Site icon HashtagU Telugu

Tirupathi Mahasabha : తిరుప‌తి ‘మ‌హాస‌భ’ ప‌ద‌నిస‌లు

Mahasabha 2

Mahasabha 2

ఏపీలోని వామ‌ప‌క్షాలు, బీజేపీ, జ‌న‌సేన పార్టీల వాల‌కం విచిత్రంగా ఉంది. తిరుప‌తిలో జ‌రిగిన అమ‌రావ‌తి రైతుల మ‌హాస‌భ వేదిక‌ను గ‌మ‌నిస్తే ఆయా పార్టీలోని అంత‌ర్గ‌త వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డుతోంది. ఆ స‌భ‌ను టీడీపీ నిర్వ‌హించిద‌ని వైసీపీ చెబుతోంది. కానీ, తెలుగుదేశం పార్టీకి చెందిన ఉత్త‌రాంధ్ర, రాయ‌ల‌సీమ‌ నేత‌లు ఆ వేదిక మీద చాలా ప‌లుచ‌గా క‌నిపించ‌డం ఒక ఎత్తు. ఇక వైసీపీ రెబ‌ల్ ఎంపీ ఆ స‌భ‌కు హైలెట్ గా నిలిచాడు. ఉభ‌య క‌మ్యూనిస్ట్ పార్టీలోని అనైక్య‌త క్లియ‌ర్ గా కనిపించింది. సీపీఎం ఆ వేదిక‌ను పంచుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. జ‌న‌సేనాని, బీజేపీ అధ్య‌క్షులకు బ‌దులుగా వాళ్ల ప్ర‌తినిధులు హాజ‌రు కావడం గ‌మ‌నార్హం.ఏపీ బీజేపీలోని లీడ‌ర్ల‌కు కొందరు చంద్ర‌బాబు గ్రూప్ మ‌రికొంద‌రికి జ‌గ‌న్ గ్రూప్ గా ముద్ర ఉంది. నికార్సైన బీజేపీ లీడ‌ర్లు అక్క‌డ చాలా త‌క్కువ‌. క‌మ్యూనిస్ట్ పార్టీల‌కు కూడా జ‌గ‌న్‌, బాబు గ్రూప్ స్టాంప్ లేక‌పోలేదు. జ‌న‌సేనాని పై తొలి నుంచి చంద్ర‌బాబు ముంద్రను వైసీపీ బ‌లంగా వేసింది. టీడీపీలోని కొంద‌రు జ‌గ‌న్ పంచ‌న ఉన్నారు. వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజు టీడీపీకి అండ‌గా న‌డుస్తున్నాడు. అమ‌రావ‌తి వేదిక‌పై ప్ర‌ముఖంగా క‌నిపించిన లీడ‌ర్లు దాదాపుగా చంద్ర‌బాబు ముద్ర‌ప‌డిన నాయ‌కులే ఉన్నార‌ని ప్ర‌త్య‌ర్థుల అభిప్రాయం.

ఏపీలో క‌మ్యూనిస్ట్ పార్టీలు బ‌లంగా ఉండేవి. వాళ్లలోని అనైక్య‌త కార‌ణంగా ఉనికి కూడా లేకుండా పోయింది. రాష్ట్ర విభ‌జ‌నకు సీపీఐ జై కొట్టింది. అందుకే ఏపీలో ఆ పార్టీని దాదాపు ప్ర‌జ‌లు దూరంగా పెట్టారు. స‌మైఖ్యాంధ్ర నినాదాన్ని బ‌లంగా వినిపించిన ఏకైక పార్టీ సీపీఎం. రాజ‌కీయంగా న‌ష్ట‌పోతామ‌ని తెలిసిన‌ప్ప‌టికీ సిద్ధాంతాల‌పై న‌డుస్తూ ఉంది. బీజేపీ వేదిక‌ను పంచుకోవ‌డానికి ఏ మాత్రం సీపీఎం అంగీక‌రించ‌దు. అందుకే, బ‌హుశా తిరుప‌తి స‌భ‌కు ఆ పార్టీ దూరంగా ఉంది.వైసీపీతో స‌హా అన్ని పార్టీలు అమ‌రావ‌తి కోసం ఒకే వేదిక‌పైకి వ‌చ్చాయ‌ని ఫోక‌స్ అయింది. కానీ, ఆయా పార్టీల్లోని ఉదాసీన వైఖ‌రిని ఆ వేదిక‌పై పాల్గొన్న నాయ‌కుల‌ను ఆధారంగా గ‌మ‌నించ‌వ‌చ్చు. బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోమువీర్రాజు స‌భ‌కు దూరంగా ఉన్నాడు. ఆ పార్టీ త‌ర‌పున మాజీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ పాల్గొన్నాడు. ఆయ‌న‌పై చంద్ర‌బాబు ముద్ర బ‌లంగా ఉన్న కార‌ణంగా బీజేపీ అధిష్టానం ప‌క్క‌న పెట్టిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇక జ‌న‌సేనానిపై తొలి నుంచి టీడీపీ ముద్ర ఉంది. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న వ్యూహాత్మ‌కంగా తిరుప‌తి స‌భ‌కు దూరంగా ఉన్నార‌ని ఆ పార్టీ వ‌ర్గీయుల టాక్‌. ఆయ‌న‌కు బ‌దులుగా ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. సీపీఐ ఏపీ కార్య‌ద‌ర్శి, జాతీయ కార్య‌ద‌ర్శులు రామ‌క్రిష్ణ‌, నారాయ‌ణ పాల్గొన్న‌ప్ప‌టికీ రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ఆ పార్టీ లీడ‌ర్లు వేదిక‌పై క‌నిపించ‌లేదు.

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ‌క్రిష్ణంరాజు, బీజేపీలోని చంద్ర‌బాబు గ్రూప్‌, కోస్తాకు చెందిన టీడీపీ, జ‌న‌సేన కొంద‌రు లీడ‌ర్లు వేదిక‌పై హైలెట్ గా నిలిచారు. అందుకే రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు ఈ వేదికను సంకేతంగా తీసుకోలేం. భ‌విష్య‌త్ లోనూ బీజేపీ వేదిక‌ను క‌మ్యూనిస్ట్ లు పంచుకునే అవ‌కాశం ఉండ‌దు. టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన ఒక‌ట‌వ‌డానికి సంకేత‌మా? అంటే ఆ వేదిక పై ఆయా పార్టీల‌ అధిప‌తుల క‌నిపించ‌లేదు. సో…రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు తిరుప‌తి స‌భ‌ను అన్వ‌యించుకోవ‌డం అమాక‌త్వ‌మే అవుతుంద‌ని విశ్లేష‌కుల భావ‌న‌.