Nara Lokesh: మీడియా పై `లోకేష్` మూడోక‌న్ను!

కేవ‌లం ఒక విభాగం మీడియా ద్వారా ఏ రాజ‌కీయ పార్టీ అధికారంలోకి రాలేదు. ఆ విష‌యాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కీల‌క అధ్య‌య‌నం త‌రువాత ఒక అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - August 19, 2022 / 01:35 PM IST

కేవ‌లం ఒక విభాగం మీడియా ద్వారా ఏ రాజ‌కీయ పార్టీ అధికారంలోకి రాలేదు. ఆ విష‌యాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కీల‌క అధ్య‌య‌నం త‌రువాత ఒక అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అందుకే, సొంత డిజిట‌ల్ మీడియాను బ‌లోపేతం చేసుకుంటున్నార‌ట‌. ప్ర‌స్తుతం సానుకూలంగా ఉంద‌నుకుంటోన్న‌ మీడియాలోని కొంద‌రి ఓవ‌రాక్ష‌న్‌, గ‌తంలోని పోక‌డ‌ల‌ను లోతుగా ప‌రిశీలించార‌ట‌. వాస్త‌వాల‌ను గ్ర‌హించిన మీద‌ట ఆయ‌న ఆశ్చ‌ర్య‌పోయార‌ని తెలుస్తోంది.

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ను ప్రోత్స‌హించిన మీడియా ఆ త‌రువాత క్ర‌మంగా ఆయ‌న్ను వ్య‌తిరేకించింది. 2004 ఎన్నిక‌ల్లో మీడియా మొత్తం చంద్ర‌బాబు ప‌క్షాన ఉంద‌ని ఆనాడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి భావించారు. కానీ, ఆయ‌న అధికారంలోకి వ‌చ్చారు. 2009 ఎన్నిక‌ల్లోనూ మీడియా సింహ‌భాగం చంద్ర‌బాబు ప‌క్షాన ఉందని ప్ర‌త్య‌ర్థులు నిర్థారించుకున్నారు. కానీ, బాబు అధికారంలోకి రాలేక‌పోయారు. విభ‌జ‌న వాదాన్ని మీడియా ద్వారా అణ‌చేయ‌డానికి ప్ర‌య‌త్నం జ‌రిగింది. ఆ విష‌యాన్ని శ్రీకృష్ణ క‌మిటీ కూడా సూచాయ‌గా చెప్పింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌త్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు అయింది. ఇలాంటి అంశాల‌ను అధ్య‌య‌నం చేసిన త‌రువాత మీడియాకు ఇచ్చే ప్రాధాన్యంపై లోకేష్ పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ని తెలుస్తోంది.

వైఎస్ కుటుంబానికి చెందిన `సాక్షి` మీడియా వ‌చ్చిన త‌రువాత జ‌రిగిన ఎన్నిక‌ల‌ను తీసుకుంటే 2014 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గెల‌వ‌లేదు. ఒక వేళ మీడియా ప్ర‌భావం గెలుపోట‌ముల మీద‌ ఉంటే, ఆ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సీఎం కావాలి. కానీ, అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌లేదు. 2009 ఎన్నిక‌ల నాటికి సాక్షి మీడియా ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్ల‌లేదు. మిగిలిన మీడియా అంతా చంద్ర‌బాబు ప‌క్షాన నిలిచింద‌ని ఆనాడు వైఎస్ ఆర్ ప‌దే ప‌దే చెప్పేవారు. అయిన‌ప్ప‌టికీ రెండోసారి సీఎంగా వైఎస్ అయ్యారు.

