ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా మారడంతో, మంత్రి లోకేష్ అమరావతిలోని అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. అనంతరం, అసెంబ్లీ నుంచి హుటాహుటిన గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లి, హైదరాబాద్‌కు బయల్దేరారు. ప్రస్తుతం రామ్మూర్తి నాయుడు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన పరిస్థితి విషమంగా మారడంతో, హైదరాబాద్‌కు తరలించి ఆస్పత్రిలో చేర్చారు.
మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఢిల్లీలో జరిగే ఒక ఆంగ్ల పత్రిక కాంక్లేవ్‌లో పాల్గొనిన తర్వాత ఆయన నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ క్రమంలో, మహారాష్ట్రలో తన ఎన్నికల ప్రచారాన్ని కూడా వాయిదా వేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు చంద్రబాబు ఢిల్లీ నుంచి నేరుగా మహారాష్ట్ర వెళ్లాల్సి ఉండగా, ఇప్పుడు ఆయన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసి హైదరాబాద్ రావచ్చని సమాచారం. అయితే, ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
నారా కర్జూరనాయుడు, అమ్మన్నమ్మ దంపతులకు రామ్మూర్తి నాయుడు రెండో కుమారుడు. ఆయన, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి తమ్ముడు. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు నటుడు నారా రోహిత్ మరియు నారా గిరీష్.
అన్న చంద్రబాబునాయుడు బాటలోనూ, రామ్మూర్తి నాయుడు 1994లో టీడీపీ తరఫున చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 ఎన్నికల్లో ఆయన మరోసారి పోటీ చేసినప్పటికీ, గల్లా అరుణకుమారి చేతిలో ఓడిపోయారు. తర్వాత, రామ్మూర్తి నాయుడు అనారోగ్య సమస్యల కారణంగా రాజకీయాల నుంచి విరమించుకుని, దూరంగా ఉన్నారు.