Nara Lokesh: విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సెంటర్ శంకుస్థాపన 100 రోజుల్లో జరిగే ప్రకటన చేశారు మంత్రి నారా లోకేశ్. విశాఖలో ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు ఉన్నప్పటికీ, టీసీఎస్ ఎంట్రీ ఐటీ రంగానికి గేమ్ చేంజర్‌గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు.
శుక్రవారం మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు, ఆయన కోర్టు విచారణకు హాజరయ్యేందుకు వచ్చారు. 2014-19 మధ్య తమ ప్రభుత్వ హయాంలో వచ్చిన పలు పరిశ్రమలు, వైసీపీ ప్రభుత్వం రావడంతో వెళ్లిపోయాయని ఆయన అన్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక పరిశ్రమలు మరియు ఐటీ కంపెనీలతో మాట్లాడి తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో విధానంలో అనుమతులు అందించేందుకు యువ ఐఏఎస్ అధికారితో ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేశామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నామని తెలిపారు. వచ్చే నెలలో అమెరికా పర్యటన సందర్భంగా కొన్ని కంపెనీల సీఈవోలతో భేటీ అవుతానని వివరించారు.
సూపర్ సిక్స్ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని లోకేశ్ స్పష్టం:
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలుకు కట్టుబడినట్టు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. వచ్చే నవంబర్ లేదా డిసెంబర్‌లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నామని ఆయన చెప్పారు. ప్రజలకు సంబంధించి జనన, మరణ, కులం, వివాహ ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా త్వరలో వాట్సాప్ ద్వారా సేవలు అందించనున్నట్టు ప్రకటించారు.
అలాగే, విశ్వవిద్యాలయాలకు పూర్తిస్థాయి ఉపకులపతుల నియామకానికి సంబంధించి, గత ప్రభుత్వ హయాంలో వర్సిటీల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టి, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
తనపై తప్పుడు కథనాలు పై నారా లోకేష్:
గతంలో మంత్రిగా ఉన్న సమయంలో సాక్షి పత్రిక తనపై తప్పుడు కథనం రాసినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కోర్టులో పరువునష్టం దావా వేశానని, ఈ కేసుకు సంబంధించి రెండోసారి క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యానని చెప్పారు. గతంలో కానీ, ఇప్పటికీ కానీ ప్రభుత్వ వాహనాలు వినియోగించలేదన్నారు. సాక్షి ఇప్పటికీ తప్పుడు కథనాలు రాస్తోందని, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
రెడ్ బుక్ చూసి వైసీపీ అధినేత జగన్ ఎందుకు భయపడుతున్నారో ప్రశ్నించారు. ఎన్టీయే ప్రభుత్వం ఉన్నంత వరకు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే ప్రశ్న లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో రుషికొండపై రూ. 500 కోట్లతో ప్యాలెస్ నిర్మించారని, అక్కడ పర్యావరణ చట్టాలు ఉల్లంఘించడంతో ఎన్జీటీ రూ. 200 కోట్లు జరిమానా విధించిందన్నారు.
రుషికొండ ప్యాలెస్‌ను ఎలా వినియోగించుకోవాలో ప్రజలు సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రైవేటు షాపుల్లో మద్యం ఎంఆర్‌పీకే అమ్మాలని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయం లేదనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై, తెలుగుదేశం పార్టీ పెద్ద కుటుంబమని, చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయని, కూర్చుని చర్చించి పరిష్కరిస్తామన్నారు.