టాలీవుడ్ యువ కథానాయకుడు, మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఓ అభినందన సందేశాన్ని పోస్ట్ చేశారు. మేనల్లుడిపై ప్రశంసలు కురిపిస్తూ, ఆయన వ్యక్తిత్వాన్ని, పని పట్ల అంకితభావాన్ని కొనియాడారు.
“యువ కథానాయకుడు సాయి దుర్గా తేజ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అంటూ పవన్ తన పోస్ట్‌ను ప్రారంభించారు. ‘కష్టే ఫలి’ అనే మాటను సాయి తేజ్ చిత్తశుద్ధితో ఆచరిస్తాడని, చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి నేటి వరకు అదే తపనతో పనిచేస్తున్నాడని ప్రశంసించారు. నటుడిగానే కాకుండా సామాజిక స్పృహ కలిగిన బాధ్యతాయుతమైన పౌరుడిగా తేజ్‌ను ఆయన అభినందించారు.
వర్తమాన అంశాలపై స్పందిస్తూ రహదారి భద్రత, సోషల్ మీడియాలో నెలకొన్న ప్రతికూల ధోరణులపై సాయి తేజ్ ప్రజలను చైతన్యపరచడం అభినందనీయమని పవన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో కథానాయకుడిగా మరిన్ని గొప్ప విజయాలు అందుకోవాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన తన సందేశాన్ని ముగించారు. పవన్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.