Lokesh: ఏపి అసెంబ్లీలో తల్లికి వందనం పథకం(Talliki Vandanam Scheme)పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సమాధానమిచ్చారు. తల్లికి వందనం పథకానికి విధివిధానాలను రూపొందిస్తున్నామని అన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ‘తల్లికి వందనం’ ఇస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు బడుల విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని ఎన్నికల ప్రచారంలోనే చెప్పామని, ఆ మాటకు కూడా కట్టుబడి ఉన్నామన్నారు. నిబంధనలు రూపొందించేందుకు కాస్త సమయం కావాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా రూపొందించడమే తమ లక్ష్యమన్నారు. ఈ అంశంపై మంత్రులతో చర్చిస్తున్నట్లు చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
గత ప్రభుత్వ వైఫల్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో 72 వేల మంది విద్యార్థులు తగ్గారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోని మంచి విధానాలపై అధ్యయనం చేస్తామని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యాశాఖలో మంచి విధానాలను అమలు చేస్తామన్నారు. గతంలో ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి… ఆ తర్వాత రూ.14 వేలు, అనంతరం రూ.13 వేలకు తగ్గిందన్నారు. అర్హత నిబంధనలు కూడా గత ప్రభుత్వం మార్చిందన్నారు. ఇలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్నామన్నారు. తల్లికి వందనం కింద ప్రతి ఒక్కరికి రూ.15 వేలు ఇస్తామన్నారు.
Read Also: D. Srinivas: డి.శ్రీనివాస్ మృతి పట్ల తెలంగాణ శాసనమండలి సంతాపం