కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. ఆగస్టు 2న ఆయన ఏపీలో పర్యటించనున్నారు. ఈ పర్యటన(AP Tour)లో భాగంగా సుమారు రూ. 9,500 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని సమాచారం. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది ఒక కీలక ఘట్టంగా మారనుంది.
టీడీపీ ఎంపీలు, ఏపీ మంత్రి సత్యకుమార్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నితిన్ గడ్కరీని కలిశారు. ఈ సందర్భంగా వారు కోరనూరు-బందరు రోడ్డు విస్తరణ, విశాఖపట్నం, విజయవాడలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ల నిర్మాణం, హైదరాబాద్-అమరావతి అనుసంధాన రోడ్డు, కర్నూలు-ఎమ్మిగనూరు రోడ్డు విస్తరణ సహా పలు కీలక ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి వినతిపత్రాలు సమర్పించారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర రహదారుల వ్యవస్థను గణనీయంగా మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు.
Investment : వామ్మో ఏపీలో గూగుల్ 50 వేల కోట్ల పెట్టుబడి..యూఎస్ తర్వాత వైజాగే !!
ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వినతులు అందుకున్న గడ్కరీ, ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రహదారుల నెట్‌వర్క్‌ను పటిష్టం చేయడం ద్వారా వాణిజ్యం, పర్యాటకం, ప్రజల రవాణాకు మరింత సులభతరం అవుతుంది. ముఖ్యంగా, ప్రధాన నగరాల్లోని ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు సహాయపడతాయి.
గడ్కరీ పర్యటన సందర్భంగా చేపట్టే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు రాష్ట్రంలో కొత్త నిర్మాణాలకు ఊతమిస్తాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, రవాణా సౌకర్యాలు మెరుగుపడి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల కల్పనలో ఇది ఒక ముఖ్యమైన అడుగు కానుంది.