మ‌ర్రికి మొండి చెయ్యి చూపిన జ‌గ‌న్‌..పేట వైసీపీలో ముస‌లం

ఏపీలో ఎమ్మెల్సీ ప‌ద‌వులు వైసీపీకి త‌ల‌నొప్పిగా మారాయి. 2019 ఎన్నిక‌ల ముందు ఇత‌ర పార్టీల నుంచి చాలా మంది వైసీపీలోకి వ‌ల‌స వ‌చ్చారు.

  • Written By:
  • Updated On - November 16, 2021 / 04:14 PM IST

ఏపీలో ఎమ్మెల్సీ ప‌ద‌వులు వైసీపీకి త‌ల‌నొప్పిగా మారాయి. 2019 ఎన్నిక‌ల ముందు ఇత‌ర పార్టీల నుంచి చాలా మంది వైసీపీలోకి వ‌ల‌స వ‌చ్చారు. వ‌ల‌స వచ్చిన నేత‌ల‌కు నాడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న జ‌గ‌న్ చాలా మందికి ఎమ్మెల్సీ ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. మ‌రోవైపు సొంత పార్టీ నేత‌ల‌కు కూడా ఇలాంటి హామీలే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇచ్చారు.అయితే ఇప్పుడు ఈ హామీలు వైసీపీ అధినేత జ‌గ‌న్ కు ఇబ్బందికరంగా మారాయి. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక రెండేళ్ల త‌రువాత ఎమ్మెల్సీ ప‌ద‌వులు ఎక్కువ‌గా వైసీపీకే ద‌క్క‌నున్నాయి. అయితే గ‌తంలో హామీ పొందిన వారు ఈ రెండేళ్ల వ‌ర‌కు పార్టీలో క్రీయాశీలకంగా ప‌ని చేస్తున్నారు. కార్పోరేష‌న్ నామినేటెడ్ ప‌దవులను సైతం వారు వ‌దులుకున్నారు. కానీ ఎమ్మెల్సీ ప‌ద‌వుల పంప‌కం వైసీపీలో విభేధాలు తెచ్చిపెడుతుంద‌ని క్యాడర్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. చిల‌కలూరి పేట‌లో సీనియ‌ర్ నేత మ‌ర్రి రాజశేఖ‌ర్ వైసీపీ ఆవిర్భావం నుంచి ప‌ని చేస్తున్నారు.

Also Read : షా చాటు జ‌గ‌న్‌.!

2014లో మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావుపై పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఆయ‌న పార్టీ మార‌కుండా వైసీపీలోనే కొన‌సాగారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి ఆయ‌న పోటీ చేయ‌డానికి సిద్ధ‌ప‌డినా చివ‌రి నిమిషంలో టికెట్ ఇవ్వ‌లేదు. టీడీపీ నుంచి వైసీపీలోకి వ‌చ్చిన విడ‌ద‌ల ర‌జ‌నీకి వైసీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. అయితే అదే స‌మ‌యంలో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ని అధిష్టానం బ‌జ్జ‌గించింది. అధికారంలోకి వ‌చ్చాక మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో బ‌హిరంగ స‌భ‌లోనే వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. చిల‌క‌లూరి పేట సీటుని బీసీల‌కు ఇవ్వాల్సివ‌స్తుంద‌ని…ఈ సీటుని త్యాగం చేయాల‌ని మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ని కోరిన‌ట్లు జ‌గ‌న్ స‌భ‌లో తెలిపారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో విడ‌ద‌ల ర‌జ‌నీ గెలుపుకు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ వ‌ర్గం కృషి చేసింది. కానీ విడుద‌ల ర‌జ‌నీ గెలిచిన త‌రువాత మాత్రం మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కి చెక్ పెట్టేలా వ్యూహాలు ర‌చిస్తున్నారు.

మ‌ర్రి అనుచ‌రుల‌ను తీవ్ర స్థాయిలో ఇబ్బందుల‌కు గురి చేస్తే విడుద‌ల ర‌జ‌నీ త‌న బ‌లాన్ని పెంచుకుంటున్నారు. మొద‌టి సారి ఎమ్మెల్సీ ప‌ద‌వులు ఖాళీ అయిన స‌మ‌యంలో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కి ఎమ్మెల్సీ అవ‌కాశం వ‌స్తుంద‌ని భావించిన ప‌ద‌వి రాలేదు.తాజాగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లో అయిన ఒక‌టి మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కి ఇస్తార‌ని భావించిన ఆ స్థానంలో అస‌లు పార్టీలో చేర‌ని చేనేత సామాజివ‌ర్గానికి చెంద‌ని మురుగుడు హ‌నుమంత‌రావుకి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చారు. అంత‌కు ముందు గుంటూరు జిల్లాలోనే లేళ్ల అప్పిరెడ్డికి ప‌ద‌విని క‌ట్ట‌బేట్టింది వైసీపీ అధిష్టానం. దీంతో మ‌ర్రికి భ‌విష్య‌త్ లో ఎమ్మెల్సీ వ‌చ్చే అవ‌కాశం లేకుండా పోయిన‌ట్లు క‌నిపిస్తుంది. దీంతో తీవ్ర అసంతృప్తిలో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ఆయ‌న వ‌ర్గం ఉంది.

Also Read : ఏపీలో గ్రానైట్ ప‌రిశ్ర‌మ‌లు క్లోజ్, 30వేల ఉద్యోగాలు హుష్‌!

అయితే మ‌ర్రికి ఎమ్మెల్సీ ఇస్తే ఖ‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని విడ‌ద‌ల ర‌జ‌నీ వ‌ర్గం భావిస్తుంది. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తే మాత్రం చిల‌క‌లూరి పేట‌లో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ప‌ట్టు నిలుపుకుంటారు. ఒక‌వేళ ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చిన మంత్రి ప‌ద‌వి రాకుండా విడ‌ద‌ల ర‌జ‌నీ అడ్డుకునే అవ‌కాశం ఉంద‌ని మ‌ర్రి వ‌ర్గం ఆరోపిస్తుంది. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో బీసీ కార్డుతో విడద‌ల ర‌జ‌నీ మంత్రి ప‌ద‌వి కోసం అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారు. మొత్తానికి సీఎం జ‌గ‌న్ మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కి మొండి చెయ్యి చూప‌డంతో ఇప్పుడు పేటలో రాజ‌కీయం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి అసంతృప్తిగా ఉన్న రాజ‌శేఖ‌ర్ పార్టీలో ఉంటారా..బ‌య‌టికి వ‌స్తారో వేచి చూడాలి.