Chandrababu Health : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో భాగంగా రాజమండ్రి జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుమారుడు నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం వాస్తవాలు దాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబుకు జైలులో ఏదైనా హాని జరిగితే జగన్‌దే బాధ్యత. చంద్రబాబు ప్రాణాలకు హాని తలపెట్టే దురుద్దేశంతో కుట్రలు పన్నారు. తగినంత భద్రత లేక చంద్రబాబు ఎంతో ప్రమాదంలో ఉన్నారు. జైలులో చంద్రబాబు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దోమలు, కలుషిత నీటితో ఇబ్బందిపడుతున్నారు. ఇన్ఫెక్షన్, అలర్జీతో బాధపడుతున్నారు’’ అని పేర్కొంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
5 కిలోలు బరువు తగ్గడంతో కిడ్నీలపై ప్రతికూల ప్రభావం : నారా బ్రాహ్మణి
చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కోడలు నారా బ్రాహ్మణి ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబును అపరిశుభ్ర పరిస్థితుల నడుమ జైలులో నిర్బంధించడం హృదయవిదారకం. ఆ అపరిశుభ్రత ప్రభావం చంద్రబాబు ఆరోగ్యంపై పడుతోంది. చంద్రబాబు ఆరోగ్యంపై వైద్య నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు సకాలంలో వైద్యం సైతం అందడం లేదు. తక్షణ వైద్య సహాయం అందించడం అవసరం. చంద్రబాబు 5 కిలోలు బరువు తగ్గడం వల్ల ఆయన కిడ్నీలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది’’ అని పేర్కొంటూ బ్రాహ్మణి ట్వీట్ చేశారు.
చంద్రబాబుకు అత్యవసర వైద్యం అవసరం : నారా భువనేశ్వరి
జైలులో తన భర్తకు సకాలంలో వైద్యం అందడం లేదంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు. చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ‘‘ఇప్పటికే చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారు. ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. జైలులో ఓవర్‌హెడ్ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయి. వాటివల్ల చంద్రబాబు ఆరోగ్యం దెబ్బతింటోంది. జైలులో ఉన్న పరిస్థితులు నా భర్త ఆరోగ్యానికి తీవ్ర ముప్పు తలపెట్టేలా ఉన్నాయి. చంద్రబాబుకు అత్యవసరం వైద్యం అవసరం’’ అని భువనేశ్వరి ట్వీట్ లో (Chandrababu Health) పేర్కొన్నారు.