TDP Mahanadu : ‘లోకేష్’ మార్క్ మ‌హానాడు బ్లూప్రింట్‌

తెలుగుదేశం పార్టీ నిర్వ‌హించే ప్ర‌తి మ‌హానాడులోనూ ఏదో ఒక కొత్తద‌నం ఉంటుంది.

  • Written By:
  • Publish Date - May 14, 2022 / 11:18 AM IST

తెలుగుదేశం పార్టీ నిర్వ‌హించే ప్ర‌తి మ‌హానాడులోనూ ఏదో ఒక కొత్తద‌నం ఉంటుంది. ఈసారి ప్ర‌కాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా జ‌రిగే మ‌హానాడు వేదిక‌పై నుంచి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌రించేందుకు టీడీపీ సిద్ధం అవుతోంది. నూత‌న నాయ‌క‌త్వాన్ని అందించేలా ప్ర‌ణాళిక‌ను ర‌చించిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న లోకేష్ బాబును వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్ర‌క‌టించ‌డానికి రంగం సిద్ధం అయింద‌ని వినికిడి. అంతేకాదు, ఆయ‌న పాద‌యాత్ర షెడ్యూల్ ను కూడా మ‌హానాడు వేదిక‌పై నుంచి వెల్ల‌డిస్తార‌ని తెలుస్తోంది.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఆనాడు ఎన్టీఆర్ త‌యారు చేసిన లీడ‌ర్లు, వాళ్ల కుటుంబీకులు మాత్ర‌మే నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జిల్లాల వారీగా వార‌స‌త్వం వేళ్లూనుకుంది. అందుకే, ఈసారి లోకేష్ బాబు ఆధ్వ‌ర్యంలో 2050 దిశ‌గా స‌రికొత్త నాయ‌క‌త్వాన్ని త‌యారు చేయాల‌ని టీడీపీ మాస్ట‌ర్ ప్లాన్ త‌యారు అవుతోంది. ఇప్ప‌టికే 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా 1983 నాటి లీడ‌ర్ల వార‌సులు 30శాతానికి పైగా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. మిగిలిన లీడ‌ర్ల వార‌సులు 2024 ఎన్నిక‌ల‌ రంగంలోకి దిగ‌డానికి ఉవ్విళ్లూరు తున్నారు. కానీ, లోకేష్ బాబు మాత్రం వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు అతీతంగా స‌మ‌ర్థ నాయక‌త్వాన్ని తీసుకురావాల‌ని భావిస్తున్నార‌ట‌. అందుకు సంబంధించిన స‌ర్వేలు కూడా ఆయ‌న వ‌ద్ద ఉన్నాయ‌ని తెలుస్తోంది.

మ‌హానాడు వేదిక‌గా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాను సాధించిన త‌రువాత భారీ మార్పులు చేయ‌డానికి లోకేష్ బాబు సాహ‌సం చేస్తార‌ని టీడీపీ యూత్ న‌మ్ముతోంది. పాద‌యాత్ర సంద‌ర్భంగా ఎవ‌రెవ‌రి స‌త్తా ఏమిటో ఆయ‌న తెలుసుకోబోతున్నారట‌. పాద‌యాత్ర ముగిసేనాటికి పార్టీ మీద పూర్థి స్థాయి ప‌ట్టు లోకేష్ సాధిస్తార‌ని విశ్వ‌సిస్తున్నారు. ఇప్ప‌టికే సీఎం జ‌గ‌న్ మీద ప‌దునైనా ప‌ద‌జాలంతో విమ‌ర్శ‌నాస్త్రాల‌ను సంధిస్తోన్న ఆయ‌న రాబోవు రోజుల్లో ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొంద‌డానికి పాద‌యాత్ర ను ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మ‌న్వ‌య క‌మిటీ క‌న్వీన‌ర్ గా అనూహ్య విజ‌యాల‌ను సాధించారు. క్యాడ‌ర్ మ‌న‌సును దోచుకోగ‌లిగారు. ఆ త‌రువాత మంత్రిగా ప‌రిపాల‌న మీద ప‌ట్టు ఉంద‌ని ఐటీ, పంచాయ‌తీరాజ్ మంత్రిగా నిరూపించుకున్నారు. యాక్టింగ్ ప్ర‌తిప‌క్ష నేత‌గా వీరోచిత పోరాటం చేయ‌డంలోనూ క్యాడ‌ర్ వ‌ద్ద విశ్వాసాన్ని పొందారు. అందుకే, ఆయ‌న‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ప‌దోన్న‌తి క‌ల్పించాల‌ని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది.

సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై లోకేష్ సాహ‌సోపేతంగా ముందుకు దూకుతున్నారు. ఆ క్ర‌మంలో జ‌గ‌న్ స‌ర్కార్ కొన్ని చోట్ల వెన‌క‌డుగు వేయాల్సి వ‌చ్చింది. ఉదాహ‌ర‌ణ‌కు గ‌త ఏడాది ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయించ‌డంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పైచేయిని సాధించారు. ఆత్మ‌హ‌త్య‌లు, అత్యాచారాల‌ను నిర‌సిస్తూ ఆయ‌న వెళుతోన్న మార్గాల‌ను మూసివేయ‌డం, అడ్డుకోవ‌డం ద్వారా లోకేష్ బ‌లాన్ని ప‌రోక్షంగా జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్లింది. తొలి రోజుల్లో ప‌ప్పు అంటూ ఒక ముద్ర వేసే ప్ర‌య‌త్నం చేసిన వైసీపీ ప్ర‌స్తుతం లోకేష్ క‌ద‌లిక‌ల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ద పెట్టింది. అంటే, యాక్టింగ్ ప్ర‌తిప‌క్ష నేత‌గా లోకేష్ బాబు స‌క్సెస్ అయిన‌ట్టే టీడీపీ క్యాడ‌ర్ భావిస్తోంది. ఇప్ప‌టికే కార్య‌క‌ర్త‌ల‌కు ఆరోగ్య బీమాను అంద‌చేయ‌డంలోనూ, వాళ్ల కుటుంబాల‌ను ఆదుకోవ‌డంలోనూ రాజీలేని పోరాటాన్ని కొన‌సాగిస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో పాద‌యాత్ర ఆయ‌న్ను తిరుగులేని లీడ‌ర్ గా త‌యారు చేస్తుంద‌ని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది.

ప్ర‌స్తుతం చంద్ర‌బాబు వ‌య‌స్సు 73 ఉన్న‌ప్ప‌టికీ చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఏపీలో తిరిగి అధికారంలోకి వ‌స్తామ‌న్న ధీమాతో ఆయ‌న దూకుడుగా వెళుతున్నారు. ప్ర‌జాఉద్య‌మాన్ని తీసుకురావ‌డం ద్వారా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని గ‌ద్దె దించాల‌ని ప‌క్కా స్కెచ్ త‌యారు చేశారు. మ‌హానాడు వేదిక‌పై ఆ దిశ‌గా చంద్ర‌బాబు దిశానిర్దేశం చేయ‌నున్నారు. అంతేకాదు, ఆయ‌న ప్ర‌త్యేకంగా జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు చేయ‌డానికి సిద్ధం అవుతున్నారు. తొలుత లోకేష్ పాద‌యాత్ర షెడ్యూల్ ను ప్ర‌క‌టించి ఆ త‌రువాత అదే రూట్ లో చంద్ర‌బాబు బ‌స్సు యాత్ర ద్వారా జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాల‌ని ప్లాన్ చేశారట‌. ఇదే అంశాన్ని మ‌హానాడు వేదిక నుంచి వెల్ల‌డించడానికి టీడీపీ రంగం సిద్ధం చేస్తోంది. ప్ర‌కాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా ఈనెల 27న పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం జ‌ర‌గ‌నుంది. మ‌రుస‌టి రోజు 28న మ‌హానాడును నిర్వ‌హించ‌నున్నారు. ఆ రోజు నుంచి 2023 మ‌హానాడు వ‌ర‌కు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌ను అవ‌స‌ర‌మైన రోడ్ మ్యాప్ ను క్యాడ‌ర్ కు అందించ‌నున్నారు.

యుగ‌పురుషుడు ఎన్టీఆర్ జ‌న్మ‌దినం రోజును పండుగ మాదిరిగా మ‌హానాడును తెలుగుదేశం పార్టీ నిర్వ‌హిస్తోంది. ఆయ‌న బ‌తికున్న రోజుల్లో అచ్చ తెలుగు సంస్కృతి, సంప్ర‌దాయాలు ఉట్టిప‌డేలా వేడుక జ‌రిగేది. ఎన్టీఆర్ విడిది కోసం ప‌ర్ణ‌శాల ఏర్పాటు చేసే వాళ్లు. పూర్వ‌కాల‌పు బుషుల ఆశ్ర‌మాల‌ను త‌లపించేలా మ‌హానాడు ఏర్పాట్లు ఉండేవి. ఆయ‌న మ‌ర‌ణం త‌రువాత మ‌హానాడు స్వ‌రూపం మారుతూ వ‌స్తోంది. మూడు రోజుల పాటు జ‌రిపే మ‌హానాడు వివిధ ప్ర‌ముఖ దేవాల‌యాల్లో జ‌రిగే తిరునాళ్ల మాదిరిగా ఉండేది. కానీ, ఈసారి ఒక రోజుకు మాత్ర‌మే ప‌రిత‌మైన మ‌హానాడు వేదిక‌పై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డానికి చంద్ర‌బాబు అండ్ టీమ్ సిద్ధం అవుతుంద‌ని తెలుస్తోంది.