Site icon HashtagU Telugu

YCP Party: ‘నెల్లూరు’ వైసీపీలో వర్గపోరు!

Anil And Kakani

Anil And Kakani

ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వైసీపీలో వర్గ విభేదాలకు అగ్గి రాజేసినట్లే ఉంది. నెల్లూరులో ముదిరి పాకాన పడిన అనిల్, కాకాణి వివాదమే దానికి ఉదాహరణ. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కాకాణి తొలిసారిగా నెల్లూరుకు వస్తున్నారు. దీంతో ఆయనకు స్వాగతం పలకడానికి భారీగా ఏర్పాట్లు చేశారు. సరిగ్గా అదే రోజున మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నియోజకవర్గంలో కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. దీంతో కాకాణి వస్తున్న రోజే.. ఇలా అనిల్ సభ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కాకాణికి, అనిల్ కు మధ్య విభేదాలు ఇంకా పెరిగాయి.

తాను మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి తన నియోజకవర్గంలో తనను అడుగుపెట్టనివ్వలేదన్నారు అనిల్. అందుకే ఇప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉన్న నెల్లూరు నగర నియోజకవర్గంలో తానేంటో చూపించుకోవడానికి ఆయన ఆరాటపడుతున్నారని వైసీపీ వర్గాలే అంటున్నాయి. పైగా తనకు మద్దతును కూడగట్టుకోవడానికి వీలుగా కోవూరు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలను కూడా కలిశారు అనిల్. తనను మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి కాకాణి ఆహ్వానించలేదన్న అనిల్.. తాను మాత్రం.. కాకాణి అన్న చూపించిన ప్రేమ, వాత్సల్యం, సహకారాన్ని రెండింతలు అందిస్తానని గతంలోనే చెప్పారు. దీంతో ఇద్దరి మధ్యా విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అందుకే కాకాణి ర్యాలీ సమయంలోనే అనిల్ తన నియోజకవర్గంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో సభను ఏర్పాటు చేశారు.

కాకపోతే ఇది బల ప్రదర్శన కోసం కాదని.. కార్యకర్తల్లో మనో ధైర్యం నింపేందుకే అని చెప్పుకొచ్చారు. దీంతో ఒకేసారి వైసీపీ నాయకుల రెండు కార్యక్రమాలు ఉండడం, ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉన్నందున దాదాపు 1000 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేయాల్సి వచ్చింది. వైసీపీ నాయకత్వం కూడా ఇద్దరికీ సర్దిచెప్పలేక.. ఎవరి కార్యక్రమాలు వాళ్లు చేసుకోవాలని చెప్పింది. విమర్శలు కాని, వివాదాస్పద మాటలు, చర్యలు చేపట్టవద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాతే పార్టీలో ఇలాంటి లుకలుకలు అన్నీ బయటికొస్తున్నాయంటున్నారు విశ్లేషకులు.