Amaravati అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైతే, వైసీపీ సభ్యులు హాజరుకాకపోవడాన్ని మంత్రి నారా లోకేశ్ తప్పుబట్టారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆ పార్టీకి రాజధానిపై ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ వైఖరితోనే అర్థమవుతోందని విమర్శించారు. వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏమిటో, ఆయన జ్ఞానం ఎంతో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.
పాదయాత్ర ద్వారా చంద్రబాబు గారికి ‘సినిమా చూపిస్తా’ అని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను లోకేశ్ చమత్కరించారు. “గత ఎన్నికల్లో ప్రజలు జగన్‌కు చూపించిన బ్లాక్‌బస్టర్ సినిమా (11 సీట్లు) ఇంకా సరిపోలేదేమో.. ఆయన ఇప్పుడు చూపిస్తానంటున్న సినిమా 11 రోజులు కూడా ఆడదు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మరోసారి ‘తుగ్లక్’ చర్యలను చూసేందుకు సిద్ధంగా లేరని, అమరావతి తీర్మానాన్ని రాష్ట్రమంతా హర్షిస్తోందని చెప్పారు.
అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం ఈ రాత్రికి నేరుగా ఢిల్లీకి వెళుతుందని లోకేశ్ తెలిపారు. ఏప్రిల్ 1న కేంద్ర కేబినెట్ భేటీలో ఈ బిల్లుకు ఆమోదం లభించే అవకాశం ఉందని… ఏప్రిల్ 2న ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారని వెల్లడించారు. అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్న వైసీపీ నేతలు, ఏప్రిల్ 2న పార్లమెంట్‌లో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అక్కడైనా తమ వైఖరిని స్పష్టం చేస్తారా? లేక అక్కడ కూడా ముఖం చాటేస్తారా? అని లోకేశ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమనుకునే వారికి పార్లమెంట్ వేదికగా సమాధానం లభిస్తుందని ఆయన అన్నారు.
ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని మా నినాదం. అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. అమరావతి పై మీ స్టాండ్ ఏంటి జే టర్న్ @ysjagan గారు?#Amaravati #PsychoFekuJagan pic.twitter.com/pfTnwrxbSF
— Lokesh Nara (@naralokesh) March 27, 2026
