Vijayawada : బెజ‌వాడ‌లో నివాస ప్రాంతాల మ‌ధ్య బాణాసంచా దుకాణాలు.. పేలుళ్ల‌తో హ‌డ‌లెత్తుతున్న జనం

విజ‌య‌వాడ‌లో బాణాసంచా దుకాణాలు పెడుతున్నారంటే చుట్టుప్ర‌క్క‌ల ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు...

  • Written By:
  • Publish Date - October 24, 2022 / 07:06 AM IST

విజ‌య‌వాడ‌లో బాణాసంచా దుకాణాలు పెడుతున్నారంటే చుట్టుప్ర‌క్క‌ల ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. చిన్న జింఖానా మైదానంలో 19 దీపావళి బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు అధికారులు అనుమతులు ఇవ్వడంపై గాంధీ నగర్ స్థానికులు, వ్యాపారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారం.. రెండు దుకాణాల మధ్య మూడు మీటర్ల దూరం ఉండాలి. జింఖానా వంటి చిన్న మైదానాల్లో ఇలాంటి నిబంధ‌న‌లు అనుసరించడం చాలా కష్టంగా మారింది. ఆదివారం ఉదయం ఓ దుకాణంలో మంటలు చెలరేగి మరో రెండు దుకాణాలకు వ్యాపించడంతో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. స్టాళ్ల ఏర్పాటుకు అనువైన బహిరంగ స్థలం లేకపోవడంతో బాణాసంచా దుకాణ‌దారులు నానా అవస్థలు పడుతున్నారు. అంతకుముందు నగరం నడిబొడ్డున అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించేందుకు అనువుగా ఉండే స్వరాజ్య మైదాన్‌లో వ్యాపారులు స్టాళ్లను ఏర్పాటు చేసేవారు. విశాలమైన పార్కింగ్ సౌకర్యం ఉన్న స్వరాజ్య మైదాన్‌లో వ్యాపారులు 50కి పైగా దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు.

ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మారకం పనుల కారణంగా స్వరాజ్య మైదానంలో దీపావళి క్రాకర్ స్టాల్స్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక స్మారక ప్రాజెక్టును చేపట్టి స్వరాజ్య మైదానంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. సరిపడా ఖాళీస్థలం లేకపోవడంతో దీపావళి క్రాకర్ స్టాల్స్ ఏర్పాటుకు వీఎంసీ అనుమతి ఇవ్వడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 50 స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చారు. జింఖానా మైదానంలో 19 స్టాళ్లు, ఘంటసాల సంగీత కళాశాలలో 23 స్టాళ్లు, శాతవాహన కళాశాల ఓపెన్ గ్రౌండ్‌లో 12 స్టాళ్లు, అజిత్‌సింగ్ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం మైదానంలో నాలుగు స్టాళ్లులు ఏర్పాటు చేశారు.

శాతవాహన కళాశాల మైదానం, జింఖానా మైదానం ప‌రిస‌ర ప్రాంతాల్లో అన్ని జ‌నావాసాలే ఉన్నాయి. జింఖానా మైదానం చుట్టూ అర్బన్ హెల్త్ సెంటర్, VMC ఫంక్షన్ హాల్, స్విమ్మింగ్ పూల్ ఉన్న చిన్న మైదానం. అంతేకాకుండా, రోడ్డుకు అవతలి వైపున పెట్రోల్ బంక్ కూడా దీనికి సమీపంలో ఉంది. ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పాటించాలని బాణాసంచా స్టాల్స్‌ యజమానులు విధిగా పాటించాలని వీఎంసీ ఫైర్‌ సేఫ్టీ విభాగం పేర్కొంది. వ్యాపారులు 200 లీటర్ల నీరుతో రెండు డ్రమ్ములు, నాలుగు బకెట్ల ఇసుక, రెండు ఇసుక బస్తాలు ద‌గ్గ‌ర ఉంచాల‌ని పేర్కొంది. కానీ ఈ చర్యలు మెగా అగ్ని ప్రమాదాలను నివారించలేవు. ఆదివారం జ‌రిగిన ప్ర‌మాదానికి అధికార పార్టీ నేతలే కారణమని సీపీఎం రాష్ట్ర నాయకుడు సీహెచ్‌ బాబూరావు ఆరోపించారు. చిన్న జింఖానా గ్రౌండ్స్‌లో 19 దుకాణాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఈ దుర్ఘటనపై విచారణ జరిపి 19 స్టాళ్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.