Site icon HashtagU Telugu

Nara Lokesh : నేడు సీఐడీ విచార‌ణ‌కు హాజ‌రుకానున్న నారా లోకేష్‌.. సిట్ కార్యాల‌యం వ‌ద్ద భారీ బందోబ‌స్తు

Lokesh Cid

Lokesh Cid

అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ నేడు సీఐడీ విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు. ఉద‌యం 10గంట‌ల నుంచి సాయంత్రం 5గంట‌ల వ‌ర‌కు విచార‌ణ కొన‌సాగ‌నుంది. ఈ విచార‌ణ తాడేప‌ల్లిలోని సిట్ కార్యాల‌యంలో జ‌ర‌గ‌నుంది. అమ‌రావ‌తి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్‍ను A14గా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో ఫైల్ చేసింది. ఈ నేప‌థ్యంలో లోకేష్‍కు CRPC సెక్షన్ 41A కింద సీఐడీ నోటీసులు ఇచ్చింది . ఈనెల 4న తొలుత లోకేష్‍ను విచారణకు రావాల్సిందిగా సీఐడీ నోటీసులు ఇవ్వ‌గా.. నోటీసులో హెరిటేజ్ బోర్డ్ తీర్మానాలు, అకౌంట్స్ పుస్తకాలు తీసుకురావాలని సీఐడీ కోరండంతో దానిపై లోకేష్ హైకోర్టుని ఆశ్ర‌యించారు. హెరిటేజ్ తీర్మానాలు, పుస్త‌కాలు తీసుకురావాల‌ని లోకేష్‍ను ఒత్తిడి చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో లోకేష్‌ను విచారించాల‌ని హైకోర్టు సీఐడీకి సూచించింది. లోకేష్ విచారణకు హాజరువుతుండటంతో తాడేపల్లి సిట్ ఆఫీస్ దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. లోకేష్ విచారణకు వస్తుండటంతో టీడీపీ కార్యకర్తలు, నేతలు భారీఎత్తున తరలివస్తారని పోలీసుల అంచనా వేస్తున్నారు. సీఐడీ విచార‌ణ కోసం నిన్న రాత్రి ఢిల్లీ నుంచి విజ‌య‌వాడ‌కు లోకేష్ వ‌చ్చారు.

Also Read:  Ponguleti Srinivas Reddy : పొంగులేటికి కాంగ్రెస్ భారీ షాక్ ..?