Site icon HashtagU Telugu

Nara Lokesh : లోకేష్.!ఎన్టీఆర్ ఫార్ములా!! బాబు@2024

Sr Ntr Lokesh

Sr Ntr Lokesh

`నేను మారాను..మీరు మారండి..వైఎస్ లాగా క్యాడ‌ర్ ను ఆదుకుంటా..` ఇవీ, 2009 ఎన్నిక‌ల‌కు ముందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబు టీడీపీ శ్రేణుల‌కు ఇచ్చిన సందేశం. `కొన్ని త‌ప్పులు చేశాను…వాటిని తెలుసుకున్నా..ఈసారి అలా జ‌ర‌గ‌దు..` అంటూ 2014 ఎన్నిక‌ల‌కు ముందు పాద‌యాత్ర సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌స్తావించిన మాట‌లు. `ప్ర‌పంచంలో అమ‌రావ‌తిని నెంబ‌ర్ ఒన్ సిటీని చేస్తా..2050 విజ‌న్ దిశ‌గా వెళుతున్నాం..న‌మ్మండి..` అంటూ 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా చంద్ర‌బాబు చేసిన ప్ర‌చారం. తాజాగా `పార్టీలో తొలి నుంచి ఉన్న వాళ్ల‌కు న్యాయం చేయ‌లేక‌పోయా..ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వాళ్ల‌ను అంద‌లం ఎక్కించా.. ఈసారి అలా జ‌ర‌గ‌దు..ప‌నిచేసే వాళ్ల‌కే ప‌ద‌వులు..` అంటూ చంద్ర‌బాబు చెబుతున్నాడు.ముంద‌స్తు ఎన్నిక‌ల దిశ‌గా క్యాడ‌ర్ ను స‌న్న‌ద్ధం చేయడానికి చంద్ర‌బాబు పూనుకున్నాడు. ఏపీలోని175 స్థానాల‌కు సంబంధించిన రివ్యూ చేయ‌డానికి సిన్న‌ద్ధం అయ్యాడు. తొలి విడత 100 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డానికి క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. సంక్రాంతి త‌రువాత పార్ల‌మెంట్‌, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జిల‌ను ప్ర‌క‌టించాల‌ని బ్లూ ప్రింట్ సిద్ధం అయింది. ఆ త‌రువాత ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ‌గా ఉన్న లోకేష్‌, జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల‌కు ప్లాన్ చేస్తున్నార‌ట‌. సైకిల్ యాత్ర ద్వారా లోకేష్‌,బ‌స్సు యాత్ర ద్వారా బాబు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తార‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

ఆ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు, క్యాడ‌ర్‌కు ఏమి చెప్పాలో..ముందుగానే చంద్ర‌బాబు స్క్రిప్ట్ రెడీ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే టీడీపీ రాజ‌కీయ వ్యూహ క‌మిటీ స‌మావేశంలో బాబు స‌రికొత్త వ్యాఖ్య‌లు చేశాడని వినికిడి. అధికారంలో ఉన్న‌ప్పుడు(2014) పార్టీకి సేవ చేసిన వాళ్ల‌ను గుర్తించ‌లేక‌పోయాన‌ని ప‌శ్చాత్తాప ప‌డ్డాడ‌ట‌. ఈసారి అలా జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డాల‌ని సూచించాడ‌ని తెలుస్తోంది. పార్టీ కోసం జైలు, లాఠీ దెబ్బ‌లు తింటూ సేవ చేస్తోన్న వాళ్ల‌కే ఈసారి ప‌ద‌వుల‌ని తెగేసి చెప్పాడ‌ట‌. త్యాగం చేసిన వాళ్ల‌కే పెద్దపీట వేయాల‌ని భావిస్తున్నార‌ట‌. పార్టీ ఎవ‌రి కోస‌మూ త్యాగం చేయ‌ద‌ని బాబు దిశానిర్దేశం చేశాడ‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.చంద్ర‌బాబు 40 ఏళ్ల కు పై బ‌డిన రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఒకే మూస ప‌ద్ధ‌తిలో వెళుతున్నాడు. యాద‌వ సామాజిక‌వ‌ర్గం అంటే య‌న‌మ‌ల రామ‌క్రిష్ణుడు ఫేస్ చూపించ‌డం, మాదిగ సామాజిక వ‌ర్గానికి వ‌ర్ల రామ‌య్య మొఖాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం, మాల సామాజిక వ‌ర్గం అంటే మొన్న‌టి వ‌ర‌కు జూపూడి ప్ర‌భాక‌ర్ ఫేస్ చూప‌డం..కాపు సామాజిక వ‌ర్గం అంటే గంటా శ్రీనివాస‌రావు ఫేస్, రెడ్డి సామాజిక వ‌ర్గానికి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డిని చూప‌డం..స‌హ‌జంగా జ‌రుగుతోంది. ఇదంతా చాలా కాలంగా చంద్ర‌బాబు కోటలో జ‌రుగుతోన్న మూస ప‌ద్ధ‌తి. ఆ కార‌ణంగా 2009, 2019 ఎన్నిక‌ల్లో ఓడిపోయామ‌నే భావ‌నకు వ‌చ్చార‌ట‌. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన మొఖాలు, వ్యాపార, వాణిజ్య‌, పారిశ్రామిక వేత్త‌ల మొఖాలు చూపిస్తే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని గ్ర‌హించార‌ట‌. అందుకే ఇక మూస ప‌ద్ద‌తికి చెక్ పెట్ట‌డంతో పాటు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఫార్ములాను అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించార‌ని తెలుస్తోంది.

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ త‌ర‌హాలో తెలుగుదేశం పార్టీకి లోకేష్ భావ‌జాలం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. సామ‌ర్థ్యం, పోరాడే త‌త్వ్వం, తెగువ ఉన్న లీడ‌ర్ల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని లోకేష్ భావిస్తున్నాడ‌ని తెలుస్తోంది. సామాజిక వ‌ర్గాల ప‌రంగా కొంద‌రికే ప‌దేప‌దే ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెట్టి తెల్ల ఏనుగుల్లా పోషించ‌డం ఇక కుద‌ర‌ద‌ని తేల్చార‌ని తెలుస్తోంది. పార్టీ కోసం ప్రాణాల‌ను సైతం ప‌ణంగా పెట్టే వాళ్ల‌కు పెద్ద‌పీట వేయ‌బోతున్నార‌ని లోకేష్ అభిమానులు భావిస్తున్నారు. పైగా చంద్ర‌బాబు 2009, 2014 ఎన్నిక‌ల్లో క్యాడ‌ర్ కు ఇచ్చిన హామీని నిల‌బెట్ట‌కోలేద‌న్న అపవాదు ఉంది. అందుకే, ఇప్పుడు లోకేష్ భావ‌జాలం తెలుగుదేశం పార్టీలో తొణికిస‌లాడుతోంది. దాన్నే చంద్ర‌బాబు కూడా 2024 దిశ‌గా వినిపిస్తున్నాడని పార్టీ వ‌ర్గాల్లో వినికిడి. ఈసారి చంద్ర‌బాబు ఇస్తోన్న హామీ లోకేష్ కార్యారూపంలోకి తీసుకొస్తాడ‌ని క్యాడ‌ర్ విశ్వ‌సిస్తోంది. సో..స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఫార్ములా లోకేష్ రూపంలో బాబు తీసుకొస్తార‌న్న‌మాట‌.