కడుపునొప్పితో చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చిన 19 ఏళ్ల యువతి ఆస్పత్రి బాత్‌రూమ్‌లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే శిశువును బాత్‌రూమ్‌లోనే ఆ యువతి వదిలి వెళ్లిపోయింది. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో అఖిల అనే యువతి, మరో ఇద్దరు వ్యక్తలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆమెను పరీక్షించిన తర్వాత.. డ్యూటీ డాక్టర్ కోసం ఆమెను ప్రక్కనే ఉన్న భవనానికి పంపారు. అయితే అక్కడ ఆమె పరీక్షలు చేయడం ఆలస్యమైంది.దీంతో కడుపునొప్పి తీవ్రమవ్వడంతో అఖిల ఆసుపత్రి బాత్రూమ్ లోకి వెళ్లింది. అదే సమయంలో అఖిల ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ తరువాత ఆమె శిశువును బాత్రూంలో వదిలివేసి ఆసుపత్రి నుండి వెళ్లిపోయింది
బాత్‌రూమ్‌లోకి ప్రవేశించిన ఇతర వ్యక్తులు రక్తంలో ఉన్న నవజాత శిశువును చూశారు. వారు ఆసుపత్రి సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో అప్రమత్తమైన వైద్యులు శిశువును బయటికి తీసి అవసరమైన వైద్యం అందించారు. శిశువును ప్రస్తుతం వెంటిలేటర్‌లో ఉంచారు. ప్రస్తుతం పాప క్షేమంగా ఉందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. తన బిడ్డను వదిలేసినందుకు అఖిలపై ఆసుపత్రి అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి తల్లిని, ఆమె వెంట వచ్చిన ఇద్దరిని గుర్తించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై కూడా విచారణ జరుపుతున్నారు.