విజయవాడలో ఈ నెల 14న దివంగత ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు.
ఎన్టీఆర్ స్మారక సాహిత్య కమిటీ అధ్యక్షుడు టీడీ జనార్దనరావు శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “గత నెల 24న ఎన్టీఆర్ తొలి సినిమా మన దేశం విడుదలై 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకను నిర్వహిస్తున్నాము” అని తెలిపారు.
ఆయన మాట్లాడుతూ, “తెలుగు సినీ రంగంలోనే కాదు, భారతీయ సినీ రంగంలో కూడా ఎన్టీఆర్ ఒక మేరునగధీరుడు. పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక… ప్రతి పాత్రలోనూ ఆయన మేటి నటుడిగా నిలిచారు. ప్రజల రుణాన్ని తీర్చేందుకు రాజకీయ రంగంలోకి వచ్చిన ఆయన, పేదవాడి మనసును తెలుసుకుని, వాళ్ల అవసరాలను తీర్చేందుకు ఎంతో కృషి చేశారు” అని చెప్పారు.
ఈ వేడుకలకు ఎన్టీఆర్ కుమార్తెలు పురందేశ్వరి, రామకృష్ణ, మోహనకృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, కృష్ణ, రామానాయుడు కుటుంబ సభ్యులు హాజరవుతారని ఆయన తెలిపారు. “సినీ రంగంలో ఎన్టీఆర్‌తో కలిసి పనిచేసిన కళాకారులు, టెక్నీషియన్లు, దర్శకులను కూడా ఆహ్వానిస్తున్నాం” అని జనార్దనరావు చెప్పారు.
ఈ కార్యక్రమం పెనమలూరు నియోజవర్గం పరిధిలో ఉన్న ఓ రిసార్ట్‌లో జరుగుతుందని ఆయన వివరించారు. అలాగే, “ఎన్టీఆర్ నటించిన మన దేశం నుంచి మొదలుకొని 300 సినిమాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారంతో ‘తారక రామం’ అనే పుస్తకాన్ని వజ్రోత్సవ వేడుకలో విడుదల చేయనున్నారు” అని చెప్పారు.
హైదరాబాద్‌లో ఎన్టీఆర్ స్మృతి చిరస్థాయిగా ఉండేందుకు, ఆయన 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి, డిజిటల్ మ్యూజియంతో ఆయనకు సంబంధించిన విశేషాలు ప్రజలకు అందించనున్నట్లు కూడా జనార్దనరావు తెలిపారు.
డిసెంబర్ 14వ తారీఖున మురళీ రిసార్ట్స్, పోరంకి నందు జరగనున్న ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు పై ప్రెస్మీట్ నిర్వహించడమైనది… pic.twitter.com/BHGkSJUZ3N
— TD Janardhan (@tdjanardhan) December 6, 2024