Site icon HashtagU Telugu

Nara Lokesh : లోకేష్ పాద‌యాత్ర ఫిక్స్! జ‌న‌వ‌రి 25న శ్రీకారం?

Lokesh Padayatra

Lokesh Padayatra

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి లోకేష్ పాద‌యాత్ర డేట్ ఫిక్స్ అయింది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 25వ తేదీ నుంచి యాత్ర‌కు శ్రీకారం చుడ‌తార‌ని తెలుస్తోంది. అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ను పార్టీ అధిష్టానం సిద్ధం చేసిన‌ట్టు స‌మాచారం. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ సుమారు 100 టీమ్ ల‌తో పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతం చేయ‌డానికి. బ్లూ ప్రింట్ సిద్ధం అయింద‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

వాస్త‌వంగా ఈ ఏడాది అక్టోబ‌ర్ 2వ తేదీ నుంచి లోకేష్‌ పాదయాత్ర‌ను ప్రారంభిస్తార‌ని తొలుత ప్ర‌చారం జ‌రిగింది. అధికార వైసీపీ నుంచి ముంద‌స్తు మాట‌లు ప‌రోక్షంగా వినిపించ‌డంతో గాంధీ జ‌యంతి రోజు నుంచి పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్టాల‌ని అనుకున్నారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ కూడా అక్టోబ‌ర్ 5వ తేదీ నుంచి బ‌స్సు యాత్ర ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. కానీ, రాష్ట్రంలోని రాజ‌కీయాలు, ఎన్నిక‌ల షెడ్యూల్ త‌దిత‌రాల‌ను బేరీజు వేసుకుని వాయిదా వేసుకున్నారు. ఇద్ద‌రూ వ‌చ్చే ఏడాదికి యాత్ర‌ను వాయిదా వేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

తిరుప‌తి నుంచి ఇచ్ఛాపురం వ‌ర‌కు లోకేష్ పాద‌యాత్ర చేయ‌డానికి అనువుగా రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు. మేధావి వ‌ర్గం ఈ పాద‌యాత్ర‌ను రూప‌క‌ల్ప‌న చేసిన‌ట్టు తెలుస్తోంది. సాధార‌ణంగా పార్టీలోని కోర్ టీమ్ పాద‌యాత్ర‌ను ప‌ర్య‌వేక్షించ‌డంతో పాటు రూట్ మ్యాప్ ల‌ను త‌యారు చేసేది. గ‌తంలో చంద్ర‌బాబు చేసిన మీకోసం, వ‌స్తున్నా..మీకోసం యాత్ర‌ల‌కు పార్టీ అధిష్టానం అన్నీ చూసింది. త‌ద్భిన్నంగా లోకేష్ పాద‌యాత్ర‌ను యంగ్ టెక్కీలు మానిట‌ర్ చేసేలా ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 25వ తేదీన తిరుప‌తి నుంచి లోకేష్ పాద‌యాత్ర బ‌య‌లు దేరుతుంది. అక్క‌డ నుంచి ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ పాద‌యాత్ర కొన‌సాగేలా మ్యాప్ క్రియేట్ చేశారు. నాన్ స్టాప్ గా పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తారు. 2024 ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చే వ‌ర‌కు యాత్ర కొనసాగుతుంది. ఆ మేర‌కు టీడీపీ లోకేష్ టీమ్ సిద్ధం అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈసారి ఎన్నిక‌ల్లో 80శాతం టిక్కెట్లు కూడా లోకేష్ టీమ్ కు మాత్ర‌మే అవ‌కాశం ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. కాబోయే సీఎం లోకేష్ అంటూ ఇప్ప‌టి నుంచి మాజీ మంత్రులు కొంద‌రు ఫోక‌స్ చేస్తున్నారు. పాద‌యాత్ర స‌క్సెస్ అయితే ఆ స్లోగ‌న్ ను మ‌రింత దూకుడుగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని యోచిస్తున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల్లోని టాక్‌. ఆయ‌న యాత్ర వైపు చూస్తోన్న త‌మ్ముళ్ల‌కు ఎలాంటి ఉత్సాహాన్ని లోకేష్ ఇస్తారో, చూద్దాం.!