Site icon HashtagU Telugu

NTPC Green Project In AP: ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం మరో వరం.. రూ.85 వేలకోట్లు పెట్టుబడి…

Ntpc Green Project In Ap

Ntpc Green Project In Ap

NTPC Green Project In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరో శుభవార్తను అందించింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్, రాష్ట్రంలో హైడ్రోజన్ ప్రాజెక్టు కోసం రూ.85 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్టును, అనకాపల్లి జిల్లాలోని పూడిమడక వద్ద ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేయనుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల (నవంబర్) 29వ తేదీన ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, భారత్‌లోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ఫెసిలిటీగా ఆంధ్రప్రదేశ్ మారే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో 1200 ఎకరాల్లో భారీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కోసం 1200 ఎకరాలు కేటాయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా, 600 ఎకరాలలో భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం స్థాపించనున్నారు. ఈ ప్లాంట్ రోజుకు 1100 టన్నుల హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేయనుంది.

అలాగే, 300 ఎకరాల్లో ఎలక్ట్రోలైజర్లు, సోలార్ పీవీ ప్యానెల్స్, బ్యాటరీ స్టోరేజి సిస్టమ్స్ కలిగిన ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయనున్నారు. మిగతా 300 ఎకరాలను మౌలిక వసతుల నిర్మాణం కోసం కేటాయించారు. ప్రాజెక్టు మొదటి దశను మూడు సంవత్సరాలలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నవంబర్ 29న విశాఖపట్నం రానున్నారు:

నవంబర్ 29వ తేదీన విశాఖపట్నం రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ యొక్క శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టును ఎన్టీపీసీ లిమిటెడ్ మరియు ఏపీ జెన్‌కో కలిసి కలిసి అభివృద్ధి చేస్తున్నాయి.

ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ప్రపంచస్థాయిలో ముందుకు అడుగేస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 25,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి, అలాగే పరోక్షంగా 48,000 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయి. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో భాగంగా పూడిమడకలో స్థాపించనున్న ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్, 20 గిగావాట్స్ క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంతో ప్రారంభమవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో బీపీసీఎల్ ప్లాంట్ ఏర్పాటుకు చర్చలు:

మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో బీపీసీఎల్ (భారత్ పెట్రోలియం రిఫైనరీ కార్పొరేషన్) ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే, బీపీసీఎల్ యాజమాన్యం ఈ విషయం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశాలు నిర్వహించింది. ప్రాజెక్టు కోసం అనువైన స్థలాన్ని వెతకడంలో పనులు జరుగుతున్నాయి. ఈ ప్లాంట్ ఏర్పాటుకు రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు.

Exit mobile version