Site icon HashtagU Telugu

AP Special Status : ఆంధ్రోడి పౌరుషం హుష్‌కాకి!

ఆంధ్రులు పౌరుషవంతులు. చరిత్ర పుటలలోకి వెళ్తే ఆంధ్ర పోరాటం ఏ స్థాయిలో సాగిందో తెలుస్తుంది. ఇక అధునిక చరిత్రలో స్వాతంత్ర పోరాటంలో ఆంధ్రులు ముందుండి పోరాడారు. దేశంలో ఏ ఉద్యమానికి మహాత్ముడు ఆనాడు పిలుపు ఇచ్చినా ఆంధ్రులే తెగించి తెల్ల దొరలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వీర గాధలు అనేకం. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు బ్రిటీష‌ర్ల‌ తుపాకీకి గుండెను చూపించిన తెగువ మ‌రువ‌లేనిది.

తెల్ల దొరల బానిసత్వాన్ని ఆయ‌న తీవ్రంగా వ్యతిరేకించి సైమన్ కమిషన్ తుపాకీ గుండుకు తన గుండెను ఎదురుపెట్టి పోరాడిన యోధుడు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత అదే టంగుటూరి ఆనాటి దేశ ప్రధాని పండిట్ నెహ్రూ మీద కొన్ని విషయాల్లో వ్యతిరేకించి ఆంధ్రుల పౌరుషాన్ని చాటార‌ని చరిత్ర చెబుతోంది.

ఇక ఎన్టీ రామారావు పేరు త‌ల‌చుకుంటే ఆంధ్రుల ఆత్మ‌గౌవ‌రం తాలూకూ గర్వం ఉప్పొంగుతుంది. మద్రాసీలుగా పేరుపడిన వారికి ప్రత్యేక గుర్తింపు ఢిల్లీ స్థాయిలో తెచ్చిన చరిత్ర ఆయనది. అంతే కాదు ఉక్కు మహిళగా పేరు పొంది తన కత్తికి ఎదురులేద‌ని భావించిన‌ ఇందిరా గాంధీకి ఎదురొడ్డి నిలిచి గెలిచిన రాజకీయ ధీరుడిగా జాతీయ స్థాయిలో కనిపిస్తారు. త‌న ప్రభుత్వాన్ని అక్రమంగా ఇందిరాగాంధీ కూల్చితే కేవలం నెల రోజుల వ్యవధిలో తిరిగి తెచ్చుకున్న రాజకీయ పోరాట స్పూర్తి ఎన్టీయార్ సొంతం. తెలుగోడి పౌరుషం, తెగింపు అంటే ఏమిటో నిరూపించిన క‌లియుగ‌పురుషుడు ఎన్టీఆర్‌.

ఢిల్లీ గడ్డకు ప‌లు సందర్భాలలో సరైన సమాధానం చెప్పి దేశానికి దిశానిర్దేశం చేసిన కీర్తి ఆంధ్రులది. అలాంటి ఆంధ్ర పౌరుషం ఈ రోజు ఏమైంది? అని ప్ర‌శ్నించుకుంటే మోడీ, షా ద్వ‌యానికి దాసోహం అంటుంద‌ని ఎవ‌రైనా చెబుతారు. ఏపీ లోపలా బయటా కూడా ఇదే అంశంపై చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఉమ్మడి ఏపీ విభజన నిజానికి ఆంధ్రులకు ఏ మాత్రం ఇష్టం లేదు. అయిన‌ప్ప‌టికీ ఆనాటి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ రెండూ కలసి పార్ల‌మెంట్ చరిత్ర‌లోనే జ‌ర‌గ‌ని విధంగా బిల్లును పాస్ చేశాయి.

ఆనాడు విభజన హామీలు అంటూ కొన్ని ఇచ్చారు. ఇప్పటికి ఎనిమిదేళ్ళు గడచినా ఆ హామీలు నెరవేరుతున్నాయా అంటే లేదని చెప్పాలి. ప్ర‌ధానంగా ప్రత్యేక హోదా ఈ రోజున ఎక్కడ ఉంది అంటే జవాబు లేదు. అది ముగిసిన అధ్యాయం అని బీజేపీ అంటూంటే నోరు మెదపలేని స్థితిలో ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఉండ‌డం శోచ‌నీయం. ఇక పోలవరం ప్రాజెక్ట్ ని ఇన్నేళ్ళు అయినా పూర్తి చేయలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఏపీ పట్ల కేంద్రం ఉదాశీనతగా చెప్పుకోవాలి. అదే విధంగా ఏపీకి రాజధాని ఈ రోజుకీ లేదు. దాని వెనక కేంద్ర నిర్లక్ష్యం పూర్తిగా ఉందని అంటారు. ఢిల్లీని తలదన్నిన రాజధాని కట్టిస్తాన‌ని హామీ ఇచ్చిన‌ బీజేపీ పెద్దలు మాట నిలబెట్టుకోలేదు. పైగా ఆనాడు అమరావతి రాజధాని శంకుస్థాపనకు ప్రధాని వచ్చి వెళ్లారు. ఇపుడు జగన్ మూడు రాజధానులు అంటే బీజేపీ పెద్దలు చోద్యం చూస్తున్నారు.

