AP News : రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గురువారంతో తమ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్నదని, ప్రజల ఆశీస్సులతో సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాల వైపు నడుస్తున్నామని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.
గత ఏడాది ఎన్నో ఆర్థిక సంక్షోభాల మధ్య, ప్రభుత్వ యంత్రాంగం నిరంతర కృషితో పలు ముఖ్యమైన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయగలిగిందని చంద్రబాబు తెలిపారు. ‘పేదల సేవలో’, ‘పెన్షన్లు’, ‘అన్న క్యాంటీన్లు’, ‘దీపం-2’, ‘తల్లికి వందనం’, ‘మత్స్యకార సేవలో’ వంటి పథకాలతో అర్హులైన వారికి న్యాయం చేశామన్నారు.
యువత కోసం మెగా డీఎస్సీ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించామని, ప్రైవేటు రంగ పెట్టుబడుల ద్వారా ఉద్యోగావకాశాలు పెంచామని సీఎం పేర్కొన్నారు. అలాగే రైతుల కోసం రూ. 55 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు, ‘అన్నదాత సుఖీభవ’ వంటి పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పించామని చెప్పారు.
రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వంటి నిలిచిపోయిన ప్రాజెక్టులకు కొత్త ఊపునిచ్చామని, సాగునీటి అవసరాల కోసం సుశక్తంగా పనిచేస్తున్నామని తెలిపారు. రైల్వే జోన్ సాధన, విశాఖ ఉక్కు కాపాడడంలో ప్రభుత్వ పాత్ర ప్రస్తావించారు. చివరిగా, ప్రజల విశ్వాసం తమకు బలమని, అదే స్ఫూర్తితో ముందుకు సాగి మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.
Adani : ఆరేళ్లలో రూ.8.3 లక్షల కోట్ల పెట్టుబడి.. అదానీ గ్రూప్ భారీ కేపెక్స్ ప్రణాళిక