జ‌గ‌న్ ఓటు బ్యాంకుపై జాతీయ మీడియా ఫోక‌స్.. గ్రాఫ్ ప‌డిందా? 10శాతం పెరిగిందా?

స్థానిక ఫ‌లితాల ఆధారంగా ఏపీ పొలిటిక‌ల్ హీరో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిగా జాతీయ మీడియా ఫోక‌స్ చేస్తోంది. సాధార‌ణ ఎన్నిక‌ల్లో 49.8శాతం ఓట్ల‌తో 151 స్థానాల‌ను వైసీపీ గెలుకుకుంది.

  • Written By:
  • Publish Date - September 25, 2021 / 03:58 PM IST

స్థానిక ఫ‌లితాల ఆధారంగా ఏపీ పొలిటిక‌ల్ హీరో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిగా జాతీయ మీడియా ఫోక‌స్ చేస్తోంది. సాధార‌ణ ఎన్నిక‌ల్లో 49.8శాతం ఓట్ల‌తో 151 స్థానాల‌ను వైసీపీ గెలుకుకుంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో కేవ‌లం 23 స్థానాల‌ను మాత్ర‌మే టీడీపీ గెలుచుకున్న‌ప్ప‌టికీ ఓట్ల శాతం 39.7గా ఉంది. కాంగ్రెస్ పార్టీకి 1.17శాతం ఓట్లు రాగా, జ‌న‌సేన‌కు సుమారు 7శాతం ఓట్ల‌ను రాబ‌ట్టింది. మిగిలిన పార్టీలు ఒక‌శాతానికి లోపుగా ఓట్ల శాతాన్ని పొందాయి. ప్ర‌ధాన పార్టీలుగా వైసీసీ, టీడీపీ మ‌ధ్య సుమారు 10శాతం ఓటు బ్యాంకు.వ్య‌త్యాసం ఉంది. తాజా స‌ర్వేల్లో జ‌గ‌న్ గ్రాఫ్ ప‌డిపోయింద‌ని జాతీయ స్థాయిలోని ఒక మీడియా చెప్పింది.
తాజాగా జ‌రిగిని స్థానిక ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పార్టీకి 59.2శాతం ఓట్ల వ‌చ్చిన‌ట్టు జాతీయ స్థాయిలో కొంత మీడియా ఫోక‌స్ చేస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ 49.8శాతం ఓట్లు రాగా, ఇప్పుడు పంచాయ‌తీలు, జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేష‌న్‌, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ర‌మార‌మి 59.2శాతం ఓట్లు ల‌భించాయి. సుమారు 10శాతం ఓటు బ్యాంకు సాధార‌ణ ఎన్నిక‌ల కంటే జ‌గ‌న్ కు పెరిగింది. అదే నిష్ప‌త్తిలో చంద్ర‌బాబు పార్టీ టీడీపీకి 10శాతం ఓటు బ్యాంకు త‌గ్గింది. ఇక బీజేపీ, జ‌నసేన ఉమ్మ‌డిగా 4.6శాతం ఓటు బ్యాంకును సంపాదించుకున్నాయ‌ని జాతీయ మీడియా లెక్కిస్తోంది. క‌మ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ ల‌కు ఏపీలో స్థానం లేద‌ని తేల్చేసింది.
ఏపీలో వివిధ ర‌కాల సంక్షేమ ప‌థ‌కాలు 28 అమ‌లు అవుతున్నాయి. వాటిలో 23 ప‌థ‌కాల‌కు సంబంధించిన ల‌బ్దిని నేరుగా ల‌బ్దిదారులు పొందుతున్నారు. మొత్తం ఏపీలోని 1.6కోట్ల గృహాల్లో 1.41 కోట్ల గృహాల్లో నివ‌సించే ప్ర‌జ‌లు ప‌థ‌కాల ద్వారా ల‌బ్ది పొందార‌ని సీఎం జ‌గ‌న్ రెండు నెల‌ల క్రితం ప్ర‌క‌టించారు. అందుకోసం 95 వేల 528 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్టు వెల్ల‌డించారు. ప్ర‌త్య‌క్షంగా కాకుండా ప‌రోక్షంగా ఉండే పథ‌కాల ద్వారా మ‌రో 37వేల కోట్ల‌ను ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ అందించింది. గ‌త రెండేళ్ల‌లో సుమారు. 1.27కోట్ల‌ను వివిధ రూపాల్లో కేంద్రం ద్వారా ఏపీ ప్ర‌భుత్వం అప్పులు తీసుకుంది. గ‌త జూన్ నాటికి ఆ మొత్తంలో 1.3కోట్ల సంక్షేమ ప‌థ‌కాల‌కు ఖ‌ర్చు చేసింది. ఫ‌లితంగా ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వం 3.84 కోట్ల అప్పుల్లోకి వెళ్లింది. జ‌గ‌న్ అధికారం చేప‌ట్టే నాటికి రాష్ట్రం అప్పు 2.58కోట్లుగా ఉంది.
సంక్షేమానికి పెద్ద పీఠ వేసిన జ‌గ‌న్ పాల‌న భేష్ గా ఉంద‌ని స్థానిక ఫ‌లితాల ఆధారంగా జాతీయ మీడియాలోని కొన్ని చెబుతున్నాయి. సామాజిక ప‌రంగా ఏపీ ఓటు బ్యాంకు ఉంటుంది. ప్ర‌ధానంగా రాజ్యాధికారం క‌మ్మ‌, రెడ్డి సామాజిక వ‌ర్గాల వ‌ద్ద చాలా ఏళ్లుగా ఉంది. కాపు సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా కాంగ్రెస్ వైపు ఉండేది. ఇప్పుడు వైసీపీ వైపు కొంత‌, జ‌న‌సేన వైపు మోజార్టీ మ‌ళ్లింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా. ఇక బీసీలు ఎక్కువ‌గా 2019 వ‌ర‌కు టీడీపీ వైపు ఉండే వాళ్లు. కేంద్రం అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు ఇచ్చిన రిజ‌ర్వేష‌న్లో 5శాతం కాపుల‌కు ఇస్తాన‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించ‌డంతో బీసీలు జ‌గ‌న్ పార్టీ వైపు మ‌ళ్లారు. దీనికి తోడు క్రిస్టియాన్టీ బాగా వైసీపీకి క‌లొసొచ్చిన అంశంగా టీడీపీ అంచ‌నా వేస్తోంది. అందుకే, హిందువుల‌ను గంపగుత్త‌గా త‌మ‌వైపు తిప్పుకోవ‌డానికి టీడీపీ ఇటీవ‌ల బాగా ప్ర‌య‌త్నం చేసింది. అదే బీజేపీ హిందూ ఓటు బ్యాంకు కోసం ఏపీలో చాలా ప్ర‌య‌త్నాలు చేసింది. గ‌త ఏడాది కాలంగా వివిధ చోట్ల ఏపీలో విగ్ర‌హాల ధ్వంసం అంశాన్ని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్ల‌డానికి బీజేపీ, టీడీపీ పోటీప‌డ్డాయి. ఇన్ని చేసిన‌ప్ప‌టికీ స్థానిక ఎన్నిక‌ల్లో మాత్రం వైసీపీకి 10శాతం ఓటు బ్యాంకు పెరిగింద‌ని జాతీయ మీడియా అంచ‌నా.
2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో పొత్తులేనందు వ‌ల్ల క‌నీసం 53 స్థానాల‌ను కోల్పోవ‌ల‌సి వ‌చ్చింద‌ని టీడీపీ లెక్కిస్తోంది. అందుకే, ఈసారి జ‌న‌సేన‌, టీడీపీ,కాంగ్రెస్,క‌మ్యూనిస్ట్ లు ఒక‌ట‌యితే అధికారంలోకి రావ‌చ్చ‌ని సమీక‌రిస్తోంది. సామాజిక వ‌ర్గాల ప‌రంగా బీసీ ఓటు బ్యాంకు తిరిగి త‌మ వైపు రావ‌డానికి టీడీపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఎస్సీ మాల ఎక్కువ‌గా వైసీపీ వైపు ఉన్నారు. మాదిగ‌లు మొద‌టి నుంచి టీడీపీకి మ‌ద్ద‌తుగా ఉంటారు. కానీ, క్రిస్టియానిటీ కోణంలో ఎస్సీలు జ‌గ‌న్ వైపు మొగ్గుచూపుతార‌ని అంచ‌నా. అందుకే, ఈసారి సామాజిక‌, మ‌త ప‌ర‌మైన ఈక్వేష‌న్ల‌తో ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి టీడీపీ స‌మాయాత్తం అవుతోంది. కానీ, స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తే మ‌ళ్లీ జ‌గ‌న్ సీఎం అయ్యే అవ‌కాశం ఉంద‌ని జాతీయ మీడియాలోని ఒక వ‌ర్గం భావిస్తోంది. జాతీయ మీడియాలోని ఒక వ‌ర్గం జ‌గ‌న్ గ్రాఫ్ ప‌డిపోయింద‌ని చెబుతుంటే, మ‌రో వ‌ర్గం మాత్రం వైసీపీకి 10శాతం ఓటు బ్యాంకు పెరిగింద‌ని అంచ‌నా వేస్తోంది. ఏది వాస్త‌వ‌మో..2024 సాధార‌ణ ఎన్నిక‌ల వ‌ర‌కు వేచిచూడాల్సిందే.