Election Duty : కేంద్ర ఎన్నికల సంఘం రేపు(శనివారం) ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఈనేపథ్యంలో గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలపై ఏపీ సర్కారు కీలకమైన ఆర్డర్స్ ఇచ్చింది. వాలంటీర్లను ఏ రూపంలోనూ ఎన్నికల విధుల్లో వినియోగించరాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.ఎస్.జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియకు వారిని దూరంగా ఉంచాలని నిర్దేశించారు. అన్ని రకాల ఎన్నికల విధుల(Election Duty) నుంచి వారిని తక్షణమే తొలగించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీసం ఏజెంట్లుగా కూడా నియమించరాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. గతంలో దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ పంపించారు.
We’re now on WhatsApp. Click to Join
ఏపీ ప్రభుత్వ వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిటిజన్ ఫర్ డెమొక్రసీ (సీఎఫ్‌డీ) అనే సంస్థ చేసిన విజ్ఞప్తిపై తగు నిర్ణయం తీసుకోవాలని సీఈసీని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలన్న ఉత్తర్వులపై ఏపీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని సీఎఫ్ డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం 3 వారాల్లోగా తగు నిర్ణయం వెలువరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈసీ నుంచి అందిన ఆదేశాల మేరకు తాజాగా ప్రభుత్వ వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ వైఎస్ జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. అయితే, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో ఎన్నికల విధులు నిర్వహించుకోవచ్చునని ఈసీ పేర్కొంది. ఈ సిబ్బందికి ఓటర్ల వేలుకు ఇంకు పూసే విధులు అప్పగించవచ్చునని స్పష్టం చేసింది. వీటికి అదనంగా మరే ఎన్నికల విధులను వారికి అప్పగించకూడదని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారికి ఈసీ సూచించింది.
Also Read : Elections Schedule : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రేపే.. ఈసీ రెడీ
ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికల నగారా రేపు (శనివారం) మోగనుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) మీడియా సమావేశం నిర్వహించి ఎన్నిల షెడ్యూల్‌ను అనౌన్స్ చేయనుంది. న్యూఢిల్లీలోని జ్ఞాన్ భవన్‌లో ఈ ప్రెస్ మీట్ జరగనుంది. వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఈ ప్రెస్‌మీట్‌ను లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. ఈవివరాలను ‘భారత ఎన్నికల సంఘం ప్రతినిధి’ ‘ఎక్స్ వేదికగా వెల్లడించారు.లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని తెలుస్తోంది.