Site icon HashtagU Telugu

NTR: తెలుగోడు మరువలేని రోజు ఇది!

Ntr Tdp

Ntr Tdp

1983 జనవరి 9 వ తేదీ…దీనికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. తెలుగువాళ్లు ఢిల్లీ పాల‌కుల చేతిలో చితికిపోతున్న స‌మ‌యంలో తెలుగువాడి కీర్తిని ఢిల్లీ చాటిచెప్పిన రోజు. రాజకీయం ఏసీ గదులు దాటి గుడిసెకు చేరిన రోజు. పేదవాడికి అన్నం రుచి తెలిసిన రోజు. దేశంలో సరికొత్త రాజకీయం మొదలైన రోజు. తెలుగు నేల పులకించి ప‌ర‌వ‌శించిన రోజు. సరికొత్త ఆంధ్రావనికి నాంది పలికిన రోజు. నందమూరి తారకరాముడు తెలుగుదేశాధీసుడిగా పట్టాభిషిక్తుడైన రోజు. రంగుల ప్ర‌పంచం నుంచి రాజ‌కీయంలోకి వ‌చ్చి 39 ఏళ్ల క్రితం స‌రిగ్గా ఇదే రోజు స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

నంద‌మూరి తార‌క‌రామారావు ప్ర‌జ‌లు మెచ్చిన మ‌నిషి.. వెండి తెర‌మీద త‌న న‌ట‌న‌తో ప్ర‌జ‌ల‌ను ఎంత‌గానో ఆక‌ర్షించారో.. రాజ‌కీయాల్లో కూడా అంతే విధంగా ప్రజ‌ల‌ను ఆక‌ర్షించారు. రాజభవన్ గోడలు ఆయనకు ఇరుకుగా అనిపించాయి. అందుకే తాను లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలని కోరుకున్నారు. రాష్ట్ర చరిత్రలో అంతకు ముందు ఎవ్వరూ రాజభవన్ బయట ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయలేదు ఆ చ‌రిత్ర‌ను స్వ‌ర్గీయ ఎన్టీఆర్ తిర‌గ‌రాశారు. ప్ర‌జ‌ల ఆశీర్వాదాల మ‌ధ్య అంగ‌రంగ‌వైభ‌వంగా ఆయ‌న సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

జనవరి 9 వ తేదీన లాల్ బహదూర్ స్టేడియం రికార్డు సంఖ్యలో రెండున్నర లక్షల మంది జనంతో కిటకిటలాడింది. చాలామంది లోపలికి వెళ్లలేక బయటే ఆగిపోయారు. ఆ చారిత్రక సన్నివేశాన్ని స్వయంగా చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచీ లారీల్లో, రైళ్ళలో, బస్సుల్లో జనాలు తరలివచ్చారు. హైదరాబాద్ నగరమంతా పండుగ వాతావరణం అలముకుంది. ప్ర‌మాణ స్వీకారోత్సవం తర్వాత ప్రజలను ఉద్దేశించి చేసిన అరగంట ప్రసంగంలో రామారావు గారు తాను మ్యానిఫెస్టోలో చేసిన ప్రతి వాగ్దానాన్నీ పూర్తి చేస్తానన్నారు. ప్రజలకు సేవ చేయాలనేదే జీవితంలో తన ఏకైక కోరిక అని ఆయన చెప్పారు. ఎన్టీఆర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన దైనందిక జీవనశైలిలో మార్పులేదు. విశ్రాంతికి అవకాశమే లేదు. ప్రజాసంక్షేమం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయనకు అధికారం అంటే విలాసం కాదు, బాధ్యత. క్రమశిక్షణ, క్రమవర్తన, సమయపాలన ఆయన జీవితసూత్రాలు. అవి ఆయన రాజకీయ జీవితంలో కూడా భాగమయ్యాయి.

ముఖ్యమంత్రిగా జీతము తీసుకోనని ఎన్టీఆర్‌ చెప్పారు. కానీ ప్రభుత్వ నిబంధనలు దానికి ఒప్పుకోవు. అందుకని నెలకు ఒక రూపాయి గౌరవ వేతనంగా తీసుకొనేందుకు అంగీకరించారు. అయితే సీఎంకు అధికార నివాసం ఇస్తారు కానీ ఇది తీసుకోవ‌డానికి ఆయ‌న అంగీక‌రించ‌లేదు. తన అబిడ్స్ ఇల్లు తనకు చాలన్నారు. ఖరీదైన విలాసమంతమైన కార్లను వద్దన్నారు. అంబాసిడర్ కారు చాలన్నారు. ముఖ్యమంత్రి హెూదాకు అనుబంధంగా వచ్చే ఎన్నో విలాసాలను సౌకర్యాలను ఆయన స్వచ్ఛందంగా వదులుకున్నారు. అందుకే ఆయ‌న ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల హృదయాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు.