Electricity Charges: ఏపీలోని గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు పెద్ద ఊరట లభించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను ఎలాంటి అదనపు ఛార్జీల భారం మోపకూడదని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతోప్రస్తుతం ఉన్న టారిఫ్ లే అమల్లో ఉండనున్నాయి. ఈ మేరకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రకటన విడుదల చేసింది.
విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తమకు నష్టం కలుగుతున్నా కానీ అదనపు ఛార్జీలు మోపకపోవడానికి కారణం ప్రభుత్వ వ్యతిరేకత రాకుండా చేయాలనే జగన్ ప్రభుత్వ నిర్ణయమే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. విద్యుత్ ఛార్జీల పేరుతో ఇప్పుడు అదనపు ఛార్జీలు వసూలు చేస్తే, అది ప్రభుత్వ వ్యతిరేకతకు కారణం అవుతుందని, కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఏపీఈపిడిసిఎల్, ఎపిఎస్పిడిసిఎల్, ఎపిసిపిడిసిఎల్ పరిధిలో ఉన్న రైతు సంఘాలు, రాజకీయపార్టీల నేతలు, ఎన్‌జీవోలు తమ అభిప్రాయాలు, అభ్యంతరాల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీఈఆర్‌సీకి వెల్లడిస్తున్నాయి. మొదటిరోజు 15 మంది తమ అభిప్రాయాల్ని ఏపీఈఆర్‌సీకి తెలుపగా.. విద్యుత్ టారిఫ్‌ల మార్పులపై అన్ని వర్గాల అభిప్రాయాల్ని తీసుకొని త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఏపీఈఆర్‌సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి ప్రకటించారు.
డిస్కంలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల విషయంలో, రాజకీయ ఆరోపణలన్నీ వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్ నాగార్జునరెడ్డి వెల్లడించారు. అటు సామాన్యులపై భారం మోపేందుకు అంగీకరించకపోవడం డిస్కంల నుండి అందుతున్న శుభవార్త అని అన్న ఆయన.. గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులపై 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారం ఉండబోదన్నారు.