Lokesh Vs Jagan : లోకేష్ ఐడియా!జ‌గ‌న్ షూరూ!!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ న‌గ‌దు బ‌దిలీ గురించి 15 ఏళ్ల క్రితమే ఆలోచించాడు.

  • Written By:
  • Publish Date - December 9, 2021 / 01:10 PM IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ న‌గ‌దు బ‌దిలీ గురించి 15 ఏళ్ల క్రితమే ఆలోచించాడు. ఆ విధానం ఉమ్మ‌డి ఏపీలో ప్ర‌వేశ పెట్టాల‌ని 2009లోనే ఆయ‌న బ్లూ ప్రింట్ సిద్ధం చేశాడు. దాన్ని ప‌రిశీలించిన చంద్ర‌బాబు 2009 ఎన్నిక‌ల్లో న‌గ‌దు బ‌దిలీని చ‌ర్చ‌కు తీసుకొచ్చాడు. స‌బ్సీడీల రూపంలో కాకుండా వివిధ ప‌థ‌కాల‌ను న‌గ‌దు బ‌దిలీ రూపంలో అమ‌లు చేయాల‌ని అప్ప‌ట్లో లోకేష్ ఒక నివేదిక‌ను రూపొందించాడు. హార్వార్డ్ యూనివ‌ర్సిటీ గ్రాడ్యుయేట్ గా ఆయ‌న ఇచ్చిన నివేదికపై రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రిగింది.స‌బ్సీడీల‌ను తొల‌గించ‌డానికి ఇలాంటి పద్ధ‌తిని చంద్ర‌బాబునాయుడు ఆలోచిస్తున్నాడ‌ని ప్ర‌త్య‌ర్థులు 2009లో విమ‌ర్శ‌లు గుప్పించారు. సంస్క‌ర‌ణ‌ల‌ను వేగంగా తీసుకెళ్ల‌డానికి ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌ని బాబు న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని ఎన్నిక‌ల ప్రచారం చేశాడు. ప్ర‌జ‌ల‌కున్న అపోహ‌ల కార‌ణంగా ఆ స్లోగ‌న్ పెద్ద‌గా సామాన్యుల్లోకి వెళ్ల‌లేదు. పైగా రైతుల‌కు స‌బ్సీడీలు వ‌ద్ద‌న్నాడ‌ని `మ‌న‌సులో మాట‌` పుస్త‌కాన్ని ప్ర‌త్య‌ర్థులు ప్ర‌చార తెర‌మీద‌కు తీసుకొచ్చాడు. సంస్క‌ర‌ణ‌ల వాదిగా పేరున్న చంద్ర‌బాబుకు నగ‌దు బ‌దిలీ నివేదిక ఇచ్చిన లోకేష్ పై ఆనాడే న‌మ్మ‌కం క‌లిగింది.

