగిన చర్చలను వివరించారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ ప్రభుత్వ అనుభవం, సహకారం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల ప్రవాసాంధ్రులు ఉన్నారని, అందులో 10 లక్షల మంది అమెరికాలో, 8 లక్షలు గల్ఫ్ దేశాల్లో, 4 లక్షల మంది ఐరోపా దేశాల్లో ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా అమెరికాలో తలసరి ఆదాయం 70 వేల డాలర్లు కాగా, ప్రవాసాంధ్రుల ఆదాయం 1.26 లక్షల డాలర్లకు చేరిందని వివరించారు.
Boat Capsizes : నైజీరియాలోని సోకోటోలో పడవ బోల్తా..40 మంది గల్లంతు
భారత్‌ను ప్రపంచ నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఏపీ కూడా భాగస్వామ్యం అవుతుందని లోకేశ్ అన్నారు. ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా, జపాన్, కొరియా, తైవాన్‌లతో మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్‌షిప్ (MMPA) ఏర్పాటు చేస్తున్న కేంద్ర చర్యలు అభినందనీయమని వ్యాఖ్యానించారు. రాష్ట్రస్థాయిలో ఈ ఒప్పందాలను అమలు చేసేందుకు ఏపీ సిద్ధంగా ఉందని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ రంగంలో జాయింట్ ట్రైనింగ్, అసెస్‌మెంట్ కోసం ట్విన్నింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాటు చేసేందుకు రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. యువత, పారిశ్రామిక సంస్థల మధ్య అనుసంధానానికి “నైపుణ్యం పోర్టల్” ప్రారంభించనున్నామని వెల్లడించారు.
ముఖ్యంగా జపాన్, కొరియా, తైవాన్ దేశాలతో కలిసి ఉమ్మడి మైగ్రేషన్ అండ్ మొబిలిటీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఈ ప్రాజెక్టులు ఏపీ యువతకు మెరుగైన విదేశీ ఉద్యోగావకాశాలను కల్పించడమే కాకుండా పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం రాష్ట్రానికి రప్పించేందుకు సహాయపడతాయని తెలిపారు. చివరగా, విదేశాల్లో ఉద్యోగావకాశాల కోసం ఏపీ యువతకు పూర్తి సహకారం అందించేందుకు డేటా షేరింగ్‌లో కేంద్రం సహాయం చేయాలని మంత్రి లోకేశ్ జైశంకర్‌ను కోరారు.