విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి 65 విస్తరణ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. ఈ మార్గంలోని నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు ప్రణాళికలు రచించారు. అందులో భాగంగా కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్ కూడా సిద్ధం చేసింది. ఈ డీపీఆర్ గురించి ఇటీవల నిర్వహించిన స్టేక్ హోల్డర్స్ సమావేశంలోనూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. డీపీఆర్‌లో అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్ల ప్రస్తావన లేదని జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై జాతీయ రహదారుల సంస్థ అధికారులు.. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి్ కృష్ణబాబుతో సమావేశమయ్యారు. దీని గురించి వివరించారు.
కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీలో పలు మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణం వేగం పుంజుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ పనులు కూడా చేపట్టాలని నిర్ణయించారు. అయితే విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి -65 డీపీఆర్ గురించి ప్రస్తుతం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ కోసం కన్సల్టెన్సీ సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదిక ( డీపీఆర్) తయారు చేసింది. అయితే ఈ డీపీఆర్ మీద అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క ఫ్లైఓవర్, అండర్‌పాస్ లేకుండానేవిజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి డీపీఆర్తయారు చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లింది.
విజయవాడలోని బెంజ్ సర్కిల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మొదలయ్యే చినఓగిరాల వరకూ జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఒక్క ఫ్లైఓవర్, అండర్‌పాస్ కూడా లేకుండా డీపీఆర్ తయారు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన స్టేక్ హోల్డర్స్ సమావేశంలోనూ ప్రజా ప్రతినిధులు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వ్యవహారం కాస్తా సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతో.. జాతీయ రహదారి ప్రాధికార సంస్థ అధికారులు, మెట్రో అధికారులు ఇటీవల సమావేశమయ్యారు. డీపీఆర్ మీద వస్తున్న అసంతృప్తిని వివరించారు. అలాగే జాతీయ రహదారి విస్తరణ జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యల గురించి వివరించారు.
ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో.. వాటిని పరిష్కరించేందుకు బెంజ్ సర్కిల్ నుంచి అన్ని కూడళ్లను అనుసంధానం చేసేలా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ (ఎలివేటెడ్ కారిడార్)నిర్మాణం చేపట్టాలని.. లేదంటే అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు నిర్మించాలని స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు కోరినట్లు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుకు వివరించారు. ఈ అంశాన్ని కృష్ణబాబు సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి డీపీఆర్‌లో మార్పులు చేస్తారనే వార్తలు వస్తున్నాయి . అయితే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ వైపు మొగ్గు చూపుతారా లేదా.. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు విజయవాడ – మచిలీపట్నం మధ్య 64 కిలోమీటర్ల మేర రహదారిని ఆరు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ జిల్లాలో2 కిలోమీటర్లు, కృష్ణా జిల్లాలో 62 కిలోమీటర్ల మేరకు రహదారి విస్తరణ పనులు చేపట్టాలని గతంలో ప్రణాళికలు రచించారు. ఈ రహదారి విస్తరణ పనుల కోసం డీపీఆర్ తయారీని ఓ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించారు. అయితే కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన డీపీఆర్ మీద ప్రస్తుతం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
