Site icon HashtagU Telugu

Chiru and Jagan : వైసీపీ న‌ర్సాపురం అభ్య‌ర్థి చిరు?

Chiru Jagan

Chiru Jagan

రాజ‌కీయ నాయ‌కులు స‌ర్వ‌సాధారణంగా పొలిటిక‌ల్ కోణం నుంచే అడుగులు వేస్తారు. ప్ర‌త్యేకంగా మెగాస్టార్ చిరంజీవిని ఏపీ సీఎం జ‌గ‌న్ ఆహ్వానించాడు. అంటే, రాజ‌కీయ కోణం వాళ్లిద్ద‌రి భేటీలో లేద‌ని చెప్ప‌లేం. అందులోనూ ఈ భేటీకి 24 గంట‌ల ముందు చిరంజీవి పెట్టిన పార్టీ గురించి చంద్ర‌బాబు ప్ర‌స్తావించాడు. ఆ రోజున ప్ర‌జారాజ్యం లేకుంటే 2009లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చేద‌ని అవ‌లోకించాడు. అప్పుడు..ఇప్పుడు చిరంజీవి సాన్నిహిత్యంగా ఉంటాడ‌ని చంద్ర‌బాబు ఎందుకు చెప్పాడో…ఇప్పుడు అనుమానం రాక‌మాన‌దు.న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజు (త్రిబుల్ ఆర్‌) ఏ రోజైనా రాజీనామా చేయ‌డానికి సిద్ధం అయ్యాడు. ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయించ‌డానికి చాలా కాలంగా వైసీపీ ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇటీవ‌ల సేక‌రించిన స‌ర్వేల ఆధారంగా ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని త్రిబుల్ ఆర్ భావిస్తున్నాడ‌ట‌. సంక్రాంతి సంద‌ర్భంగా రెండు రోజులు భీమవ‌రంలో ఉండ‌డానికి ఢిల్లీ నుంచి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఆ సంద‌ర్భంగా ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ ఏ మాత్రం వెనుక‌డుగు వేయ‌కుండా భీమ‌వ‌రం రావడానికి త్రిబుల్ ఆర్ ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఆయ‌న్ను ఆహ్వానిస్తూ ప‌వ‌న్, త్రిబుల్ ఆర్ ల‌తో కూడిన హోర్డింగ్ ల‌ను భీమ‌రంలో ఏర్పాటు చేశారు. వాటిని చూసిన వాళ్లు జ‌నసేన‌లోకి త్రిబుల్ ఆర్ వెళుతున్నాడా? అనే ప్ర‌శ్న వేసుకుంటున్నారు. రాజీనామాకు సిద్ధ‌ప‌డ్డ త్రిబుల్ ఆర్, జ‌న‌సేనాని ప‌వ‌న్ మీద ఆశ‌లు పెట్టుకున్నాడని హోర్డింగ్ ల ద్వారా అర్థం అవుతోంది.

Also Read : ఆచార్య ‘అమ‌రావ‌తి’ యాత్ర‌

ఒక వేళ ఉప ఎన్నిక‌లు వ‌స్తే, టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ , కాంగ్రెస్‌, క‌మ్యూనిస్ట్ ల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా త్రిబుల్ బ‌రిలోకి దిగుతాడు. పార్టీల‌కు అతీతంగా అమ‌రావ‌తి ఎజెండాపై ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ఆయ‌న ఆలోచ‌న‌. ఆ మేర‌కు వ్యూహాత్మ‌క స్కెచ్ ఆయా పార్టీల‌తో క‌లిసి ఇప్ప‌టికే వేసిన‌ట్టు స‌మాచారం. వైసీపీ ఓడిపోవ‌డానికి అవ‌కాశాలు ఎక్కువ ఉన్నాయ‌ని తాజాగా ఆయ‌న చేయించుకున్న స‌ర్వేల‌ సారాంశం. అందుకే, జ‌గ‌న్ ఇప్ప‌టి నుంచే అప్ర‌మ‌త్తం అయ్యాడ‌ని ఆ పార్టీ వ‌ర్గాల టాక్‌. ఆ క్ర‌మంలోనే చిరంజీవికి ప్ర‌త్యేకంగా జ‌గ‌న్ పండుగ రోజు ఆహ్వానం పంపాడ‌ని తాడేప‌ల్లి ప్యాలెస్ టాక్‌.ఇప్ప‌టి వ‌ర‌కు మూడుసార్లు ఏపీ సీఎం జ‌గ‌న్ ను చిరంజీవి క‌లిశాడు. తొలిసారి సినీ పెద్ద‌లంద‌రితో క‌లిసి భేటీ అయ్యాడు. మ‌లి విడ‌త ఫ్యామిలీ తో క‌లిసి తాడేప‌ల్లి ప్యాలెస్ లోని జ‌గ‌న్‌ను క‌లిశాడు. ఆ సంద‌ర్భంగా రాజ‌కీయ‌ప‌ర‌మైన చ‌ర్చ వాళ్లిద్ద‌రి మ‌ధ్యా వ‌చ్చిన‌ట్టు అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. త్వ‌ర‌లోనే వైసీపీ గూటికి చిరంజీవి చేర‌తార‌ని టాక్ న‌డిచింది. ఇప్పుడు మ‌ళ్లీ చిరంజీవిని సింగిల్ గా ఆహ్వానించడం వెనుక జ‌గ‌న్ రాజ‌కీయ కోణం ఉంద‌ని అనుమానం క‌లుగుతోంది. న‌ర్సాపురం లోక్ స‌భ‌ ఎన్నిక‌లు అనివార్యం అయితే చిరంజీవిని బ‌రిలోకి దించే ఆలోచ‌న వైసీపీ చేస్తున్న‌ట్టు వినికిడి.
ప్ర‌స్తుతం చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నాడు. స‌భ్య‌త్వం ఉన్న‌ప్ప‌టికీ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రు కావ‌డంలేదు. పైగా రాజ‌కీయాల ప్ర‌స్తావ‌న ఎక్క‌డా తీసుకురావ‌డంలేదు. సినిమాలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. టాలీవుడ్ పెద్ద‌గా ఫోక‌స్ ఇటీవ‌ల అయిన‌ప్ప‌టికీ దానిపై విమ‌ర్శ‌లు రావ‌డంతో సినిమా బిడ్డ‌గా మాత్ర‌మే ఈ భేటీల‌కు హాజ‌ర‌వుతున్నానంటూ ప‌దేప‌దే చెబుతున్నాడు. రాజ‌కీయ పార్టీలు మాత్రం ఆయ‌న్ను ఆక‌ర్షించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని చంద్ర‌బాబు మాట‌ల ద్వారా అర్థం అవుతోంది.

