Lokesh Padyatra: సంక్రాంతి తరువాత లోకేష్ పాదయాత్ర

సంక్రాంతి తరువాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు.

  • Written By:
  • Publish Date - September 18, 2022 / 09:00 AM IST

సంక్రాంతి తరువాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. విభజిత ఏపీ లో పాదయాత్ర చేస్తున్న తొలి లీడర్ గా ఆయన ప్రజల ముందుకు రాబోతున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూలును టీడీపీ అధిష్టానం సిద్ధం చేసింది. ఒంటరి పోరుకు సిద్ధం అవుతున్న టీడీపీ తాడోపేడో తేల్చుకోవాలని అనుకుంటుంది. ప్రస్తుతం జగన్ సర్కార్ మీద బాగా వ్యతిరేకత ఉందని సర్వేల ద్వారా టీడీపీ అంచనా వేస్తోంది. దాన్ని సానుకూలంగా మలుచుకోవడం టీడీపీ ముందున్న సవాల్. అంతే కాదు చంద్రబాబు తరువాత పార్టీని నడిపించే నాయకునిగా ప్రజల్లో నమ్మకం కలిగించడానికి పాదయాత్ర లోకేష్ కు బాగా ఉపయోగపడుతుందని ఆయన టీం భావిస్తుంది.
వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ అక్టోబరు నుంచే పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించినప్పటికీ వచ్చే ఏడాది జనవరికి దానిని వాయిదా వేసినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే సంక్రాంతి పండుగ తర్వాత యాత్ర ప్రారంభం అవుతుంది.

మొత్తం 450 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. అంటే జనవరిలో ప్రారంభమై 2024 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి యాత్ర ముగిసేలా రూట్‌మ్యాప్‌ తయారువుతుంది.చిత్తూరు జిల్లా నుంచి యాత్రను ప్రారంభించి ఉత్తరాంధ్రలో ముగించాలని లోకేశ్ ప్రాథమికంగా నిర్ణయించారని చెబుతున్నారు. విరామం లేకుండా వారమంతా పర్యటన సాగించాలని లోకేశ్ యోచిస్తున్నట్టు చెబుతున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాదయాత్ర చేపట్టి విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కలుపుకుంటూ పాదయాత్ర చేసిన చివరి నేతగా చంద్రబాబు రికార్డులకెక్కారు. ఉమ్మడి రాష్ట్రంలోనే జగన్ కూడా పాదయాత్ర చేపట్టినప్పటికీ రాష్ట్రం విడిపోవడంతో ఆయన యాత్ర ఏపీకి మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేస్తున్న తొలి నేతగా లోకేశ్ రికార్డులకెక్కనున్నారు.