Site icon HashtagU Telugu

YCP Party: సింహం సింగిల్ గానే!

YCP Special status

Jagan Ycp Flag

ప్రస్తుత దేశ రాజకీయాలకు పీకే ఫీవర్ పట్టుకుంది. రాబోయే ఎన్నికలకు వ్యూహకర్తలే ప్రధాన కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పీకే వైపు ద్రుష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ లో చేరుతారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తారని భావించారు రాజకీయ విశ్లేషకులు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు పీకే. కాగా తెలంగాణలో మాత్రం అధికార పార్టీ టీఆర్ఎస్ మాత్రం పీకే సేవలను ఉపయోగించుబోతోంది. దీంతో ఏపీలో కూడా వైసీపీకి పీకే పనిచేస్తారా? లేదా? అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ప్రస్తుతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సేవలు అందించడం లేదని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘ప్రశాంత్ కిశోర్‌తో సీఎం వైఎస్ జగన్‌కి వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంది. 2019 ఎన్నికల్లో ఆయన మాతో కలిసి పనిచేశారు. తరువాత ప్రశాంత్ కిశోర్ మాతో పనిచేయడం లేదు. భవిష్యత్‌లో పనిచేసే అవకాశాలు ఉండకపోవచ్చు. మాకు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ మాకు పొత్తు ఉండదు. ఒంటరిగానే పోటీచేయాలన్నది సీఎం వైఎస్ జగన్ సిద్ధాంతం. మాతో పొత్తు పెట్టుకోవాలని చాలా పార్టీలు అనుకోవచ్చు. కానీ సీఎం జగన్ ఎప్పుడూ పొత్తుల్లేకుండానే రాజకీయం చేస్తున్నారు. మహిళలకు ఎన్నడూలేని సాధికారత, భద్రత అందిస్తున్నాం అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, వైసీపీ కలిసి పనిచేస్తాయని భావించిన నేతలకు షాక్ ఇచ్చినట్టయింది.

Exit mobile version