MP Jayadev Galla: రెండు పడవలపై ప్రయాణించడం అంత సులభం కాదు: గల్లా

రాజకీయాల నుండి విరామం తీసుకోవాలని టిడిపి ఎంపి జయదేవ్ గల్లా ఇదివరకే ప్రకటించారు. తాజాగా పార్లమెంటులో ఈ విషయాన్నీ మరోసారి చర్చించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు

MP Jayadev Galla: రాజకీయాల నుండి విరామం తీసుకోవాలని టిడిపి ఎంపి జయదేవ్ గల్లా ఇదివరకే ప్రకటించారు. తాజాగా పార్లమెంటులో ఈ విషయాన్నీ మరోసారి చర్చించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకూడదని తన నిర్ణయాన్ని లోక్‌సభకు తెలియజేశారు.

ఎంపి జయదేవ్ గల్లా మాట్లాడుతూ..నేను వ్యాపారవేత్తనని, రెండు పడవల్లో ప్రయాణించడం అంత సులభం కాదని గల్లా అన్నారు. భారతదేశంలో వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు నడపడానికి వివిధ ఏజెన్సీల నుండి 70 కంటే ఎక్కువ అనుమతులు పొందాలని, వీటిలో ప్రతి ఏజెన్సీని అధికారంలో ఉన్న పార్టీ నడిపిస్తుందని తెలిపారు. ఈ చర్య మేక్-ఇన్-ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్‌కు హానికరమని గల్లా అన్నారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. నేను ప్రజల కోసం పోరాడే వారసత్వాన్ని కలిగి ఉన్న కుటుంబం నుండి వచ్చాను. కానీ ఒకేసారి రెండు పడవల్లో ప్రయాణించడం సులభం కాదు. ప్రజా జీవితంలో ఉండటం మరియు వ్యాపారవేత్తగా కొనసాగడం అంత ఈజీ కాదు. అందుకే నా రాజకీయ జీవితానికి విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అని అన్నారు.

రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ దేశానికి సేవ చేయాలనే నా నిబద్ధత మరియు సంకల్పం అలాగే ఉంటుందని గల్లా చెప్పారు. పెట్టుబడి పెట్టడం, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలను సృష్టించడం మరియు దేశానికి ఆదాయం మరియు సంపదను సృష్టించడం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడాలని నేను ప్లాన్ చేస్తున్నాను అని ఆయన అన్నారు. ప్రస్తుతానికి పార్లమెంటులో ఇదే నా చివరి ప్రసంగం అని అన్నారు.

జయదేవ్ గల్లాకు సంబందించిన కంపెనీలు 17,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయని, వారికి, వారి కుటుంబాలకు అనేక సంక్షేమ చర్యలు చేపడుతున్నాయని ఆయన చెప్పారు. 57 ఏళ్ల జయదేవ్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తల్లి అరుణ కుమారి గల్లా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేయగా, ఆయన తండ్రి రామచంద్ర నాయుడు గల్లా అమర రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీలను స్థాపించారు.

Also Read: Viveka Murder Case: వివేకా హత్య కేసు డైరీని డిజిటలైజ్ చేయాలని సీబీఐను ఆదేశించిన సుప్రీంకోర్టు