NTR Family: హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల స్పందన

విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పేరును మారుస్తూ శాసనసభలో తీర్మానం చేయడంపై నందమూరి కుటుంబం సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

  • Written By:
  • Updated On - September 22, 2022 / 08:08 AM IST

విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పేరును మారుస్తూ శాసనసభలో తీర్మానం చేయడంపై నందమూరి కుటుంబం సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై స్పందిస్తూ నందమూరి రామకృష్ణ పేరుతో నందమూరి కుటుంబం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
హెల్త్ యూనివర్సిటీ పేరులో నుంచి ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని ఖండించింది. ఈ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అని, 1986లో యునివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ పేరుతో దీనిని స్థాపించినట్లు పేర్కొంది.

1998లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీగా పేరు మార్చారని వివరించింది. ఆ తరువాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్‌పై గౌరవంతో డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ వర్సిటీగా నామకరణం చేసినట్లు తెలిపింది. ఆ పేరును నేడు జగన్ మార్చడం దురదృష్టకరమని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ పేరును తొలగించటం అంటే తెలుగు జాతిని అవమానించినట్లేనని పేర్కొంది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని నందమూరి కుటుంబం డిమాండ్ చేసింది.

కాగా, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నా ఎన్టీఆర్ రెండవ భార్య, తెలుగు-సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి మాత్ర నోరు మెదపలేదు. ప్రభుత్వ నిర్ణయం నచ్చక అధికార భాషా సంఘం అధ్య‌క్ష ప‌ద‌వికి యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్ రాజీనామా చేయ‌డంతో ఆమెపై వత్తిడి పెరిగింది. తెలుగు-సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ పదవికి ఆమె రాజీనామా చేయకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రభుత్వ నిర్ణయం, ఇటు యార్లగడ్డ రాజీనామా ఆమెను మరింత ఇరకాటంలోకి నెట్టాయి.