న‌గ‌దు బ‌దిలీ నివేదిక‌ను మ‌రింత స‌ర‌ళం చేయ‌డానికి లోకేష్ కు ఒక టీంను కూడా ఆ రోజుల్లో చంద్ర‌బాబు ఇచ్చాడు. అంతేకాదు, అదే టీం ఎన్నిక‌ల ప్ర‌చార స‌ర‌ళి, అభ్య‌ర్థిత్వాల ఖ‌రారు కోసం అవ‌స‌ర‌మైన స‌ర్వేల‌ను కూడా చేప‌ట్టింది. లోకేష్ ఆధ్వ‌ర్యంలోని టీం ఇచ్చిన వివ‌రాల ఆధారంగా చాలా వ‌ర‌కు టిక్కెట్ల‌ను ఖ‌రారు చేయ‌డం జ‌రిగింది. కానీ, 2009 మ‌హాకూట‌మిలోని పార్టీల‌కు గెలిచే సీట్ల‌ను టీడీపీ త్యాగం చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. పైగా టీఆర్ఎస్ పార్టీతో పొత్తు చివ‌రి వ‌ర‌కు ఖ‌రారు కాక‌పోవ‌డం, రెండు పార్టీల మ‌ధ్య పాద‌ర్శ‌క‌త లోపిండం, చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్ట‌డం త‌దిత‌ర కార‌ణాల‌తో అధికారంలోకి తెలుగుదేశం రాలేక‌పోయింది.
ఒక వేళ 2009లోనే పార్టీ అధికారంలోకి వ‌చ్చి ఉంటే, లోకేష్ మ‌ది నుంచి రూప‌క‌ల్ప‌న జ‌రిగిన న‌గ‌దు బ‌దిలీ ఆనాడే అమ‌లు అయ్యేది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌గా చంద్ర‌బాబు బిజీగా ఉన్న ఆ రోజుల్లో. పార్టీని బ‌లోపేతం చేసే బాధ్య‌త‌ల‌ను లోకేష్ తీసుకున్నాడు. కార్య‌క‌ర్త‌ల స‌మ‌న్వ‌య క‌మిటీ క‌న్వీన‌ర్ గా తెలుగుదేశం పార్టీ ప్రత్య‌క్ష రాజ‌కీయ కార్య‌క‌లాపాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అన‌తి కాలంలోనే అమెరికా సైన్యం కంటే ఎక్కువ మందిని స‌భ్యులుగా చేశాడు. బీమా సౌక‌ర్యాన్ని ప్ర‌తి స‌భ్యునికి క‌ల్పించాడు. మిగిలిన పార్టీలు కూడా లోకేష్ విధానాన్ని అనుస‌రించారు. ఇప్పుడు అన్ని పార్టీలు స‌భ్య‌త్వం తీసుకున్న ప్ర‌తివారికి బీమా సౌక‌ర్యం క‌ల్పిస్తున్నారు.`వ‌స్తున్నా..మీకోసం` యాత్ర‌కు రూప‌శిల్పిగా నారా లోకేష్ కు పేరుంది. ఆనాడు చంద్ర‌బాబు చేసిన పాద‌యాత్ర మొత్తం లోకేష్ కనుస‌న్న‌ల్లోని న‌డిచింది. అంతేకాదు,2014 మేనిఫెస్టోను కూడా లోకేష్ ద‌గ్గ‌రుండి రూప‌క‌ల్ప‌న చేశాడు. రైతు రుణ‌మాఫీ, డ్వాక్రా రుణ‌మాఫీ త‌దిత‌రాలు ఆయ‌న పొందుప‌రిచిన అంశాలే. విభ‌జిత ఏపీకి చంద్ర‌బాబు సీఎం అయిన త‌రువాత రెండుళ్ల‌కు మంత్రివ‌ర్గంలో స్థానం సంపాదించిన లోకేష్ పంచాయ‌తీరాజ్‌, ఐటీశాఖ‌ల‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌హించాడు. ఆ స‌మ‌యంలోనే న‌గ‌దు బ‌దిలీని తీసుకురావాల‌ని త‌ల‌పోశాడట‌. కానీ, ఆనాడున్న ప‌రిస్థితుల్లో సాధ్యప‌డ‌లేదు.

2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తే న‌గ‌దు బ‌దిలీని కొత్త రూపంలో తీసుకురావాని లోకేష్ భావించాడ‌ట‌. కానీ, అధికారం కోల్పోవ‌డంతో ఆయ‌న మ‌దిలోని న‌గ‌దు బ‌దిలీ అమ‌లుకు నోచుకోలేదు. ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సేమ్ టూ సేమ్ న‌గ‌దు బ‌దిలీ త‌ర‌హాలోనే వివిధ ప‌థ‌కాల‌కు డ‌బ్బును ఆన్ లైన్ ద్వారా ల‌బ్దిదారుల ఖాతాల్లో వేస్తున్నారు. మొత్తం మీద లోకేష్ ఐడియా జ‌గ‌న్ రూపంలో ప్ర‌జ‌లకు అందుతోందని టీడీపీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.