Site icon HashtagU Telugu

TDP Sankranthi : టీడీపీకి ‘సంక్రాంతి’ శోకం! సంబురాల‌కు దూరం!!

Nadu Nedu

Nadu Nedu

సంక్రాంతి సంబురాల‌కు ఈసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబు కుటుంబం దూరంగా ఉంది. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండ‌లం గుండ్ల‌పాడుకు చెందిన టీడీపీ లీడ‌ర్ చంద్ర‌య్య హ‌త్య ఆయ‌న్ను క‌లచివేసింది. అధికారం పోయిన‌ప్ప‌టి నుంచి ప‌ల్నాడు ప్రాంతంలో టీడీపీ క్యాడ‌ర్ మీద దాడులు ఆగ‌డంలేదు. తొలుత దివంగ‌త కోడెల శివ‌ప్ర‌సాద్ అనుచ‌రుల‌పై ప్ర‌త్య‌ర్థులు క‌త్తిక‌ట్టారు. ఊపిరి స‌ల‌ప‌కుండా మాన‌సిక దాడిని కోడెల కుటుంబంపై చేయ‌డం జ‌రిగింది. ఆ మానిసిక ఒత్తిడిని త‌ట్టుకోలే పార్టీ ఐకాన్ గా ఉండే కోడెల ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆనాటి నుంచి ప‌ల్నాడు ప్రాంతంపై ఆధిపత్యం కోసం ప్ర‌త్య‌ర్థులు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.ఇటీవ‌ల ప‌ల్నాడు ప‌రిధిలోని దుర్గి మండ‌ల కేంద్రానికి సమీపంలోని ఆత్మ‌కూరు వ‌ద్ద జ‌రిగిన సంఘ‌ట‌న యావ‌త్తు రాష్ట్రాన్ని ఆందోళ‌న‌కు గురిచేసింది. ఆత్మ‌కూరులోని టీడీపీ కి చెందిన ఎస్సీ కుటుంబాల‌ను గ్రామాల నుంచి వైసీపీ క్యాడ‌ర్ త‌రిమేసింది. ఇళ్ల‌కు తాళాలు వేసుకుని ఊళ్ల‌ను విడిచిపెట్టి ఎస్సీలు వెళ్లాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకుని ఊరువిడిచి వెళ్లిన పురుషుల కోసం మ‌హిళ‌లు బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్లు. ఆ విష‌యాన్ని తెలుసుకున్న చంద్ర‌బాబు `ఛ‌లో ఆత్మ‌కూరు` కార్య‌క్ర‌మానికి పిలుపు ఇచ్చాడు. ఆ సంద‌ర్భంగా జ‌రిగిన రాద్ధాంతం అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. టీడీపీ క్యాడ‌ర్‌కు ధైర్యం నింపే ప్ర‌య‌త్నం చంద్ర‌బాబు, లోకేష్ ఆ సంద‌ర్భంగా చేసిన‌ప్ప‌టికీ అక్క‌డ ఎప్పుడు ఏం జ‌రుగుతుందో..అనే ఆందోళ‌న ఇప్ప‌టికీ వెంటాడుతోంది. బ‌ల‌వంతంగా కొంద‌ర్ని వైసీపీ అనుకూలంగా మ‌లుచుకుంది. ఇంకొంద‌రిని ప్ర‌త్య‌ర్థులు వేటాడి హ‌త్య చేసిన సంఘ‌ట‌న‌లు అనేకం. ఇవ‌న్నీ ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌లంటూ పోలీస్ లైట్ గా తీసుకుంటుందోన్న ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు.

ప‌ల్నాడులోని ఆత్మ‌కూరు సంఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే ఇప్పుడు గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట చంద్రయ్య (36) దారుణ హత్యకు గుర‌య్యాడు. సంక్రాంతి పండుగ ముందే ఇటువంటి ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో టీడీపీ నేత‌లు చాలా మంది సంబురాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. హ‌త్య‌కాబ‌డిన చంద్ర‌య్య క‌రుడుగ‌ట్టిన తెలుగుదేశం లీడ‌ర్‌. హంత‌కులు జై జ‌గ‌న్ అంటే, వ‌దిలేస్తామ‌ని చంద్ర‌య్య‌ను బెదిరించార‌ట‌. ప్రాణం వ‌ద‌ల‌డానికైనా చంద్ర‌య్య సిద్ధ‌ప‌డ్డాడుగానీ ఆ మాట అన‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. పైగా జై చంద్ర‌బాబు, జై టీడీపీ అంటూ నిన‌దించాడట‌. దీంతో హంత‌కులు చంద్ర‌య్య‌ను దారుణంగా హ‌త్య చేశార‌ని అనుచ‌రులు చెబుతున్నారు. చివ‌రి శ్వాస వ‌ర‌కు పార్టీ ప‌ట్ల చంద్ర‌య్య చూపిన అంకిత‌భావం తెలుగుదేశం పార్టీ క్యాడ‌ర్ కు స్పూర్తినిచ్చేలా ఉంది. అందుకే, చంద్ర‌బాబు చ‌లించిపోయాడు.టీడీపీ లీడ‌ర్ చంద్ర‌య్య అంత్య‌క్రియ‌ల్లో చంద్ర‌బాబు పాల్గొన్నాడు. ఆయ‌న కుటుంబానికి రూ. 25లక్ష‌ల ఆర్థిక స‌హాయాన్ని పార్టీ ప‌రంగా ప్ర‌క‌టించాడు. కుటుంబీకుల‌కు ఎన్టీఆర్ ట్ర‌స్ట్ నుంచి అన్ని ర‌కాలుగా స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తామ‌ని ప్ర‌క‌టించాడు. ఇదంతా ఒక ఎత్తైతే, చంద్ర‌య్య పాడెను మోస్తూ బాబు క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు. యావ‌త్తు తెలుగుదేశం పార్టీ చంద్ర‌య్య హ‌త్య‌ను జీర్ణించుకోలేక పోతోంది. అందుకే, సంక్రాంతి పండుగ‌ను జ‌రుపుకోలేక‌పోతున్నారు.ప్ర‌తి ఏడాది చంద్ర‌బాబు కుటుంబం నారావారిప‌ల్లెలో పండుగ జ‌రుపుకునేది. నారా, నంద‌మూరి ఫ్యామిలీ క‌లిసి సంబురాల హ‌డావుడి ఉండేది. సంక్రాంతికి నారావారి ప‌ల్లె వెలిగిపోయేది. ఈసారి చంద్ర‌య్య హ‌త్య కార‌ణంగా సంబురాల‌కు దూరంగా ఉన్నార‌ని తెలిసింది.