అవినీతిపై చర్చకు తాము సిద్ధం, మీరు సిద్ధమా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.. సీఎం జగన్‌కు సవాల్ విసిరారు. ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతుండడం తో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ (CM jagan)..సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావం పూరించగా..ఇక ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) శంఖారావం యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లడం మొదలుపెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ..అధికార పార్టీ వైసీపీ కి సవాల్ విసిరారు.మా నమ్మకం నువ్వే జగన్ అంటూ బోర్డులు పెడుతున్నారని కానీ సొంత తల్లి, చెల్లే నమ్మట్లేదని ఎద్దేవా చేశారు. ఏటా డీఎస్సీ అని చెప్పిన జగన్, నాలుగున్నరేళ్లు కాలయాపన చేసి ఇప్పుడు ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ ఇస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లు మూసేశారని, విదేశీ విద్య కూడా ఆపేశారని, ఏటా కానిస్టేబుళ్ల ఖాళీల భర్తీ అన్నారు కానీ అవన్నీ గాలికి వదిలేశారని.. టీడీపీ-జనసేన ప్రభుత్వం రాగానే ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు అధైర్యపడవద్దు.. రెండు నెలలు ఓపిక పట్టండి..మన ప్రభుత్వం వస్తుంది..మీ కోర్కెలన్నీ తీరుస్తుందని లోకేష్ హామీ ఇచ్చారు.
కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి యాత్ర-2 సినిమా వేస్తే..చివరకు వైసీపీకి అంతిమయాత్రగా మారిపోయిందని , డబ్బులిచ్చి సినిమాకు పొమ్మన్నా ఎవరూ వెళ్లట్లేదని లోకేష్ సెటైర్ వేశారు. అర్జునుడు, అభిమన్యుడు అని జగన్ చెబుతుంటారని, నిజానికి జగన్ ఒక సైకో, భష్మాసురుడు అని ధ్వజమెత్తారు. జగన్ చెప్పేవన్నీ అసత్యాలే అని, రోజుకు ఒక మోసం, అబద్ధం చెప్పడమే పని అయిపోయిందని, ఎన్నికల ముందు జగన్ తియ్యగా మాటలు చెప్పారని, ఎన్నికలు పూర్తయి అధికారంలోకి వచ్చాక అన్నీ మరచిపోయారని మండిపడ్డారు. జగన్ ప్రసంగాలలో మీ బిడ్డ, మీ బిడ్డ అంటున్నారని జాలిపడవద్దన్న లోకేశ్, పొరపాటున ఎన్నికల్లో గెలిస్తే మీ బిడ్డనే కదా మీ భూమి తీసుకుంటానంటారని విమర్శించారు. జగన్ అంటే జైలు, బాబు అంటే ఒక బ్రాండ్ అని లోకేశ్ తెలిపారు. జగన్‌ను చూస్తే కోడికత్తి గుర్తొస్తుందని, చంద్రబాబును చూస్తే కియా కారు గుర్తొస్తుందని చెప్పుకొచ్చారు. అవినీతిపై చర్చకు సిద్ధమని సీఎం జగన్‌కు నారా లోకేష్ సవాల్ చేశారు. ఎవరు ఎంత అవినీతి చేశారో చర్చలో తేలిపోతుందని అన్నారు. జగన్‌కు 2 బటన్లు ఉంటాయని, బల్లపై బ్లూ బటన్, బల్ల కింద ఎర్ర బటన్ అని విమర్శించారు. బ్లూ బటన్ నొక్కితే ఖాతాలో రూ.10 పడతాయని, ఎర్ర బటన్ నొక్కగానే రూ.100 పోతాయని అన్నారు. జగన్ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని తెలిపారు. భవిష్యత్తులో గాలికి కూడా జగన్ పన్ను వేసి వసూలు చేస్తారని, సంక్షేమ పథకాలన్నీ జగన్ కట్ చేసుకుంటూ వెళ్తున్నారని మండిపడ్డారు.
Read Also : Condom Day 2024 : రేపు వాలెంటైన్స్ డే.. ఇవాళే కండోమ్స్ డే.. ఎందుకలా ?