NTR Vs CBN : విధిరాత‌.. నాడు ఎన్టీఆర్ నేడు చంద్ర‌బాబు శ‌ప‌థం

`విధి చాలా బ‌లీయ‌మైన‌ది..దాన్ని ఎవ‌రూ ఎదుర్కోలేరు. .ఎవ‌రైన త‌లొంచి న‌డ‌వాల్సిందే..` ఇవీ అసెంబ్లీలో ఒక‌నాడు మాజీ సీఎం రోశ‌య్య అన్న మాట‌లు.

  • Written By:
  • Publish Date - November 19, 2021 / 02:25 PM IST

`విధి చాలా బ‌లీయ‌మైన‌ది..దాన్ని ఎవ‌రూ ఎదుర్కోలేరు. .ఎవ‌రైన త‌లొంచి న‌డ‌వాల్సిందే..` ఇవీ అసెంబ్లీలో ఒక‌నాడు మాజీ సీఎం రోశ‌య్య అన్న మాట‌లు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అకాల మ‌ర‌ణం త‌రువాత సీఎం బాధ్య‌త‌లు స్వీక‌రించిన కొణిజేటి రోశ‌య్య చెప్పిన మాట‌లు అవి. ఇప్పుడు ఆ మాట‌లు ఏపీ అసెంబ్లీని చూస్తే గుర్తుకు వ‌స్తున్నాయి. ఎందుకంటే, ఒక‌ప్పుడు ఎన్టీఆర్ అసెంబ్లీని బ‌హిష్క‌రించి వెళ్లాడు. ఆనాడు జ‌రిగిన అవ‌మానాన్ని భ‌రించ‌లేక కుంగి కుసించిపోయాడు ఎన్టీఆర్. ఆనాడు ఎన్టీఆర్ కు జ‌రిగిన ప‌రాభ‌వానికి కార‌ణం అప్ప‌ట్లో ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు, స్పీక‌ర్ గా ఉన్న య‌న‌మ‌ల రామ‌క్రిష్ణుడు.

 


ఆ సంఘ‌ట‌న ఉమ్మ‌డి ఏపీ అసెంబ్లీ వేదిక‌గా 1995లో చోటుచేసుకుంది. ల‌క్ష్మీపార్వ‌తిని బూచిగా చూపి చంద్ర‌బాబునాయుడు సొంత మామ ఎన్టీఆర్ ను ప‌ద‌వీచ్యుతుడ్ని చేశాడు. సీఎంగా ఉన్న ఎన్టీఆర్ ను దింపేసి ఎమ్మెల్యేల బ‌లాన్ని చంద్ర‌బాబు కూడ‌గ‌ట్టుకున్నాడు. ఆ సంద‌ర్భంగా జ‌రిగిన బ‌ల‌ప‌రీక్ష స‌మ‌యంలో స‌భ్యులు అంద‌రికీ మాట్లాడేందుకు అవ‌కాశం ఇచ్చాడు ఆనాడు స్పీక‌ర్‌గా ఉన్న య‌న‌మ‌ల రామ‌క్రిష్ణుడు. ఎమ్మెల్యే హోదాలో ఎన్టీఆర్ కూడా ఆ స‌భ‌కు వెళ్లాడు. మాట్లాడేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశాడు. కానీ, చంద్ర‌బాబు ఆదేశం మేర‌కు య‌న‌మ‌ల అవ‌కాశం ఇవ్వ‌లేదట‌.

Also Read : భోరున విల‌పించిన చంద్ర‌బాబు

ప‌ద‌వీచ్యుతుడైన ఎన్టీఆర్‌ మాన‌సిక క్షోభ‌ను చెప్పుకునేందుకు అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌య‌త్నించాడు. కానీ, స‌భానాయ‌కుడిగా ఉన్న చంద్ర‌బాబు, స్పీక‌ర్ య‌న‌మ‌ల క‌రుణించ‌లేదు. దాంతో ఎన్టీఆర్ మ‌రింత క్షోభ‌కు గుర‌య్యాడు. ఈ అసెంబ్లీకి మ‌ళ్లీ సీఎంగా వ‌స్తాన‌ని శ‌ప‌థం చేసి ఎన్టీఆర్ బ‌య‌ట‌కు వెళ్లాడు. ఇలాంటి స‌భ‌లో ఉండ‌లేనంటూ ఎన్టీఆర్ క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు. అత్య‌ధిక మెజార్టీతో 1994లో పార్టీని గెలిపించిన టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఆయ‌న‌. అలాంటి లెజెండ్ కు ఆనాడు జ‌రిగిన పరాభ‌వం, అవ‌మానం వ‌ర్ణించ‌లేనిది.

Also Read : అసెంబ్లీని బ‌హిష్క‌రించిన చంద్ర‌బాబు.. మ‌ళ్లీ సీఎంగా వ‌స్తాన‌ని శ‌ప‌థం

త‌న చ‌రిష్మాతో గెలిచిన ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు ప‌క్షాన చేర‌డాన్ని మాన‌సికంగా ఎన్టీఆర్ భ‌రించ‌లేక‌పోయాడు. స్పీక‌ర్ స్థానంలో ఉండే య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు వ్య‌వ‌హ‌రించిన తీరు ఆయ‌న్ను మ‌రింత బాధ పెట్టింది. మారుమూల ఎలాంటి గుర్తింపులేని వాడిని ఎమ్మెల్యేగా చేస్తే..ఇలా వ్య‌వ‌హ‌రిస్తాడా..అని స్పీక‌ర్ య‌న‌మ‌ల తీరుపై ఎన్టీఆర్ క‌ల‌త చెందాడు. చంద్ర‌బాబు, య‌న‌మ‌ల ఆడిన గేమ్ కార‌ణంగా ఎన్టీఆర్‌కు అసెంబ్లీలో మాట్లాడే అవ‌కాశం లేకుండా పోయింది. ఒక్క మాట కూడా మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వ‌క‌పోవ‌డంతో క‌న్నీళ్లు పెడుతూ భార‌మైన మ‌న‌సుతో అసెంబ్లీ ని ఎన్టీఆర్ బ‌హిష్కరించాడు. మ‌ళ్లీ సీఎంగా అసెంబ్లీలోకి అడుగుపెడ‌తానంటూ శ‌ప‌థం చేసి ఎన్టీఆర్ బ‌య‌ట‌కు వెళ్లిన ఆ సీన్ ఇప్పుడు కనిపించింది. ఆనాడు ఎన్టీఆర్ ఎలాగైతే అసెంబ్లీలో అవ‌మాన ప‌డ్డాడో..ఇప్పుడు చంద్ర‌బాబు కూడా ఇంచుమించు అదే త‌ర‌హా బాధ‌తో అసెంబ్లీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. సుమారు 25 ఏళ్ల త‌రువాత విభ‌జిత ఏపీ అసెంబ్లీ వేదిక‌గా అలాంటి సంఘ‌ట‌నే జ‌రిగింది. ఇదే..విధి చాలా బల‌మైన‌ది అని చెప్ప‌డానికి ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం.