టీడీపీ, బీజేపీ పొత్తుపై అంత‌ర్గ‌త యుద్ధం

తెలుగుదేశం, బీజేపీ పొత్తు మీద ఏపీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ప‌లు ర‌కాల ఊహాగానాల‌కు తెర‌లేచింది. పొత్తుపై బీజేపీలోనే భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - November 5, 2021 / 02:08 PM IST

తెలుగుదేశం, బీజేపీ పొత్తు మీద ఏపీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ప‌లు ర‌కాల ఊహాగానాల‌కు తెర‌లేచింది. పొత్తుపై బీజేపీలోనే భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నారు. ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దేవ‌ధ‌ర్ మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ టీడీపీతో జ‌త క‌ట్టే ప్ర‌స‌క్తేలేద‌ని చెబుతున్నారు. చంద్ర‌బాబు టీమ్ గా ముద్ర‌ప‌డిన బీజేపీలోని సీఎం ర‌మేష్, సుజ‌నా చౌద‌రి, ఆదినారాయ‌ణ రెడ్డి లాంటి వాళ్లు పొత్తు ఉంటుంద‌ని సంకేతాలు ఇస్తున్నారు. ఈ రెండు వాద‌న‌ల్లో ఏది న‌మ్మ‌శ‌క్య‌మో..తెలియ‌క ఇరు పార్టీల్లోని క్యాడ‌ర తిక‌మ‌క ప‌డుతోంది. బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత పొత్తు అంశంపై తీవ్రంగా చ‌ర్చ జ‌రుగుతోంది. బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీ క‌లిసి ప‌నిచేశాయ‌ని వైసీపీ అభిప్రాయం. అందుకే, బీజేపీకి 21వేల‌కుపైగా ఓట్లు వ‌చ్చాయ‌ని అంచ‌నా వేస్తోంది. కేవ‌లం 800 ఓట్ల‌కు 2019 ఎన్నిక‌ల్లో ప‌రిమిత‌మైన బీజేపీకి ఉప ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఓట్ల‌ను పోల్చుతూ బీజేపీకి టీడీపీ ప‌నిచేసింద‌ని జ‌గ‌న్ వ‌ర్గం విమ‌ర్శిస్తోంది. ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ ఓట్లు వేయించింద‌ని సునీల్ దేవ‌ధ‌ర్ అంటున్నారు. ఆ మేర‌కు మీడియా ముఖంగా వెల్ల‌డించాడు. బ‌ద్వేల్ లో కాంగ్రెస్ కు 5వేల ఓట్ల‌కు పైగా వ‌చ్చాయంటే టీడీపీ ఆ పార్టీకి ప‌ని చేసింద‌ని ఆయ‌న అంచ‌నా వేస్తున్నాడు.

Also Read : ఒకే వేదికపై కేసీఆర్, జగన్

Also Read : TDP vs YCP : నాయుడి కంచుకోటను వైసీపీ బద్దలుకొడుతుందా..?

రాబోవు ఎన్నిక‌ల్లో కింగ్ లేదా కింగ్ మేక‌ర్ గా ఉండాల‌ని ఏపీ బీజేపీ భావిస్తోంది. ప్ర‌స్తుతం జ‌న‌సేన పార్టీతో క‌లిసి వెళుతోన్న బీజేపీ,బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో ఒంటరిగా వెళ్లింది. జ‌న‌సేనాని మ‌ద్ధ‌తు లేకుండానే 21వేల‌కు పైగా ఓట్ల‌ను సంపాదించి నైతిక బ‌లాన్ని పోగుచేసుకుంది. ఇదంతా బీజేపీ బ‌లంగా ఆ పార్టీ నేత‌లు చెప్పుకుంటున్నారు. పైగా కాంగ్రెస్ పార్టీకి టీడీపీ శ్రేణులు ఓట్లు వేయించిన‌ప్ప‌టికీ చెప్పుకోద‌గ్గ ఓట్లు వ‌చ్చాయ‌ని క‌మ‌ల‌నాథులు సంబ‌ర ప‌డుతున్నారు. ఇదంతా క‌మ‌లం పార్టీలోని కొందరు చెబుతున్న మాట‌లు. కానీ, సునీల్ దేవ‌ధ‌ర్ వ్యాఖ్య‌ల‌కు వ్య‌తిరేకంగా మ‌రో టీం త‌న వాద‌న‌ను వినిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీ నుంచి2019 ఎన్నిక‌ల త‌రువాత సుజ‌నా చౌద‌రి, టీజీ వెంక‌టేష్‌, సీఎం ర‌మేష్‌,గ‌రిక‌పాటి మోహ‌న్‌రావు బీజేపీలోకి వెళ్లారు. ఆ పార్టీకి రాజ్య‌స‌భ‌లో ఉన్న ఐదుగురిలో క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర కుమార్ మిన‌హా మిలిగిన న‌‌లుగురు ఒకేసారి బీజేపీలోకి వెళ్లారు. రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు సాక్షిగా తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఆనాటి నుంచి భౌతికంగా వాళ్లు బీజేపీలో కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ చంద్ర‌బాబుకు ట‌చ్ లో ఉన్నార‌ని ఢిల్లీ వ‌ర్గాల టాక్‌. వాళ్ల వ్యాపార సామ్రాజ్యాల‌ను కాపాడుకోవ‌డం కోసం వెళ్లార‌ని ప్రత్య‌ర్థులు చెబుతుంటారు. మ‌ళ్లీ సాధార‌ణ ఎన్నిక‌ల నాటికి టీడీపీలోకి వ‌స్తార‌ని ప్ర‌చారం కూడా ఉంది. ఆ న‌లుగురు టీమ్ మాత్రం రాబోవు రోజుల్లో బీజేపీ,టీడీపీ, జ‌న‌సేన పార్టీల‌ను పొత్తు దిశ‌గా తీసుకెళ్లాల‌ని భావిస్తున్నార‌ట‌. అందుకే, పొత్తుకు సానుకూలంగా వాళ్లు స్పందిస్తున్నార‌ని బీజేపీలోని బ‌ల‌మైన వ‌ర్గం అభిప్రాయ‌ప‌డుతోంది.మొత్తం మీద తెలుగుదేశం, బీజేపీ పొత్తు అంశం క‌మ‌లాథుల మ‌ధ్య ఉన్న అభిప్రాయ‌భేదాల‌ను బ‌య‌ట‌పెడుతోంది. రెండు వాద‌న‌ల్లో ఏది నిజ‌మో ఇప్ప‌టికిప్పుడు తెలియ‌న‌ప్ప‌టికీ…చ‌ర్చ‌కు మాత్రం ఆస్కారం ఇచ్చింది. అధిష్టానం మాత్ర‌మే పొత్తును నిర్ణ‌యిస్తుంద‌ని చంద్ర‌బాబు టీమ్ క‌మ‌నాథులు అంటున్నారు. బీజేపీ అధిష్టానం మ‌నోభావాల మేర‌కు సునీల్ దేవ‌ధ‌ర్ చెబుతున్నార‌ని బాబు వ్య‌తిరేకంగా ఉన్న బీజేపీ ఏపీ నేతలు అంటున్నారు. ఈ క్ర‌మంలో ఎవ‌రి చెప్పేది నిజమో..వేచిచూడాల్సిందే.

Also Read : Andhra Pradesh: 14న ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్!