ఏపీకి విభజన చట్టం ప్రకారం అనేక కేంద్ర పరిశ్రమలు విద్యా సంస్థలు రావాలి. అయితే కొన్ని వచ్చినా అవి కేవలం కాగితాలకు మాత్ర‌మే ప‌రిమితం అయ్యాయి. వేల కోట్లు రావాల్సిన‌ నిధులు అయిదు పది కోట్లతో ఏటా బడ్జెట్ లో సరిపెడితే ఈ ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఎంతకాలం పడతాయి అన్నది ఎవరికీ అంచనాకు అందని విషయం. కడపలో స్టీల్ ప్లాంట్ ఊసే లేదు. విశాఖ రైల్వే జోన్ అలాగే ఉంది. దానికి తోడు అన్నట్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తూన్నా ఏపీ నుంచి ప్రధాన పార్టీల నేత‌లు నోరెత్తని దుస్థితి. నిజానికి కేంద్రం ఇంతలా ఏపీకి అన్యాయం చేస్తూంటే అధికార వైసీపీ కనీసంగా నిలదీయలేకపోతోంది. పైగా మా మద్దతు మీకే అంటూ కీలకమైన సమయాల్లో కేంద్రంతో దోస్తీ చేయడానికే చూస్తోంది. మోడీకి వైసీపీ నమ్మకమైన నేస్తంగా ఉందని ఎన్ని విమర్శలు వచ్చినా ఖాతరు చేయడంలేదు.

ఇక తెలుగుదేశం పార్టీని తీసుకుంటే ఆ పార్టీ తీరు కూడా అంతే అని చెప్పాలి. మోడీ కరుణా కటాక్షాలు తమకు ఉంటే చాలు వచ్చే ఎన్నికల్లో ఎలాగోలా గెలుస్తామన్న రాజకీయ యావ తప్ప రాష్ట్రం రాష్ట్ర ప్రయోజనాలు సీనియర్ మోస్ట్ లీడర్ అయిన చంద్రబాబుకు అసలు పట్టడం లేదని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. టీడీపీ ఒకనాడు దేశాన్ని శాసించింది. ఇపుడు కేవలం ఆంధ్రాకే తాను పరిమితం అని చెప్పేసుకుంటూ బీజేపీకి దగ్గరకావడానికి బాబు చూస్తున్నారు.

కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినా పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డూల వ‌ర‌కు ప్ర‌త్యేక హోదాను తీసుకెళ్లారు. ఆ త‌రువాత ప్రత్యేక హోదాను మ‌డ‌తేసి బీజేపీ లీడ‌ర్ల కాళ్ల వ‌ద్ద ప‌డేశారు. పాచిపోయిన లడ్డూల మాదిరిగా ప్యాకేజి అంటూ ఒక‌ప్పుడు గుడ్లురిమిన ప‌వ‌న్ ప్ర‌స్తుతం బీజేపీ ద‌యాదాక్షిణ్యాల‌తో పార్టీని న‌డుపుతున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోగానే ఆయన తానుగా వెళ్ళి బీజేపీ జట్టు కట్టారు. దీంతో ఈ మూడు పార్టీలు కూడా ఏపీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేని స్థితి.

ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీలో కేసీయార్ కేంద్రంపై విరుచుకుప‌డ్డారు. విభజన త‌రువాత తెలంగాణాకు రావాల్సినవి ఇవ్వ‌డంలేద‌ని, అన్యాయం చేసింద‌ని కేటగారికల్ గా అసెంబ్లీలో వివరించి మోడీని ఎండగట్టారు. కేంద్రం చేసిన అన్యాయం మీద గొంతెత్తే పరిస్థితి ఏపీలోని రాజకీయ నాయకత్వానికి ఉందా? అంటే జవాబు లేదు. ఒక విధంగా ఏపీ తెలంగాణా కంటే అన్ని విధాలుగా నష్టపోయింది. ఈ నష్టాన్ని కష్టాన్ని ఎలుగెత్తి చాటేది ఎవరు అన్నది ఆంధ్రుల ప్రశ్న. ఆంధ్రుల గోస గానీ, వారి పౌరుషంగానీ వినిపించకుండా ప్రధాన రాజకీయ పార్టీలు తమదైన రాజకీయం చేస్తున్నాయ‌న్న విమర్శలు లేక‌పోలేదు. ఒక్క మాటలో చెప్పాలీ అంటే ఆంధ్రుల పౌరుషాన్ని ఢిల్లీలో వైసీపీ టీడీపీ జనసేన మూకుమ్మడిగా తాకట్టు పెట్టేశాయని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌.