Kakani Case : కాకాణీ కేసులో నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నివేదికలో సంచలన అంశాలు

కాకాణి గోవర్థన్ రెడ్డి నిందితుడిగా ఉన్న కేసుకు సంబంధించిన పత్రాలు నెల్లూరు కోర్టులో చోరీకి గురైన ఘటనకు సంబంధించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి.

  • Written By:
  • Publish Date - April 27, 2022 / 11:04 AM IST

కాకాణి గోవర్థన్ రెడ్డి నిందితుడిగా ఉన్న కేసుకు సంబంధించిన పత్రాలు నెల్లూరు కోర్టులో చోరీకి గురైన ఘటనకు సంబంధించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ దస్త్రాలు దొంగతనం చేశారంటూ కోర్టు క్లర్క్ ముందుగా పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు. అయితే ఆ కేసు ప్రాపర్టీ.. కోర్టు ఆధీనంలోనే లేదని.. అది పోలీస్ స్టేషన్ లో ఉందన్న విషయం ఇప్పుడు వెలుగుచూసింది. ఈమేరకు నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని.. హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ఈ అంశాలు ఉన్నాయి.

అసలు పత్రాలు చోరీకి గురయ్యాయన్నది క్లర్క్ అల్లిన కట్టుకథగా ఆమె విచారణలో తేలింది. కోర్టును కూడా తప్పుదారి పట్టించినట్లుగా స్పష్టమైంది. అందుకే స్వతంత్ర సంస్థతో సమగ్రమైన దర్యాప్తు చేయించాలని సిఫార్స్ చేశారు. ఈనెల 14న కోర్టు సమీపంలో మురుగుకాలవలో లభించిన ప్రాపర్టీ.. నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టుకు సంబంధించినది కాదని స్పష్టంగా చెప్పారు.

కాకాణి గోవర్థన్ రెడ్డి నిందితుడిగా ఉన్న కేసుకు సంబంధించిన ప్రాపర్టీని విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు సమర్పించలేదు. కానీ ఈ అంశాన్ని ఆ క్లర్క్ జడ్జ్ కు చెప్పలేదు. తరువాత ఈ ప్రాపర్టీ విషయంపై సమగ్ర విచారణ జరిగింది. చివరకు కాకాణి నిందితుడిగా ఉన్న క్రైమ్ నెంబర్ 521/2016 కు సంబంధించిన ప్రాపర్టీ.. నెల్లూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ ఇంటీరియమ్ కస్టడీలో ఉందని తేలింది.

నెల్లూరు కోర్టుతో పాటు ప్రాసెస్ సర్వర్ కు భద్రత కోసం 3 ప్లస్ 1 పోలీస్ సిబ్బంది ఉంటారు. కానీ చోరీ జరిగిన రోజు వారు సరైన సెక్యూరిటీ కల్పించలేదు. దొంగతనం జరిగిన తరువాత దర్యాప్తు కూడా సరిగా జరగలేదు. అందుకే స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఈ మొత్తం విచారణాంశాన్ని అప్పగించాలంటూ హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. బెంచ్ క్లర్క్ గా కాంట్రాక్ట్ బేస్ లో పనిచేస్తున్న నాగేశ్వరరావును విచారణ అవసరం లేకుండానే తొలగించవచ్చని, ఆయపై పోలీసులకు కంప్లయింట్ ఇవ్వడానికి అనుమతించాలని తన నివేదికలో కోరారు.