శ్రీశైలం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) విజయవంతంగా దూసుకెళ్తోంది. జనవరి 27న మొదలైన పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. వైసీపీ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ, తన విమర్శలతో ప్రత్యర్థి పార్టీలకు ఛాలెంజ్ విసురుతూ ముందుకు సాగుతున్నారు. ఎర్రటి ఎండలో లోకేశ్ ఏమాత్రం తగ్గకుండా పాదయాత్ర చేస్తూ అందరినీ కలుపుకొనిపోతూ ముందుకు సాగుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపర్చడంలో విఫలమైందంటూ.. టీడీపీ (TDP) మళ్లీ అధికారంలోకి వస్తే అభివ్రుద్ధిలో ఏపీ ఏవిధంగా దూసుకుపోతుందో వివరిస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరూ కలుపుకొని అన్ని వర్గాలను ఆకర్షిస్తున్నారు నారా లోకేశ్. ఆయన చేపట్టిన పాదయాత్ర నేటితో 100 రోజులు పూర్తిచేసుకుంది. శ్రీశైలం నియోజకవర్గంలోని బోయరేపుల క్యాంప్ సైట్ నుంచి 100వ రోజు పాదయాత్రను యువనేత ప్రారంభించారు. ఈ పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. లోకేశ్‌తో కలిసి ఆయన తల్లి నారా భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు ముందుకు నడిచారు. పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా మోతుకూరులో పైలాన్‌ను లోకేశ్ ఆవిష్కరించారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం (Srisailam) నియోజకవర్గం వెలుగోడు అటవీ ప్రాంతంలో పాదయాత్ర చేస్తుండగా, సేవ్ ది టైగర్ క్యాంపెయిన్ ప్రతినిధులు ఇండియా వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇమ్రాన్ సిద్ధిఖీ, సీనియర్ జర్నలిస్ట్ పులిపాక బాలు లోకేశ్ ను కలిశారు. అటవీ ప్రాంతంలో నడుస్తూ పులుల సంరక్షణకు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సేవ్ ది టైగర్ క్యాంపెయిన్ లో భాగస్వామ్యం అవుతామని, అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రాధాన్యత ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.
పలు ప్రాంతాల్లో పాదయాత్రకు పోలీసులు, ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించినప్పటికీ వాటిన్నంటినీ అధిగమిస్తూ లోకేష్ (Lokesh) ముందుకు సాగారు. పలు సామాజిక వర్గీయులు, గ్రామాల ప్రజలు, రైతులు, యువతతో ఇలా అనేకమందితో లోకేష్ సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని.. తాము అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు తీర్చుతామంటూ హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
Also Read: #BoyapatiRAPO: రామ్ మాస్ జాతర.. దుమ్మురేపిన బోయపాటి ఫస్ట్ థండర్!