Chandrababu Naidu: ఉత్త‌రాంధ్రను `సెట్` చేసిన చంద్ర‌బాబు

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన‌ప్ప‌టి నుంచి ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు టీడీపీ అండ‌గా ఉన్న ఎన్నిక‌ల ఫ‌లితాలే ఎక్కువ‌. మిగిలిన ప్రాంతాల కంటే అక్క‌డ సీట్లు ఎక్కువ వ‌చ్చేవి.

  • Written By:
  • Updated On - June 17, 2022 / 02:35 PM IST

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన‌ప్ప‌టి నుంచి ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు టీడీపీ అండ‌గా ఉన్న ఎన్నిక‌ల ఫ‌లితాలే ఎక్కువ‌. మిగిలిన ప్రాంతాల కంటే అక్క‌డ సీట్లు ఎక్కువ వ‌చ్చేవి. రాష్ట్రం విడిపోయిన త‌రువాత జ‌రిగిన 2014 ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో టీడీపీ స్వీప్ చేసింది. విశాఖ‌, విజ‌యన‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల నుంచి అనూహ్యంగా ఎమ్మెల్యేల‌ను టీడీపీ గెలుచుకుంది. వైసీపీ త‌ర‌పున ఎంపీగా పోటీ చేసిన విజ‌య‌మ్మ‌ను ఓడించి పంపిన విశాఖ‌ప‌ట్నం ఓట‌ర్లు ప‌లు ఎన్నిక‌ల్లో టీడీపీ ప‌క్షాన నిలిచారు. రాబోవు ఎన్నిక‌ల్లోనూ ఉత్త‌రాంధ్ర మీద ఎక్కువ‌గా టీడీపీ ఆశ‌లు పెట్టుకుంది. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీకి అండ‌గా నిలిచిన ఓట‌ర్ల‌ను ఈజీగా టీడీపీ వైపు మ‌లుపుకోవ‌చ్చ‌ని చంద్ర‌బాబు అంచ‌నా.

ఇటీవ‌ల విశాఖ‌ప‌ట్నం వెళ్లిన ఆయ‌న‌కు జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఆయ‌న నిర్వహించిన రోడ్డు షోలు, బ‌హిరంగ స‌భ‌ల‌కు జ‌నం పెద్ద ఎత్తున క‌నిపించారు. కానీ, విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లోని లీడ‌ర్ల మ‌ధ్య గ్రూప్ విభేదాలు పార్టీని న‌ష్ట‌ప‌రిచేలా ఉన్నాయి. వాటిని సరిచేసేందుకు చంద్ర‌బాబు న‌డుంబిగించారు. మూడేళ్లుగా పార్టీకి దూరంగా ఉన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు, మిగిలిన లీడ‌ర్ల మ‌ధ్య స‌యోధ్య లేదు. పార్టీకి రాజీనామా చేసిన‌ప్ప‌టికీ ఇటీవ‌ల విశాఖ వెళ్లిన చంద్ర‌బాబు స‌భ‌ల్లో గంటా శ్రీనివాస‌రావు క‌నిపించారు. మ‌ళ్లీ ఆయ‌న పార్టీలో కీల‌కం కాబోతున్నార‌ని మిగిలిన వాళ్లు అసంతృప్తిగా ఉన్నారు. ఆ జిల్లా నుంచి అయ్య‌న్న‌పాత్రుడు, గంటా వ‌ర్గానికి తొలి నుంచి పొస‌గ‌దు. అధికారంలో ఉన్న‌ప్పుడు ఇద్ద‌రూ ప‌ర‌స్ప‌రం భూ కుంభ‌కోణాల్లో ఇరుక్కున్నారు. క‌లెక్ట‌ర్ వ‌ద్ద ఫిర్యాదు కూడా చేసుకున్నారు. అప్ప‌ట్లో ఆ వివాదాల‌పై ఒక క‌మిటీని కూడా చంద్ర‌బాబు స‌ర్కార్ వేసింది. ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చిన త‌రువాత అయ్య‌న్న‌పాత్రుడు చురుగ్గా పార్టీకి ప‌నిచేస్తున్నారు. కానీ, గంటా శ్రీనివాస‌రావు మాత్రం పార్టీకి దూరంగా ఉంటూ ఇటీవ‌ల రాజీనామా చేయ‌డం అంద‌రికీ తెలిసిందే. మారిన ప‌రిస్థితుల‌ను బేరీజు వేసుకున్న గంటా తిరిగి పార్టీలో యాక్టివ్ కావాల‌ని చూస్తున్నారు. ఇదే అయ్య‌న్న వ‌ర్గానికి కంట‌గింపుగా ఉంది.

