Site icon HashtagU Telugu

Nara Ramamurthy Naidu Final Rites : మరికాసేపట్లో రామ్మూర్తి అంతిమయాత్ర..

Nara Ramamurthy Naidu Final

Nara Ramamurthy Naidu Final

ఏపీ సీఎం చంద్రబాబు (AP CM CHandrababu) సోదరుడు..రామ్మూర్తి అంతిమ యాత్ర (Nara Ramamurthy Naidu Final Rites ) మరికాసేపట్లో మొదలుకాబోతుంది. నారా రామ్మూర్తి నాయుడి హఠాన్మరణం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. శనివారం గుండెపోటు కారణంగా కన్నుమూయడంతో నందమూరి, నారా కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి. సోదరుడి మరణ వార్త తెలిసి మహారాష్ట్ర పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. అలాగే మంత్రి నారా లోకేశ్ సైతం తన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. నిన్న ఆసుపత్రిలో చంద్రబాబు , నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు కుటుంబసభ్యులు, తెలుగుదేశం పార్టీ ప్రముఖులు నివాళులు అర్పించారు.

రామ్మూర్తినాయుడు పార్థివదేహం ఆయన స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకుంది.రామ్మూర్తి నాయుడు భౌతికకాయాన్ని ఈరోజు(ఆదివారం) ఉదయం ప్రత్యేక విమానంలో నారావారిపల్లెకు తీసుకరావడం తో జరిగింది. మంత్రి నారా లోకేశ్ తన చిన్నాన్న భౌతికకాయాన్ని దగ్గురుండి తీసుకొచ్చారు. ముందుగా హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో రామ్మూర్తి పార్థివదేహాన్ని తిరుపతికి తరలించారు. తిరుపతి నుంచి రోడ్డు మార్గంలో నారావారిపల్లెకు తీసుకొచ్చారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు సైతం హైదరాబాద్ నుంచి బయలుదేరి నారావారిపల్లెకు చేరుకోనున్నారు.

నారావారిపల్లెలోని తన నివాసం వద్ద ఉంచిన రామ్మూర్తి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు చంద్రబాబు. ఆయనతో పాటు మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, నారా లోకేశ్, బ్రాహ్మణి, సినీ నటులు మోహన్ బాబు, మంచు మనోజ్, పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు నివాళి అర్పించారు. కాసేపట్లో రామ్మూర్తినాయడు అంతిమయాత్ర ప్రారంభంకానుంది. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. తన తల్లిదండ్రుల అంతిమక్రియలు జరిగిన చోటే రామ్మూర్తినాయుడు అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

1952లో జన్మించిన రామ్మూర్తి నాయుడు నారా కర్జూరనాయుడు, అమ్మన్నమ్మ దంపతుల రెండో కుమారుడు. చంద్రబాబు కు తమ్ముడు. రామ్మూర్తి నాయుడికి భార్య ఇందిర, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు నటుడు రోహిత్‌, మరొకరు నారా గిరీష్. 1994లో రామ్మూర్తి నాయుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 1999 వరకు ప్రజలకు సేవలందించారు. అనంతరం ఆయన అనారోగ్యంతో రాజకీయాల నుంచి విరామం తీసుకున్నారు. రీసెంట్ గా నారా రోహిత్ ఎంగేజ్మెంట్ జరిగింది. ప్రతినిధి-2లో హీరోయిన్ గా నటించిన సిరి లేళ్లను (Siri Lella) రోహిత్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ నిశ్చితార్థానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, ఇంకా నారావారి ఫ్యామిలీ, అలాగే నందమూరి కుటుంబసభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు.

రోహిత్ తన ప్రేమ విషయాన్నీ ముందుగా పెద్దమ్మ భువనేశ్వరికి చెప్పినట్లు ఆ మధ్య వార్తలు బయటకు వచ్చాయి. రోహిత్ ప్రేమ విషయం తెలిసిన తర్వాత… భువనేశ్వరి పెళ్లి పెద్దగా మారారని నారా, నందమూరి కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. శిరీష కుటుంబ సభ్యులతో ఆవిడ స్వయంగా మాట్లాడి ఈ సంబంధం కుదిర్చారట. చంద్రబాబు, భువనేశ్వరి ఆశీస్సులతో నోవాటెల్ హోటల్ లో కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా నిశ్చితార్థ వేడుక జరిగింది. డిసెంబర్ లో పెళ్లి వేడుక జరపాలని అనుకున్నారు కానీ ఇప్పుడు తండ్రి మరణంతో రోహిత్ శోకసంద్రంలో పడిపోయాడు.