NTR Health University : హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్పు.. టీడీపీ రిలే దీక్ష‌ల‌తో ఒరిగిందేంటి..?

తెలుగువాడి ఆత్మ‌గౌర‌వాన్ని ప్ర‌పంచానికి తెలిపిన వ్య‌క్తి స్వ‌ర్గీయ ఎన్టీ రామారావు. తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న న‌ట‌న‌తో...

  • Written By:
  • Publish Date - October 4, 2022 / 02:35 PM IST

తెలుగువాడి ఆత్మ‌గౌర‌వాన్ని ప్ర‌పంచానికి తెలిపిన వ్య‌క్తి స్వ‌ర్గీయ ఎన్టీ రామారావు. తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న న‌ట‌న‌తో కోట్ల మంది అభిమానుల్ని పొందిన ఆయ‌న ఆ త‌రువాత రాజ‌కీయాల్లో ఓ వెలుగు వెలిగారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నెల‌ల వ్య‌వ‌ధిలోనే అధికారంలోకి వ‌చ్చారు. ఆయ‌న అకాల మ‌ర‌ణం చెందిన త‌రువాత టీడీపీ ప‌గ్గాలు చంద్రబాబు చేప‌ట్టారు. కానీ ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ఎన్టీఆర్ అభిమానులు కానీ, టీడీపీ లో కీల‌క నేత‌లు కానీ సైలెంట్‌గా ఉన్నారు. నాడు ఎన్టీఆర్ ప‌క్క‌న ఉన్న నేత‌లు సైతం మౌనం వ‌హించ‌డం టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు మింగుడు ప‌డ‌టం లేదు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మారుస్తూ వైసీపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అయితే దీనిని టీడీపీ లైట్ తీసుకున్న‌ట్లు అనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడి పేరు తీస్తేనే దానిపై పోరాటం చేయ‌లేని టీడీపీ ఇంకా ప్ర‌జల స‌మ‌స్య‌ల‌పై పోరాటం ఏం చేస్తుంద‌నే భావ‌న ప్రజ‌ల్లో క‌లుగుతుంది. అన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో రిలే నిరాహార దీక్ష‌లు పేరుతో టీడీపీ నేత‌లు కాల‌క్షేపం చేస్తున్నారు త‌ట‌ప్ప నిజంగా ఎన్టీఆర్‌కు అన్యాయం జ‌రిగింద‌నే భావ‌న టీడీపీలో క‌నిపించ‌డంలేదు. ఇన్ని రోజులు గ‌డుస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేత‌ల్లో ఒక్క‌రు కూడా కనీసం అమ‌ర‌ణ దీక్ష‌కు దిగుతామ‌ని ఎక్క‌డా ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించిన దాఖ‌లాలు లేవు. ఎవ‌రైన అభిమానులు అమ‌ర‌ణ దీక్ష చేస్తామ‌ని పైస్థాయి నేత‌లకు చెప్పినా అధిష్టానం నుంచి అనుమ‌తి కావాలంటూ వారిని నిరాశ‌ప‌రుస్తున్నారు.

175 నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రుగుతున్న రిలే దీక్ష‌లతో ప్ర‌భుత్వం దిగొచ్చిద్దా లేదా అనేది కూడా ఆలోచ‌న లేకుండా కేంద్ర కార్యాల‌యంలో పార్టీ ప్రోగ్రాం క‌మిటీ ఆదేశించ‌డం నియోజ‌క‌వ‌ర్గాల్లో దీక్ష‌లు చేయ‌డం టైంపాస్‌గా మారింద‌నే అభిప్రాయం క్యాడ‌ర్‌లో వినిపిస్తుంది. నేత‌లు దీక్ష‌ల్లో కూర్చుని ఫోటోల‌కు ఫోజులిచ్చి వాటిని వార్త ప‌త్రిక‌ల్లో వ‌చ్చేలా చేసుకుంటున్నార‌నే త‌ప్ప దీక్ష‌ల వ‌ల్ల ఒరిగిందేమీ లేద‌ని క్యాడ‌ర్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికైనా అధిష్టానం ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్పుపై స‌రైన రీతిలో స్పందించి ఉద్య‌మాన్ని ముందుకు తీసుకెళ్లాల‌ని క్యాడ‌ర్ కోరుతుంది.