`వస్తున్నా..మీకోసం` యాత్రను 2012లో డిజైన్ చేసిన లోకేష్ ఇప్పుడు ఆయనే నేరుగా పాదయాత్రకు దిగుతున్నారని తెలుస్తోంది. ఆ మేరకు రోడ్ మ్యాప్ ను మహానాడు వేదికగా ప్రారంభిస్తారని టాక్. తిరుపతి నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్రను డిజైన్ చేసినట్టు సమాచారం. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు చేసిన పాదయాత్రకు భిన్నంగా ఈసారి లోకేష్ పాదయాత్ర ఉండేలా రూట్ మ్యాప్ సిద్ధం అవుతోంది. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి నడిచిన మార్గంలోనే పాదయాత్ర చేస్తూ ఆయనిచ్చిన హామీలను గుర్తు చేసే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ముద్దులు పెడుతూ, తల నిమురుతూ జగన్ చెప్పిన మాటలను గుర్తు చేసేలా మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు. ఎవరికైతే, జగన్ ముద్దులు పెడుతూ, తలనిమిరాడో..అలాంటి వాళ్లను కలుసుకుని మనోభావాలను తెలుసుకోవాలని లోకేష్ భావిస్తున్నారట.
కార్యకర్తల సమన్వయ కమిటీ కన్వీనర్ గా టీడీపీ ప్రత్యక్ష కార్యకలాపాల్లోకి 2014 ఎన్నికలకు ముందుగా లోకేష్ ఎంట్రీ ఇచ్చారు. అనతికాలంలోనే అమెరికా సైన్యం కంటే ఎక్కువగా ఉండేలా సభ్యత్వాలను చేర్చగలిగారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి పార్టీ వచ్చిన తరువాత ప్రధాన కార్యదర్శిగా తొలుత సంస్థాగత పదవిని పొందారు. పార్టీ బలోపేతం కోసం పనిచేస్తోన్న లోకేష్ ను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడానికి మంత్రి పదవిని ఇచ్చారు. ఆ తరువాత ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. ఆనాటి నుంచి పార్టీ పరంగానూ, ప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషిస్తూ వచ్చారు. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా పార్టీ కోసం రెండేళ్లుగా పోరాటం చేస్తున్నారు. పాదయాత్రను విజయవంతం చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. మహానాడు తరువాత ఏ రోజైనా లోకేష్ పాదయాత్రకు బయలుదేరే అవకాశం ఉంది. ఆ యాత్ర సక్సెస్ ఆధారంగా ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అప్పగించాలని టీడీపీ అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది. మహానాడు వేదికగా ఆ పదవిని ప్రకటించిన తరువాత పాదయాత్ర చేయించాలని కూడా పార్టీలోని ఒక వర్గం భావిస్తోందట.
ఒక రోజు మహానాడును ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించాలని భావిస్తోన్న టీడీపీ నూతన ఉత్సాహాన్ని క్యాడర్ లో నింపడానికి లోకేష్ పాదయాత్రను ప్రకటిస్తారని తెలుస్తోంది. చంద్రబాబు టూర్ కు సంబంధించిన షెడ్యూల్ మరో వారంలో క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు బస్సు యాత్ర చేయబోతున్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇప్పటికే పార్టీ నేతలు లోకేష్ పాదయాత్రకు సంబంధించిన షెడ్యూల్ ను కూడా తయారు చేసినట్లు తెలుస్తోంది.మరో వైపు ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం తలనొప్పులు తీసుకొచ్చే అంశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా మద్యపాన నిషేదం, కరెంట్ కోతలు చార్జీల మోత, ఇసుక అందుబాటులో లేకపోవడం, తిరుమల కొండ పై నెలకుంటున్న గందరగోళ వాతావరణం లాంటి అంశాలు ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. తాజా కేబినేట్ విస్తరణ తరువాత కొంత మంది సొంత పార్టీ నేతలే జగన్ పై తిరుగుబాటు చేయడం వంటి అంశాలు కూడా పార్టీని ఆందోళనకు గురిస్తోన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటకీ అప్పుడే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత వచ్చే ఎన్నికల్లో అయిన తమ సత్తా చూపించాలని తెలుగు తమ్ముళ్లు తహాతహాలాడుతున్నారు. ఇప్పటికే సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజా క్షేత్రంలోకి దిగాలని డిసైడ్ అయ్యారు చంద్రబాబు. 2019 నుంచి అప్పుడప్పుడు బాబు ప్రజల్లోకి వచ్చినా లోకేష్ మాత్రం ప్రజల్లో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ నాయకులను అరెస్ట్ లు చేసినప్పుడు, ఇతర కార్యక్రమాల్లో కూడా లోకేష్ గత కొద్ది రోజులుగా చురుగ్గా పాల్గోంటున్నారు. ఇప్పటికే రాజధాని అంశం, రాష్ట్రం ఆర్ధికంగా దెబ్బతినటం, నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి అన్ని వస్తువుల ధరలు పెరుగుదల వీటితోపాటు ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలపట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూల ఓటుగా మార్చుకోవడానికి ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు టీడీపీ బాస్. ఇందులో భాగంగా మే చివరి వారం నుంచి చంద్రబాబు ప్రజల్లోఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. లోకేష్ పాదయాత్ర కూడా ఇంచుమించు చంద్రబాబు బస్సు యాత్రకు సమాంతరంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద అటు లోకేష్ ఇటు చంద్రబాబు నారా బలం ఏమిటో నిరూపించడానికి సన్నద్ధం అయ్యారు.