Site icon HashtagU Telugu

New Political Party : ఏపీలో మ‌రో కొత్త పార్టీ.. ఈ నెల 23 న “ప్ర‌జా సింహ‌గ‌ర్జ‌న” పార్టీ ఆవిర్భావం

Bode ramachandra Yadav

Bode ramachandra Yadav

ప్రజా సింహగర్జన నూతన పార్టీ ఆవిర్భావ సన్నాహక సమావేశం విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించారు. ఈనెల 23వ తేదీన ప్రజా సింహగర్జన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహిస్తామ‌ని ప్రజా సింహగర్జన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ తెలిపారు. నాగార్జున యూనివర్సిటీ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామ‌ని.. ఖ‌చ్చితంగా దోపిడీ పార్టీలు ను ఓడించి సరికొత్త పాలనను తీసుకొస్తామ‌ని ఆయ‌న తెలిపారు. మోసాలతో విసగిపోయిన ప్రజలు కూడా కొత్త పార్టీ కోసం చూస్తున్నారని.. గత పాలకులు బీసీలను ఓట్ల కోసం వాడుకున్నారని ఆయ‌న ఆరోపించారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించార‌ని..బీసీల‌ పేరు చెప్పి రాష్ట్ర సంపదను పాలకులు దోచుకుంటున్నారని రామ‌చంద్ర‌యాద‌వ్ ఆరోపించారు. కుటుంబ పార్టీలు, హత్యా రాజకీయ పార్టీలు లను సాగనంపాలని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. బీసీల‌కు న్యాయం చేస్తామన్న టీడీపీ అనేక సార్లు మాట తప్పింద‌ని..బీసీల‌ రిజర్వేషన్ లో మురళీదరన్ కమిటీ సిఫార్సు లు అమలు‌ చేయలేదన్నారు. 56 కార్పొరేషన్లు వేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి పైసా కూడా ఇవ్వలేదని.. తప్పుడు హామీలతో, మోస పూరిత మాటలతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని తెలిపారు. వైసీపీ నాయకులకు పదవులు ఇవ్వడం కోసమే కార్పొరేషన్‌లు పెట్టారని.. ఓటు బ్యాంకు రాజకీయం కోసం బీసీల‌ను వంచించారన్నారు. వచ్చే ఎన్నికలలో ఈ రెండు పార్టీ లకు బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధం గా ఉన్నార‌ని రామ‌చంద్ర‌యాద‌వ్ తెలిపారు.