Nara Lokesh: ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం విశాఖ కోర్టుకు హాజరుకానున్నారు. ఆయన ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకొని, పార్టీ కార్యాలయంలో బస చేస్తున్నారు. “చినబాబు చిరుతిండి ఖర్చు.. 25 లక్షలండి” పేరుతో సాక్షి పత్రికలో ప్రచురించిన అసత్య కథనంపై లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.
విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జరగనుంది. 2019లో సాక్షి పత్రికలో “చినబాబు చిరుతిండి ఖర్చు.. రూ. 25 లక్షలండి” అనే టైటిల్‌తో ప్రచురించిన కథనం అసత్యాలు మరియు కల్పితాలతో నిండి ఉందని, ఈ కథనం తనకు అవాస్తవాలతో ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో రూపొందించబడిందని లోకేష్ అప్పట్లో తెలిపారు.
నారా లోకేష్ పరువునష్టం దావా:
సాక్షి పత్రిక వివరణ ఇవ్వకుండా, నోటీసులకు స్పందించకపోవడంతో నారా లోకేష్ పరువునష్టం దావా దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌లో, తన పరువుకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం వేశారని తెలిపారు. ప్రచురించిన తేదీల్లో తాను విశాఖలో లేనని, ప్రభుత్వం ఆహ్వానం మేరకు వచ్చే అతిథులకు చేసిన అతిథి మర్యాదలకు సంబంధించిన ఖర్చును తనకు అంటగడుతూ తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించారన్నది ఆయన కోర్టుకు అందించిన ఆరోపణ. మంత్రిగా తాను అనేక సార్లు విశాఖపట్నం వెళ్లినప్పటికీ, ఎయిర్ పోర్ట్‌లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు అందుకోలేదని లోకేష్ స్పష్టం చేశారు.
వాస్తవానికి, వీవీఐపీలు, వీఐపీలు ప్రయాణ సమయంలో విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఫ్లయిట్ టేకాఫ్‌కు సమయం ఉన్నప్పుడు వీఐపీ లాంజ్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఇది సర్వసాధారణమైన అంశం. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, నారా లోకేష్ విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చినప్పుడు టీ, కాఫీ, స్నాక్స్ కోసం 20 లక్షల రూపాయలు ఖర్చు చేశారనే నిరాధార కథనాన్ని సాక్షి పత్రిక ప్రచురించింది.
ఈ కథనంపై నారా లోకేష్ అప్పట్లోనే తీవ్రంగా మండిపడ్డారు. సాక్షి నీతి లేని కథనాలను ప్రచురిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు, కానీ సాక్షి స్పందించలేదు. అందుకే, సాక్షిపై 75 కోట్ల రూపాయల పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసు విచారణ జరగుతున్న నేపథ్యంలో, ఈరోజు లోకేష్ కోర్టుకు హాజరుకానున్నారు.