Nara Lokesh Delhi Tour: ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. రేపు (శుక్రవారం) ఢిల్లీకి వెళ్లనున్న ఆయన, అదే రోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు.
గతంలో రెండుసార్లు ప్రధాని మోదీ వ్యక్తిగతంగా లోకేష్‌ను ఢిల్లీకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈసారి లోకేష్ స్వయంగా అపాయింట్‌మెంట్ కోరగా, అది ఖరారవడంతో వెంటనే హస్తిన ప్రయాణం మొదలుపెట్టారు. అనంతపురం జిల్లాలో పర్యటన పూర్తి చేసుకున్న వెంటనే, హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్న లోకేష్, రేపు ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమవుతారు.
ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉండగా, కేంద్రంలోనూ టీడీపీ ఎన్డీఏ భాగస్వామిగా కీలకంగా మారింది. ఇటీవలే అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ, ఇప్పుడు నారా లోకేష్‌తో ఎలాంటి విషయాలపై చర్చించనున్నారు అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
అంతేకాదు, త్వరలో కడపలో జరగనున్న టీడీపీ మహానాడులో లోకేష్‌కు మరింత బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న చర్చలు నేపథ్యంలో ఈ భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది.