ఆ గ్రామంలో ఆ వార్డుకి పోటీ చేస్తే చనిపోవాల్సిందేనా…?

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బుచ్చెంపేట పంచాయతీలో ఏడో వార్డు అంటేనే నేతలు బయపడుతున్నారు.

  • Written By:
  • Publish Date - November 7, 2021 / 08:54 PM IST

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బుచ్చెంపేట పంచాయతీలో ఏడో వార్డు అంటేనే నేతలు బయపడుతున్నారు.
ఏ వార్డుకైనా నామినేషన్ వేస్తాం కానీ ఆ ఒక్క వార్డు మాత్రం మాకొద్దంటే మాకొద్దని రాజకీయ నాయకులు వెనక్కి తగ్గుతున్నారు. ఇంతకి ఆ వార్డులో పోటీ చేయ‌డానికి ఎందుకు భ‌య‌ప‌డుతున్నారో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

బుచ్చెంపేట గ్రామ పంచాయతీలో ఏడో వార్డు మెంబర్ స్థానానికి రాజకీయాలకు అతీతంగా ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు ముందుకు రాకపోవడం విచిత్రంగా ఉంది. దీనికి కారణం ఈ వార్డు నుంచి ఎవరు ఎన్నికైనా ప్రాణాలు పోతాయని గ్రామస్తుల్లో ఒక అపనమ్మకం ఏర్పడింది. ఈ వార్డు నుండి ఎన్నికైన కనీసం ఐదుగురు సిట్టింగ్ సభ్యులు 1999 నుండి మరణిస్తూ వస్తున్నారు. చివరి సారిగా 2013 పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్థి కూడా చనిపోవడంతో మ‌రింత‌గా హడలిపోతున్నారు.

ఖాళీగా ఉన్న ఏడో వార్డు మెంబర్ పోస్టు భర్తీకి మూడుసార్లు నోటిఫికేషన్ జారీ చేసినా నామినేషన్ దాఖలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పంచాయతీ ఎన్నికల కోసం వార్డు మెంబర్ పోస్టుకు నోటిఫికేషన్ మొదటిసారి ఫిబ్రవరి 2021లో విడుదలైంది. ఆ సమయంలో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మార్చిలో మరో నోటిఫికేషన్ విడుదలైంది. కానీ నామినేషన్ దాఖలు కాలేదు. పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల పోస్టుల భర్తీకి ఎస్ఈసీ మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరోసారి వార్డు మెంబర్ పదవికి ఒక్క నామినేషన్ రాలేదు.

జిల్లా కేంద్రం కాకినాడకు 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుచ్చెంపేట పంచాయతీలో 2,657 మంది జనాభా ఉండగా, 2,000 మంది ఓటర్లు ఉన్నారు. ఏడో వార్డులో 201 మంది ఓటర్లు ఉన్నారు. 1999లో ఏడో వార్డు సభ్యునిగా బేలె సోమేశ్వరరావు ఎన్నికయ్యారు. ఎన్నికైన నాలుగు నెలలకే ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. ఆ తర్వాత వార్డు సభ్యులుగా ఎన్నికైన సంగన గుర్రయ్య, అల్లం దేవా, సాదు, ఏనుగంటి కొండలరావు ఒకరి తర్వాత ఒకరు మృతి చెందారు. 2013లో ఏకగ్రీవంగా ఎన్నికైన కొండలరావు 2014లో మరణించారు. ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఒక వేళ తాను చనిపోతే ఏడవ వార్డును శాశ్వతంగా రద్దు చేయాలని అన్నారని తనతో చెప్పినట్లు కొండలరావు భార్య అనంత లక్ష్మి తెలిపారు. ఆరోగ్యంగా ఉన్నా, అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై తన భర్త మృతి చెందాడని ఆమె తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఐదుగురు వార్డు సభ్యులు చనిపోవడానికి గల కారణాలు తమకు తెలియడం లేదని బుచ్చెంపేట సర్పంచ్ టి. జ్యోతి తెలిపారు.