Pawan Kalyan: బొకేలు, శాలువాలు వద్దు.. మంత్రి పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్

  • Written By:
  • Publish Date - June 13, 2024 / 10:15 PM IST

Pawan Kalyan: ‘‘ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక నలుచెరగుల నుంచీ అభినందనలు, శుభాకాంక్షలు అందుతూనే ఉన్నాయి. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు, మేధావులు, నిపుణులు, సినీ రంగంలో ఉన్నవారు, యువత, రైతులు, ఉద్యోగ వర్గాలు, మహిళలు అభినందనలు అందిస్తున్నారు. జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఆనందంతో వేడుకలు చేసుకున్నారు. ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’’ అంటూ ఏపీ మంత్రి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు.

‘‘రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం నన్ను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారు. త్వరలోనే వారందరినీ జిల్లాలవారీగా కలసి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. ఇందుకు సంబంధించిన షెడ్యూలు కేంద్ర కార్యాలయం ద్వారా తెలియచేస్తాము. అభినందనలు తెలియచేయడానికి వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’ అంటూ పవన్ కోరారు.

‘‘ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అదే విధంగా శాసన సభ సమావేశాలు కూడా త్వరలోనే ఉంటాయి. వీటిని పూర్తి చేసుకొని – నన్ను అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలను కలుస్తాను. ఈ నెల 20వ తేదీ తరవాత పిఠాపురం నియోజకవర్గంలోని కార్యకర్తలను కలుస్తాను. ఆ తరవాత దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తా’’ అని పవన్ తెలిపారు.