2004 ఎన్నిక‌ల‌కు ముందు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర‌ను మీడియా క‌వ‌ర్ చేసింది. ఆయ‌న అనుకున్న వ్య‌తిరేక మీడియా సంస్థ‌లు పాద‌యాత్రను బ్యాన‌ర్ ఐట‌మ్ లుగా ప్ర‌చురించాయి. చంద్ర‌బాబుకు అనుకూలం అనుకుంటున్న మీడియా సైతం ఆనాడు మొద‌టి పేజీల్లో వైఎస్ యాత్ర‌ను క‌వ‌ర్ చేసిన సంద‌ర్భాలు అనేకం. సీన్ క‌ట్ చేస్తే, వైఎస్ 2004 ఎన్నిక‌ల్లో సీఎం అయ్యారు. ఆ త‌రువాత మార్గ‌ద‌ర్శి చిట్ ఫండ్ కు సంబంధించిన వివాదాన్ని పెద్ద ఎత్తున ఆనాడు వైఎస్ ప్ర‌భుత్వం తెర‌మీద‌కు తీసుకొచ్చింది. ఆ న్యూస్ ను క‌వ‌ర్ చేయ‌డానికి అప్ప‌ట్లో సాక్షి లేదు. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు అనుకూలంగా ఉంద‌నుకున్న మీడియా కొన్ని నెల‌ల పాటు మార్గ‌ద‌ర్శికి వ్య‌తిరేకంగా మొద‌టి పేజీని కేటాయించి న్యూస్ ను అందించింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు మార్గ‌ద‌ర్శి మీద తిరుగుబాటు ఎగుర‌వేయ‌లేదు.

ప్ర‌స్తుతం చంద్ర‌బాబుకు బాకా ఊదుతున్నాయ‌ని చెబుతోన్న చాన‌ళ్ల‌లో ఒక‌టి `జ‌య‌హో కాంగ్రెస్` అంటూ 2009 ఎన్నిక‌ల్లో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి అండ‌గా నిలిచింది. ఆ త‌రువాత జగన్ మోహన్ రెడ్డి పాద‌యాత్ర‌ను హైలెట్ చేస్తూ 2018 వ‌ర‌కు ఆయ‌నకు మ‌ద్ధ‌తుగా ఉంది. ఇప్పుడు ఆ ఛాన‌ల్ మ‌ళ్లీ చంద్ర‌బాబుకు అండ‌గా నిలుస్తుంద‌న్న వాద‌న బ‌లంగా ఉంది. ఇలా ప‌లు ర‌కాలుగా ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మారే మీడియా కార‌ణంగా పార్టీకి లాభం కంటే న‌ష్టం ఎక్కువ‌గా ఉంద‌ని లోకేష్ తాజాగా స‌న్నిహితుల‌తో చేసిన రివ్యూలో ఒక అభిప్రాయానికి వ‌చ్చార‌ట‌. అందుకే, సొంత మీడియా అనుకుంటోన్న సంస్థ‌ల‌కు సైతం స‌మాచారం ఇవ్వ‌కుండా జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన పెద్ద కుంభ‌కోణాన్ని త్వ‌ర‌లో బ‌య‌ట‌పెడ‌తాన‌ని ప్ర‌క‌టించార‌ని టీడీపీ వ‌ర్గాల్లోని టాక్‌.

కేవ‌లం మీడియా పార్టీని గెలిపించ‌ద‌ని లోకేష్ వాస్త‌వాల‌ను గ్ర‌హించార‌ని ఆయ‌న స‌న్నిహితులు చెప్పుకుంటున్నారు. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసుకుంటూ వెళుతుంటే, మీడియా త‌నంత‌తానే అనివార్యంగా క‌వ‌రేజ్ ఇస్తుంద‌ని విశ్వసిస్తున్నారు. కొన్ని సంద‌ర్భాల్లో అనుకూలంగా ఉంద‌న్న మీడియాలోని ఒక‌రిద్ద‌రి ఓవ‌రాక్ష‌న్ కార‌ణంగా పార్టీకి న‌ష్టం వాటిల్లుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ఎంపీ గోరంట్ల మాధ‌వ్ న్యూడ్ వీడియో వ్య‌వ‌హారాన్ని కుల కోణం నుంచి ఒక‌రిద్ద‌రు సొంత ప్రాప‌కం కోసం రాద్ధాంతం చేశార‌ని లోకేష్ భావిస్తున్నార‌ట‌. అందుకే, మీడియా విష‌యంలో పంథాను మార్చుకుని సొంత డిజిట‌ల్ ఛాన‌ళ్ల‌ను న‌మ్ముకోవ‌డం మేల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు పార్టీ వ‌ర్గాల్లోని వినికిడి. దీంతో ఇప్పుడు ఓవ‌రాక్ష‌న్ ప్ర‌జెంట‌ర్ల ప‌రిస్థితి ఏమిటో చూడాలి.