విజ‌య‌న‌గ‌రం జిల్లా టీడీపీ ప‌గ్గాలు తొలి నుంచి అశోక‌గ‌జ‌ప‌తిరాజు కుటుంబం వ‌ద్దే ఉన్నాయి. ఇటీవ‌ల అక్క‌డ మీసాల గీత వ‌ర్గానికి, అశోక్ వ‌ర్గానికి పొస‌గ‌డంలేదు. 2014 ఎన్నిక‌ల్లో అశోక్ గ‌జ‌ప‌తిరాజును కాద‌ని మీసాల గీత‌కు టీడీపీ టిక్కెట్ ఇచ్చింది. ఆ ఎన్నిక‌ల్లో ఆమె గెలుపొంద‌డంతో ప్ర‌త్యేక వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ, 2019 ఎన్నిక‌లు వచ్చే నాటికి ఆ టిక్కెట్ మీసాల గీత‌ను కాద‌ని అశోక్ గ‌జ‌ప‌తి కుమార్తె ఆదితికి ఇప్పించుకోవ‌డంలో రాజు స‌క్సెస్ అయ్యారు. కానీ, ఆదితి 2019 ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ప్ర‌స్తుతం విజ‌య‌న‌గ‌రం కేంద్రంగా మీసాల గీత‌, అశోక్ గ‌జ‌ప‌తిరాజు వ‌ర్గాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. రాజు బంగళాల‌లోనే టీడీపీ కార్యాల‌యం నిర్వ‌హించ‌డం ఏ మాత్రం మీసాల గీత వ‌ర్గానికి న‌చ్చ‌డంలేదు. అందుకే, గీత ప్ర‌త్యేకంగా టీడీపీ కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇద్ద‌రి మ‌ధ్యా టీడీపీ కార్యాల‌యం విష‌యంలో వివాదం తారాస్థాయికి చేర‌డంతో చంద్ర‌బాబు జోక్యం అనివార్యంగా మారింది. మ‌ధ్మేమార్గంగా కొత్తగా టీడీపీ కార్యాల‌యాన్ని ప్ర‌స్తుత టూర్లో ప్రారంభించారు. దీంతో వాళ్లిద్ద‌రి మ‌ధ్యా గ్రూప్ విభేదాలు పూర్తిగా స‌మ‌సిపోయాయ‌ని భావించ‌లేం.

విజ‌య‌న‌గ‌రం జిల్లా నెల్లిమ‌ర్ల‌, చీపురుప‌ల్లి నియోజ‌కవ‌ర్గాలను సెట్ చేయడానికి చంద్ర‌బాబు సిద్ధం అయ్యారు. ఆ రెండు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జిలు ఉన్న‌ప్ప‌టికీ క్లారిటీ లేకుండా ప‌నిచేస్తున్నారు. ఈసారి చంద్ర‌బాబు టూర్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ ఎవ‌రికి ల‌భించ‌నుందో తేల్చి చెప్పే అవ‌కాశం ఉంది. మొత్తం మీద విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం జిల్లాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన చంద్ర‌బాబు వ‌ర్గ విభేదాల‌ను సెట్ చేయ‌డానికి పూనుకున్నారు. అన‌కాప‌ల్లి మినీ మ‌హానాడు విజ‌య‌వంతం కావ‌డంతో విశాఖ టీడీపీలో జోష్ క‌నిపిస్తోంది. విజ‌య‌న‌గ‌రం రోడ్డు షో అనూహ్యంగా హిట్ కావ‌డంతో పాటు చీపురుప‌ల్లి, నెల్లిమ‌ర్ల ఇంచార్జిల‌కు క్లారిటీ ఇవ్వ‌డం ద్వారా గ్రూపు రాజ‌కీయాల‌కు బ్రేక్ ప‌డుతుంద‌ని టీడీపీ లోక‌ల్ క్యాడ‌ర్ భావిస్తోంది. మొత్తం మీద చంద్ర‌బాబు ఉత్త‌రాంధ్ర టూర్ అన్ని కోణాల నుంచి స‌క్సెస్ అయినట్టే టీడీపీ విశ్వ‌సిస్తోంది.