Praja Darbar : మంగళగిరి లో ‘ప్రజాదర్బార్ ‘ మొదలుపెట్టిన నారా లోకేష్

మంగళగిరి ప్రజల కోసం లోకేష్ ‘ప్రజాదర్బార్’ నిర్వహించనున్నారు

  • Written By:
  • Publish Date - June 15, 2024 / 01:43 PM IST

మంగళగిరి ఎమ్మెల్యే , మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరి ప్రజల కోసం లోకేష్ ‘ప్రజాదర్బార్’ (Praja Darbar) నిర్వహించనున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్దీ గంటల్లోనే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత అయిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసును నారా లోకేష్ గెలిచారు. ఇక ఇప్పుడు గెలిచినా తర్వాత కూడా నియోజకవర్గ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ అనే కార్య క్రమాన్ని చేపట్టారు.

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రీసెంట్ గా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. 164 అసెంబ్లీ , 21 పార్లమెంట్ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బుధువారం ప్రధాని మోడీ సమక్షంలో సీఎం గా చంద్రబాబు (Chandrababu) తో సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. గురువారం రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న సీఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల అమలుపై సంతకాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చినట్లుగానే సీఎం హోదాలో మెుదట మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం, పింఛను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం, స్కిల్ సెన్సెస్‌, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై సంతకాలు చేశారు.

ఇక బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తన మార్క్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) ని ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం శాఖల వారీగా శ్వేతపత్రాలంటూ హడావుడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇదే చేస్తున్నాడు. ‘శాఖల్లో దస్త్రాలు ఎలా నిర్వహించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు?’ అనే అంశాలపై మంత్రులకు శిక్షణ ఇప్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అమాత్యులతో అన్నారు. శాఖలవారీ శ్వేతపత్రాలు రూపొందించి ప్రజల ముందుంచుదామని, జగన్‌ హయాంలో రివర్స్‌ విధానాలు, అరాచకాల్ని వారికి వివరిద్దామని తెలిపారు.

ఇక లోకేష్ సైతం ఇప్పుడు ప్రజల సమస్యలు నేరుగా ప్రభుత్వానికి చెప్పుకునే విధంగా ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు. ఇది కూడా తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందే. పదేళ్లుగా కేసీఆర్ కు సొంతమైన ప్రగతిభవన్ ను కాస్త ప్రజా దర్బార్ (Praja Darbar) గా మార్చేయడమే కాదు..ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు సీఎం రేవంత్. గత కొన్నేళ్లుగా ఉన్న ముళ్లకంచెను తొలగించి..ప్రజల దర్బార్ ను చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలు వచ్చి చెప్పుకునే విధంగా ప్రజావాణి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది.

ఇప్పుడు ఇదే పద్దతిలో లోకేష్ మంగళగిరి లో మొదలుపెట్టారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజలకోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన లోకేశ్‌… నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు. ఉదయం 8గంటల నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో యువనేత లోకేశ్‌ స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలు తమ దృష్టికి తెచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేశారు. స్థానికేతర కార్యక్రమాలకు వెళ్లినపుడు మినహా ఉండవల్లిలో ఉన్నపుడు ప్రతిరోజూ ఉదయం స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. ప్రజానేతగా లోకేశ్‌ వేసిన ఈ తొలిఅడుగు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు మార్గదర్శకం కానుంది. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మంగళగిరి ప్రజలు పలు సమస్యలు నారా లోకేశ్‌ దృష్టికి తీసుకొచ్చారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని లోకేశ్‌ వారికి హామీ ఇచ్చారు.