అపోలో ఆస్ప‌త్రి యాజ‌మాన్యంకు, వైఎస్ ఫ్యామిలీకి ద‌గ్గ‌ర సంబంధాలు ఉన్నాయి. హీరో రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస న మెగా ఫ్యామిలీ మెంబ‌ర్‌. ఆ కోణం నుంచి వైఎస్ కుటుంబానికి ,చిరంజీవి ఫ్యామిలీకి రిలేష‌న్ ఉంది. రాజ‌కీయాల‌కు ఉపాస‌న దూరంగా ఉంటున్న‌ప్ప‌టికీ ఇటీవ‌ల మోడీని క‌లిసింది. ఆ భేటీ సంద‌ర్భంగా కూడా ప‌లు రాజ‌కీయ ఊహాగానాలు వ‌చ్చాయి. కానీ, ఇప్పుడు చిరంజీవి, జ‌గ‌న్ భేటీ త‌రువాత రాజ‌కీయ ప‌రిణామాల మార్పున‌కు అవ‌కాశం క‌నిపిస్తోంది. పైగా లంచ్ మీట్ ముగిసిన త‌రువాత చిరంజీవి స్పంద‌న గ‌మ‌నిస్తే..జ‌గ‌న్ కుటుంబాన్ని ఆకాశానికి ఎత్తేశాడు.మెగా స్టార్ చిరంజీవికి సీఎం జ‌గ‌న్ పండుగ రోజు విందు ఇచ్చాడు. జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి భోజ‌నం వ‌డ్డించ‌డాన్ని చిరు ప్ర‌త్యేకంగా చెప్పాడు. జ‌గ‌న్ దంప‌తుల అప్యాయ‌త‌, అభిమానంకు మురిసిపోయాడు. మ‌ళ్లీ క‌లుద్దామ‌ని జ‌గ‌న్ చెప్ప‌డం సంతృప్తిక‌రంగా ఉంద‌ని చిరంజీవి వెల్ల‌డించాడు. టిక్కెట్ల ధ‌ర‌ల‌పై రెండు మూడు వారాల్లో ఏదో ఒక రిపోర్ట్ వ‌స్తుంద‌ని ముక్తాయించాడు. ఆయ‌న మాట‌ల్లోని ఆంత‌ర్యం..ఇటీవ‌ల రాజ‌కీయ ప‌రిణామాలు గ‌మ‌నిస్తే..త్వ‌ర‌లోనే చిరంజీవి వైసీపీ కండువా క‌ప్పుకునే ఛాన్స్ ఉంద‌ని బోగ‌ట్టా. అదే జ‌రిగితే, న‌ర్సాపురం ఉప ఎన్నిక బ‌రిలోకి వైసీపీ త‌ర‌పున చిరంజీవిని జ‌గ‌న్ దింపుతార‌న‌డంలో ఎలాంటి సందేహం ఉండ‌దు. చిరంజీవి, జ‌గ‌న్ మ‌ధ్య జరిగిన భేటీలో రాజ‌కీయ అంశాలు రాకుండా ఎందుకు ఉంటాయ‌ని పేరు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌ని ఓ వైసీపీ సీనియ‌ర్ లీడ‌ర్ ఫోన్లో తెలిపాడు. వాళ్లిద్ద‌రి మ‌ధ్యా భేటీ కేవ‌లం సినిమా టిక్క‌ట్ల‌పై మాత్రం జ‌రిగింద‌ని మ‌రో వైసీపీ నేత చెబుతున్నాడు. న‌ర్సాపురం ఎంపీ అభ్య‌ర్థిగా వైసీపీ నుంచి చిరంజీవి బ‌రిలో దిగడం కేవ‌లం ఊహాగాన‌మేనంటూ మ‌రో కీల‌క నేత కొట్టిపారేశాడు. ఇలా భిన్న స్వ‌రాలు చిరు, జ‌గ‌న్ భేటీపై వినిపించ‌డం గ‌మ‌నార్హం.